వనపర్తి, ఏప్రిల్ 25: తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. మంగళవారం వనపర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం లో ఆత్మలేని పార్టీలు ప్రతిపక్షాలుగా ఉన్నాయని దుయ్యబట్టారు. రాష్ర్టానికి వచ్చిన అమిత్‌షా రిజర్వేషన్లు తీసేస్తామని మాట్లాడితే.. ఔరంగాబాద్ పర్యటనకు వెళ్లిన కేసీఆర్.. మహారాష్ట్రలో ఐదేండ్లలో ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తామని చెప్పారని గుర్తు చేశారు.
దేశం తిరోగమనం వైపు వెళ్లాలా? ఆధునిక ప్రపంచంతో పోటీపడి పురోగమనం వైపు వెళ్లాలా? ఆలోచించాలని కోరారు. 2024 పార్లమెంటు ఎన్నికలు ఈ దేశ భవిష్యత్తుకు పరీక్ష అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర నాయకురాలు సింగిరెడ్డి వాసంతి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.