జగిత్యాల : అంధత్వ నివారణ కోసం నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసి సీఎం కేసీఆర్ లక్ష్యాన్ని సాకారం చేద్దామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. మంగళవారం జగిత్యాల కలెక్టరేట్ లో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో కంటి వెలుగు కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు.
రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరం చేసి అంధత్వరహిత తెలంగాణగా మార్చడానికి రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు కేంద్రంగా క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రంలో అవసరం ఉన్న అందరికీ కంప్యూటరైజ్డ్ పరీక్షలు నిర్వహించి, ఉచితంగా కండ్లద్దాలు, మందులు అందించాలని అధికారులకు సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు.
మొదటి విడత కంటి వెలుగు స్ఫూర్తితో రెండో విడతను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని తెలిపారు. రేషన్ షాపులు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో క్యాంపులు నిర్వహించాలన్నారు. అనంతరం కంటి వెలుగు క్యాంపుల వివరాల బుక్లెట్ను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, విద్యాసాగర్ రావు, జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేశ్, మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి, జిల్లా కలెక్టర్ రవి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.