KTR | మాజీ ఎంపీపీ సాయిలన్నకు జరిగిన అన్యాయం ఎవ్వరికీ జరగలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దళిత వ్యతిరేకి కాంగ్రెస్‌ను గద్దె దించుదామని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో నిర్వహించిన ఆత్మ గౌరవ గర్జన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ చేతిలో అవమానానికి గురైన దళిత బిడ్డ ముదాం సాయిలను కేటీఆర్ సన్మానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సాయిలన్నపై దాడికి బదులు తీర్చుకుందామని పిలుపునిచ్చారు. దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అన్నారు. దళితులకు న్యాయం చేయాలని కేసీఆర్ దళిత బంధు పథకం తెచ్చారని కేటీఆర్ తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు 12 లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేసిందని విమర్శించారు. 18 నెలల్లో కాంగ్రెస్ పాలనలో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ సెక్రటేరియట్‌కు కేసీఆర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాడని గుర్తుచేశారు. దళితులకు అన్ని పనుల్లో 26 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారని అన్నారు. సాయిలు బట్టలిప్పి అవమానించినట్లు.. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బట్టలు విప్పి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
అభయహస్తం ఈ శతాబ్ది అతిపెద్ద మోసం అని కేటీఆర్ అన్నారు. రుణమాఫీ చేయకుండానే రైతులను మోసం చేశాడని విమర్శించారు. రేవంత్ రెడ్డి రైతులకు రెండుసార్లు రైతు భరోసా ఎగ్గొట్టాడని కేటీఆర్ అన్నారు. రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు పడటం లేదు కానీ.. రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం టకీ టకీమని డబ్బులు పడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఢిల్లీకి మూటలు పంపడంలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి నమ్మక ద్రోహం చేశారని ఆరోపించారు. ఎల్లారెడ్డిపేట నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. కరోనా సమయంలో కూడా కేసీఆర్ అన్ని పథకాలను అమలు చేశాడని గుర్తుచేశారు. కానీ చేతగాని రేవంత్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గురుకులాల్లో విద్యార్థులకు రేవంత్ రెడ్డి విషయం పెడుతున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. 100 మంది పిల్లను రేవంత్ రెడ్డి బలితీసుకున్నాడని అన్నారు. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పే శక్తి ప్రజలకే ఉందని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
అంబేద్కర్ జయంతి నాడు లింగంపేట అంబేద్కర్ చౌరస్తాలో ఉద్యమ కారుడు, దళిత బిడ్డ ముదాం సాయిలును అవమానించిన కాంగ్రెస్ సర్కార్ పైన తప్పకుండా బద్లా తీసుకుంటాం.
ఈ దళిత వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి తీరుతాం.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/0wXu5BDH9i
— BRS Party (@BRSparty) July 25, 2025