హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఓబీసీ, బీసీ సంఘాలు గుర్రుమీద ఉన్నాయి. వరుసపెట్టి నిరసన గళాలను వినిపిస్తున్నాయి. ఏకంగా ప్రధాని నరేంద్రమోదీని నిలదీస్తూ బహిరంగ వేదికల్లో, లేఖలతో ప్రశ్నలవర్షం కురిపిస్తున్నాయి. బీసీ ప్రధాని హయాంలోనే ఆ వర్గాలకు అన్యాయం జరుగుతున్నదని దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రధాని మోదీ వరంగల్ పర్యటన నేపథ్యంలో వరుసగా బీసీ సంఘాలు బహిరంగ లేఖలను విడుదల చేస్తూ తమ ఆగ్రహాన్ని వెల్లగక్కుతున్నాయి. అక్కడితో ఆగకుండా హామీలను అమలు చేస్తారా? లేదా? అన్న విషయాన్ని వరంగల్‌లో తేల్చాలని పట్టుబడుతున్నాయి.
ఓబీసీ కుల సంఘాల దశాబ్దాల పోరాట ఫలితంగా గత యూపీఏ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సామాజిక ఆర్థిక కులగణన- 2011ను ఆనాటి ప్రభుత్వం బయటపెట్టలేదు. కానీ తమ పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా బీసీ కులగణన చేపడతామని బీజేపీ హామీ ఇచ్చింది. బీసీల నమ్మించిన బీజేపీ అధికారంలోకి వచ్చాక నయవంచనకు గురిచేసింది. ఆ నివేదికలో తప్పులు దొర్లాయని, బహిర్గతం చేయడం సాధ్యం కాదంటూ నిర్లజ్జగా బీజేపీ ప్రకటించింది. అప్పటి నుంచి బీసీ సంఘాలు కులగణనపై కేంద్రాన్ని నిలదీస్తూ వస్తూనే ఉన్నాయి. అయినా మోదీ ప్రభుత్వం పెడచెవిన పెడుతూ వస్తున్నది. బీజేపీ పాలనలో ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్లకే ఎసరు వచ్చిందని బీసీల్లో ఆందోళన నెలకొన్నది.
నాన్ క్రీమీలేయర్ పరిమితి పెంచకుండా ద్రోహం
నాన్ క్రీమీలేయర్ ఆదాయ పరిమితిని పెంచకుండా కేంద్రంలోని బీజేపీ ఓబీసీలకు తీరని ద్రోహాన్ని తలపెడుతున్నదని బీసీ సంఘా ల నేతలు మండిపడుతున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న 8 లక్షల పరిమితిని 15 లక్షలకు పెంచాలని డిమాండ చేస్తున్నారు. డీవోపీటీ నిబంధనల ప్రకారం ప్రతి మూడేండ్లకోసారి నాన్క్రీమీలేయర్ ఆదాయ పరిమితిని సమీక్షించాల్సి ఉంది. దాని ప్రకారం 2020 నాటికి ఒక గడువు ముగిసింది. 2023లో మరో గడువు ముగియాల్సి ఉంది. అయినా కేంద్రం సమీక్షించకుండా కాలయాపన చేస్తున్నదని బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాని మోదీకి బహిరంగ లేఖలు
ప్రధాని మోదీ వరంగల్ పర్యటన నేపథ్యంలో ఇటీవల బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత, ఎంపీ ఆర్ కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్‌తో పాటు అనేక బీసీ కుల, ఉద్యోగ సంఘాల నేతలు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నాయి. బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై ప్రధాని మోదీకి బహిరంగ లేఖలను విడుదల చేశారు. బీసీ నేత ప్రధానిగా అయినా ఎలాంటి ప్రయోజనాలు ఒనగూరలేదని మండిపడుతున్నారు. మున్నెన్నడూ లేనివిధంగా వెనకబడిన వర్గాలు మరింత
వెనక్కి నెట్టివేయబడటం సిగ్గుచేటని ధ్వజమెత్తుతున్నారు. ఇకనైనా హామీ అమలు చేస్తారా? లేదా? అంటూ మోదీని బీసీ నేతలు నిలదీస్తున్నారు. లేదంటే గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరిస్తున్నారు.
బీజేపీ హయాంలో బీసీలకు తీరని అన్యాయం
కేంద్రంలోని బీజేపీ 9 ఏండ్ల పాలన బీసీలకు చీకటి అధ్యాయం. ఒక్కటంటే ఒక్క మేలూ జరిగింది లేదు. ప్రధాని బీసీ అయినా ఎలాంటి మేలు జరుగలేదు. నాన్ క్రీమీలేయర్ ఆదాయ పరిమితి పెంచలేదు. కులగణన చేపట్టలేదు. ఏకంగా రిజర్వేషన్లనే ఎత్తేసే కుట్రలకు కేంద్ర ప్రభుత్వం తెరలేపింది. ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు ఊసే లేదు. ఇకనైనా బీజీపీ సర్కారు బీసీలపై నిర్లక్ష్యాన్ని వీడాలి. లేదంటే రాబోయే ఎన్నికల్లో మోదీ సర్కారుకు గుణపాఠం తప్పదు. ఆ దిశగా త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తాం.
– దుండ్ర కుమారస్వామి, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు