హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూలిందంటున్న మేడిగడ్డ బరాజ్పైనే చర్చ పెడదాం. దమ్మంటే మేం విసిరిన ఈ సవాల్ స్వీకరించాలి’ అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సవాల్ విసిరారు. గతంలో ముఖ్యమంత్రి చేసిన సవాలుకు స్పందించి తాను సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో చర్చకు వెళ్తే రాకుండా పారిపోయిన పిరికిపంద రేవంత్‌రెడ్డి అని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన దళితబంధు సాధన సమితి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. తెలివిలేక కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని రేవంత్‌రెడ్డి అంటున్నారని, ఆ కూలిందంటున్న మేడిగడ్డ బరాజ్పైనే చర్చపెడదామని, దమ్ముంటే తమ సవాల్‌ను స్వీకరించాలని సవాల్ విసిరారు. గతంలో చర్చకు పిలిచి పారిపోయిన రేవంత్‌రెడ్డి మరొకసారి చర్చకు వస్తావా అని అడుగుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గం చివరి మడి వరకు నీళ్లిచ్చిన నాయకుడు కేసీఆర్ అని రేవంత్‌కు తెలిసినా కావాలనే అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డి పదేపదే దిగజారి మాట్లాడుతున్నాడని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే ‘ఏం చేస్తారో చేసుకోండి, నన్ను కోసుకు తింటారా అంటూ’ రంకెలు వేస్తున్నారని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. పరిస్థితులు ఇలాగే ఉంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
అంబేదర్ రాజ్యాంగం రాసినప్పుడు రేవంత్‌రెడ్డి లాంటి దొంగలు పదవుల్లోకి వస్తారని ఊహించలేదని, అందుకే ఐదు సంవత్సరాల పాటు పదవిలో ఉండేలా రాజ్యాంగం రాశారని కేటీఆర్ పేర్కొన్నారు. లేదంటే రేవంత్ లాంటి మోసగాళ్లను రీకాల్ చేసే వ్యవస్థను కూడా ప్రవేశపెట్టేవారని అన్నారు. నేతలను తిట్టడం తమకు ఇష్టం లేదని, కానీ రేవంత్‌రెడ్డికి ఆయన భాషలో చెప్తేనే అర్థమవుతుంది కాబట్టే, తాము అలా మాట్లాడాల్సి వస్తున్నదని వివరించారు.
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసమని విమర్శించిన కేటీఆర్ 420 హామీలు ఇచ్చి తెలంగాణలోని సబ్బండ వర్ణాలను నిట్ట నిలువునా మోసం చేశారని ఆరోపించారు. ‘100 రోజుల్లో హామీల అమలు చేస్తామని చెప్పి, ఇప్పుడు అడిగితే సామాజిక మాధ్యమాల నుంచి ప్రజాక్షేత్రం వరకు ప్రతి ఒకరిపై అప్రజాస్వామికంగా కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాల అణిచివేత చర్యలకు పాల్పడినా, కాంగ్రెస్ ప్రజావ్యతిరేక మోసపూరిత విధానాలను ఎండగట్టడం ఆపబోమని కేటీఆర్ తేల్చి చెప్పారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితబంధును నిలిపివేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దళితబంధు సాధన సమితి నాయకులు బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళితబంధు లబ్ధిదారులకు కావాలనే నిధులు నిలిపి వేసిందని, ఈ అంశంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రతి దళిత బిడ్డకు దళితబంధు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితబంధుపై పెట్టిన ఫ్రీజింగ్‌ను వెంటనే తొలగించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లుగా దళితబంధు కింద రూ. 12 లక్షలు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమారకు పార్టీ తరఫున లేఖ రాయనున్నట్టు ఆయన తెలిపారు.
దళితబంధును కేవలం ఓట్ల కోసమో, సీట్ల కోసమో ప్రకటించలేదని, దళితుల జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావడం కోసం చేపట్టిందే ఈ పథకమని కేటీఆర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన రూ. 10 లక్షలకు అదనంగా మరో రూ. 2 లక్షలు కలిపి, మొత్తం రూ. 12 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి, దళితుల ఓట్లు వేయించుకొని, చివరకు వారిని మోసం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ 40 ఏండ్ల క్రితం సిద్దిపేట ఎమ్మెల్యేగా దళితుల జీవితాల్లో ఎదురైన సమస్యలను అధ్యయనం చేసేందుకు దళిత చైతన్య జ్యోతి పేరుతో చేపట్టిన కార్యక్రమం స్ఫూర్తిగా, దళితుల జీవితాల్లో మార్పులు తీసుకురావడం కోసం, ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. దేశ చరిత్రలో దళితబంధు, రైతుబంధు వంటి పథకాలను దమ్మున్న నాయకుడు కేసీఆర్ మాత్రమే తీసుకురాగలరని పేరొన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దళితుల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కల్యాణలక్ష్మి, గురుకులాలు ఏర్పాటు, దళితబంధు వంటివి అనేక కార్యక్రమాలను చేపట్టిందని కేటీఆర్ గుర్తు చేశారు.
దళితుల జీవితాలను శాశ్వతంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కేసీఅర్ రూపొందించిన దళితబంధును కాంగ్రెస్ నిలిపివేసిందని కేటీఆర్ మండిపడ్డారు. దళితబంధుతో వందల దళిత కుటుంబాల్లో వెలుగులు నిండాయని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దళితులను అడుగడుగునా మోసం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన ప్రతి హామీని తుంగలో నిలువునా మోసం చేస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు.