
అవనిపై జరిగేటి అవకతవకలు చూసి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె మాయమోసము జూచి మండి పోవును ఒళ్ళు
అని కవి కాళోజీ అన్నట్టు.. ప్రజానేత, తెలంగాణ జన మనోరథుడు కేసీఆర్ దేశ రాజకీయాల పట్ల ఆవేదన చెందారు.
ప్రధాని మోదీకి ఎదురులేదని బీజేపీ శ్రేణులు విర్రవీగుతున్న తరుణంలో దక్కన్ పీఠభూమిపై నుంచి సింహ గర్జన చేశారు. దేశమంతా కరోనాతో కకావికలమై ఉంటే, కేంద్ర ప్రభుత్వం రివాజుగా, మొక్కుబడిగా అంకెల గారడీ బడ్జెట్ ప్రవేశ పెట్టిన తీరు కేసీఆర్‌లో ధర్మాగ్రహమై అగ్నిజ్వాలా కేతనమై ఎగిసింది.
‘ఇండియా గుండెల మీద స్టెతస్కోప్ పెట్టి చూశాను పరీక్షగా… నగ్నంగా ఉన్న చెవుల శరీరాలకు.. అగ్నిలా చురకలు తగిలిన.. సెగల అలజడి నాలో… ఇది రోగం కాదు ఘోరం.. ఇది పాపం కాదు శాపం’
అని కవి అలిశెట్టి ప్రభాకర్ అన్నట్టుగా.. జాతీయ పార్టీల దుర్మార్గం దేశాన్ని ఎలా దురవస్థల పాలుజేస్తున్నదో కేసీఆర్ సోమ వారం విడమరిచి వివరించారు. యువజనం మొదలుకొని దళితుల దాకా బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని ఏకి పారేశారు. బీజేపీ విముక్త భారత్‌కు తరుణం ఆసన్న మైందని రణన్నినాదం చేశారు.
‘అతని కళ్లలో దీపం కాంతి ప్రతి ఫలిస్తున్నది. పురోగమనం అతని నైజం.. గతుకుల దారిలో కూడా నమ్మకం దుప్పటి పరుస్తాడు.. లోయైనా, శిఖరమైనా, నిబ్బరమే నిలువెత్తు జెండా’
అని కవి సోమేపల్లి వెంకట సుబ్బయ్య అన్నట్టు తెలంగాణలో పుట్టిన బక్క మనిషి ఈ సారి దేశం కోసం.. విల్లు ఎక్కు పెట్టాడు…
తెలంగాణ ఉద్యమమే స్ఫూర్తిగా, దేశమే జెండాగా కేసీఆర్ మళ్లీ రణరంగంలోకి దిగుతున్నాడు
నాయకులను కాదు.. ప్రజలను నమ్ముకొని! పదవుల కోసం కాదు..ప్రజల కోసం!
నయా సోచ్.. నయా దిశ.. నయా సంవిధాన్.. మా ఆలోచన మార్పు కోసం మహా విప్లవం రావాలి, అందుకోసం బయల్దేరుతా నలుగురు నాయకులను పోగేయడం నా లక్ష్యం కానే కాదు ఒక పౌరుడిగా దేశం కోసం ప్రాణం బలివ్వాల్సి వస్తే అందుకు సిద్ధం 75 ఏండ్ల రాజ్యాంగం ఈ దేశ అవసరాలను ఏమాత్రం తీర్చలేదు హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సదస్సు ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడిన, మహారాష్ట్రకు వెళ్లి ఆయనతో చర్చిస్తా
-ముఖ్యమంత్రి కేసీఆర్ రణన్నినాదం
ఇవి మాటలా.. తూటాలా
ధర్మ శ్లోకం చదివి ఇంత అధర్మమా నిర్మలమ్మా?
దాపయిత్వా కరం ధర్మ్యం,
రాష్ట్రం నిత్యం యథావిధిః
అశేషాన్ కల్పయేద్రాజా
యోగక్షేమాన్ అతన్ద్రితః
అర్థం…రాజు ధర్మమార్గంలోనే పన్నులు వసూలు చేయాలి. ఆ పన్నులతో రాజ్యంలోని ప్రజలందరికీ అన్ని రకాల యోగ క్షేమాలను కల్పించాలి.పంచమ వేదంగా భావించే మహా భారత శాంతిపర్వంలోని ఈ ధర్మ శ్లోకాన్ని చెప్పి మరీ అధర్మానికి పాల్పడుతావా నిర్మలమ్మా!! మీరూ హైదరాబాద్ నీళ్లు తాగి పెరిగిన బిడ్డే కదా! తెలుగువారి కోడలినని చెప్పుకొంటారు కదా! ఆత్మ లేదా! మా హైదరాబాద్ ఆర్బిట్రేషన్ సెంటర్ గురించి బడ్జెట్లో మాటైనా చెప్పరా? వంద కోైట్లెనా ఇవ్వరా? మోదీ కోసం గుజరాత్లో ఆర్బిట్రేషన్ సెంటర్ అంటూ మా ఐఏఎంసీకి శిఖండిని అడ్డంపెడతారా? నిర్మలమ్మా ఇది ఆత్మద్రోహం కాదా? సిగ్గనిపించలేదా?
ప్రబలమైన మార్పుకోసం ప్రయత్నిస్తా
దేశంలో పరివర్తన, గుణాత్మకమైన మార్పు, ప్రబలమైన మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. ఆ మార్పు కోసం కేసీఆర్‌గా, ఈ దేశ బిడ్డగా, ప్రజా జీవితంలో ఒక ఉన్నత స్థాయికి చేరుకొన్న వ్యక్తిగా.. తప్పకుండా నా బాధ్యత నిర్వర్తిస్తా. ఆ బాధ్యత ఏ రూపంలో ఉంటది? అనేదానిపై దేశంలో చాలా మందితో మాట్లాడుతున్నాం. కొద్ది రోజుల్లోనే ఆ పాలసీని బయట పెడతాం. తప్పకుండా దేశంలో రావాల్సిన ప్రబల మార్పు కోసం ఏయే ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తాం.
యువతా మేలుకో.. దేశాన్ని కాపాడుకో..
యువతకిదే విజ్ఞప్తి.. ఈ దేశ ప్రజలకు, యువతకు నా విజ్ఞప్తి ఒక్కటే. యువజనులారా మేల్కొనండి. ఈ దేశం మీది. భవిష్యత్తు మీది. ఈ దేశాన్ని కాపాడుకునే బాధ్యత మీది. ఈ దేశం నిద్రాణమై లేదు. చేతగాక, చేవలేక కాదు. శక్తి చాలక కాదు. నోర్మూసుకొని పడి ఉంటమా? ఇది ప్రజాస్వామ్యం. కేంద్రంలో ప్రస్తుతం ఉన్నది చెత్త ప్రభుత్వం, పనికిమాలిన ప్రభుత్వం.
ఈ దరిద్రపుగొట్టు బీజేపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పీకి బంగాళాఖాతంలో పారేయాలి.
నా మాట తప్పైతే రాజీనామా చేస్తా
ఈ దేశంలో సాగునీళ్లు లేవా? జల సంఘం లెక్కల ప్రకారం 65 వేల టీఎంసీలు ఉన్నాయి. దేశంలో నీటిని వినియోగించుకొనే విధానం తప్పుగా ఉన్నది. దేశంలో విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 4 లక్షల ఒక్క వేయి మెగావాట్లు ఉన్నప్పటికీ ఈ దేశం ఇంకా అంధకారంలో ఎందుకు ఉన్నది? ఇప్పటికీ మనం వినియోగించుకునే విద్యుత్తు 2 లక్షల మెగావాట్లే. ఈ దేశం విద్యుత్తు సమస్యను ఎదుర్కొనడానికి కారణం పాలకులకు మెదడు లేకపోవడం కాదా? నేను చెప్పే విషయాలు తప్పని రుజువు చేస్తే సీఎం పదవికి నిమిషంలో రాజీనామా చేస్తా.
పరిశ్రమలు హైదరాబాద్‌కే ఎందుకొస్తున్నయంటే..
హైదరాబాద్‌కు నిధులు, పరిశ్రమలు ఎందుకు వస్తున్నయ్? హైదరాబాద్ ఎకో బాగుంది. కల్చర్ బాగుంది. శాంతి భద్రతలున్నయి. 24 గంటల కరెంటుంది. మంచి నీళ్లు దొరుకుతయ్. నోరు, కడుపు కట్టుకొని, పైసా అవినీతి లేకుండా, బీపాస్, ఐపాస్లు తెచ్చి, పారిశ్రామికవేత్తలకు అనుకూల వాతావరణం కల్పించిన. కష్టపడి నేను ఇవన్నీ చేసిన కనుకనే ఇవాళ హైదరాబాద్‌కు పరిశ్రమలు క్యూ కడుతున్నయ్. అఫ్గానిస్థాన్‌లో ఉద్యోగం చెయ్యిమంటే, పెట్టుబడి పెట్టుమంటే ఎవడైనా పెడ్తడా? ఎందుకు? ఎందుకంటే అక్కడ బతుక్కు గ్యారెంటీ లేదు. మరి దేశాన్ని మత పిచ్చితో నాశనం చేసుకొంటే మన పరిస్థితి ఏమైతది? ఈ దేశ ప్రజలు ఆలోచించాలి.
దళితద్రోహి సర్కారు.. గిరిజన ద్రోహి సర్కారు..
ఇది ఈ దేశ ప్రజలు బాగా ఆలోచించాల్సిన విషయం. ఇవ్వాళ పెట్టిన బడ్జెట్లో ధోకా చేశారు. 40 కోట్ల జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీలకు 12,800 కోట్లు కేటాయించారు. ఇది దళిత సర్కారా, గిరిజన సర్కారా? ఇది దళిత ద్రోహి.. గిరిజన ద్రోహి.. రైతుద్రోహి సర్కారు. పేదవాళ్లంటే వీళ్లకు ఏమీ పట్టదు. మోదీ సర్కారు సమయం 80% అయిపోయింది. ఇప్పుడు బండారం బయటపడింది.
మన సొమ్ములు.. మోదీ సోకులు
కేంద్రం నుంచి మనకు రావడం కాదు, కేంద్రానికే మనం సొమ్ములిచ్చి సాదుతున్నం. మన నుంచి కేంద్రానికి పోయేది 60 వేల కోట్లు. మన కొచ్చేది 22 వేల కోట్లు. ఇది కూడా మన హక్కు. ఇక 8 ఏండ్లలో కేంద్ర శాఖల ద్వారా తెలంగాణకు వచ్చింది 42 వేల కోట్లు. తెలంగాణ ప్రభుత్వం ఒక్క రైతు బంధుకు పెట్టిన ఖర్చే 50 వేల కోట్లు. 8 ఏండ్లలో కేంద్రం నుంచి వచ్చింది ఒక్క రైతు బంధుకు సమానం కాదు. కేంద్రం నుంచి వచ్చిందే లేదు. ఇక డైవర్షన్ ఎక్కడ? మన సొమ్ములు, మోదీ సోకులు.
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పనితీరు, విధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ దేశం బాగుపడాలంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి వేయాలని అన్నారు. తప్పకుండా ఆ పని చేస్తామని హెచ్చరించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో నవశకం మొదలుకావాలన్న ముఖ్యమంత్రి.. దేశం కొత్త వెలుగులు చిందించాలని, ఉజ్వల భారత్ నిర్మాణం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ దిశగా దేశ ప్రజల్లో పరివర్తన రావాలని అన్నారు. యువత మేలుకోవాలని, దళితులు, మేధావివర్గం, యువత ఈ దేశాన్ని కాపాడుకోవాలని చెప్పారు. ఈ దేశంలో దేనికీ లోటు లేదని, ఉన్నదంతా పాలకుల వైఫల్యమేనని స్పష్టంచేశారు. ‘దీన్ని చూస్తూ మౌనంగా భరిద్దామా? ఇలాగే కూర్చుంటే దేశ వికాసం పెరుగుతుందా?’ అని ప్రశ్నించారు. ‘ఒకనాడు తెలంగాణ పరిస్థితి కూడా ఇలాగే ఉండేది. ప్రాణాలను లెక్కచేయకుండా తెలంగాణ కోసం కోట్లాడలేదా? అలాగే దేశం కోసం పోరాడుతా. ఇక ఎంత మాత్రం మౌనంగా ఉండదలుచుకోలేదు. నేనే త్వరలో ప్రారంభించబోతున్నా. మనమంతా సిపాయిలం. ఎక్కడన్నా లోపం ఉన్నదంటే.. అది పాలకులదే. ఈ దేశంలో ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు జనాన్ని రెచ్చగొట్టడమొక్కటే వారికి తెలిసింది’ అని కేసీఆర్ చెప్పారు.
రాష్ట్రం ఏర్పడితే రెండేండ్లలోనే మార్పు తెచ్చి చూపిస్తామని తెలంగాణ ఉద్యమ సందర్భంగా చెప్పానని, ఆ రోజు చెప్పినట్టుగానే రెండేండ్లలో 24 గంటల విద్యుత్ సరఫరా చేసి చూపించానా? లేదా? ఈ దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా 24 గంటల విద్యుత్తు ప్రతి రంగానికి ఇస్తున్నారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ‘చాలా బాధాకరం ఏందంటే కేంద్రంలోని బీజేపీకి సిగ్గు శరం లేదు. చాలా విషయాల్లో దరిద్రంగా ఉన్నది. ఈ భారత సమాజం అనుకొన్నట్టుగా పురోగమించాలంటే ఈ దరిద్రపుగొట్టు పార్టీని కూకటివేళ్లతో సహా పీకి బంగాళాఖాతంలో పడేయాలి. తప్పకుండా ఆ పని వందశాతం చేస్తాం. వీళ్లకు పొగరు కూడా బాగా నెత్తికెక్కింది. కండ్లు నెత్తికొచ్చి ఎవరి మీద పడితే వాళ్లమీద.. ఎటుపడితే అటు మాట్లాడుతున్నరు. తప్పకుండా కూకటివేళ్లతో సహా పెకిలించి పడేస్తాం. దేశానికి ఏం అవసరమో అది చేస్తాం. ఈ దేశమేమీ నిద్రాణమై లేదు. దేశంలో శక్తిలేక.. చేతకాక ఎవరూ లేరిక్కడ. అవసరమైతే ఉద్యమిస్తాం. ఏం చేస్తామో అది చేస్తాం. నోరు మూసుకొని పడి ఉంటామా? మీ దుర్మార్గాలను పీకి అవతలపారేస్తాం. ఇది ప్రజాస్వామ్యం’ అని తీవ్ర పదజాలంలో కేంద్ర సర్కారును హెచ్చరించారు.
పరివర్తన, గుణాత్మక, ప్రబల మార్పు రావాలి
దేశంలో పరివర్తన, గుణాత్మకమైన మార్పు, ప్రబలమైన మార్పు రావాల్సిన అవసరం ఉన్నదని కేసీఆర్ స్పష్టంచేశారు. ‘ఆ మార్పు కోసం కేసీఆర్‌గా, ఈ దేశ బిడ్డగా, ప్రజా జీవితంలో ఒక ఉన్నత స్థాయికి చేరుకొన్న వ్యక్తిగా.. తప్పకుండా నా బాధ్యత నిర్వర్తిస్తా. ఆ బాధ్యత ఏ రూపంలో ఉంటది? అనేదానిపై దేశంలో చాలా మందితో మాట్లాడుతున్నాం. కొద్ది రోజుల్లోనే ఆ పాలసీని బయట పెడతాం. తప్పకుండా దేశంలో రావాల్సిన ప్రబల మార్పు కోసం ఏయే ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తాం’ అని కేసీఆర్ స్పష్టంచేశారు.
ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడుతున్న..
కేంద్రంలోని ప్రజాకంటక పాలనపై చర్చ జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశ ప్రజలంతా ఏకతాటిపైకి రావాలని, కేంద్రంలోని ప్రజాకంటక ప్రభుత్వంపై యావత్తు దేశం తిరగబడాలని పిలుపునిచ్చారు. ‘దేశ ప్రజలకు మాట ఇస్తున్నాను. ఆ దిశగా నా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందరితో మాట్లాడుతున్నాను. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో కూడా మాట్లాడాను. అతి త్వరలోనే నేను వారితో సమావేశం కానున్నాను’అని కేసీఆర్ తెలిపారు.
ఈ దేశం.. యువతదే
‘ఈ దేశం మాది కాదు.. యువతది. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏండ్ల తర్వాత కూడా దేశ ప్రజలకు మంచినీటిని సరఫరా చేయలేని దుస్థితిలో ఉండటం బాధాకరం. మంచినీళ్లు లేవు, సాగునీళ్లు లేవు. ఈ దేశంలో సాగునీళ్లు లేవా? కేంద్ర జల సంఘం లెక్కల ప్రకారం 65 వేల టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో నీటిని వినియోగించుకొనే విధానం తప్పుగా ఉన్నది. దేశంలో విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 4 లక్షల ఒక్క వేయి మెగావాట్లు ఉన్నప్పటికీ ఈ దేశంలో ఇంకా అంధకారంలో ఎందుకు ఉంది? ఇప్పటికీ మనం వినియోగించుకునే విద్యుత్తు 2 లక్షల మెగావాట్లు మాత్రమే. ఈ దేశం విద్యుత్తు సమస్యను ఎదుర్కొనడానికి కారణం పాలకులకు మెదడు లేకపోవడం కాదా? నేను చెప్పే విషయాలు తప్పని రుజువు చేస్తే ముఖ్యమంత్రి పదవికి నిమిషంలో రాజీనామా చేస్తా’ అని సీఎం చెప్పారు.
అబద్ధాల ప్రధాని.. చెత్త ప్రభుత్వం
ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వం దేశానికి చెప్పేవన్నీ అబద్ధాలేనని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ఈ దేశాన్ని చెత్త ప్రభుత్వం, పనికిమాలిన ప్రభుత్వం పరిపాలిస్తున్నదని ధ్వజమెత్తారు. అబద్ధాల్లో బతుకుతూ, మతపిచ్చి లేపుతుందని మండిపడ్డారు. ‘ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దేశ సమగ్రతను నాశనం చేస్తున్నది. నేను భారత ప్రభుత్వంపై ఆరోపణ చేస్తున్నాను. అఫ్గానిస్థాన్‌లో పెట్టుబడి పెట్టమంటే ఎవరైనా అక్కడ పెట్టుబడి పెడుతారా? అక్కడ ఎందుకు పెట్టుబడులు పెట్టడంలేదు? అక్కడ పెట్టుబడులకు, జీవితానికి గ్యారంటీ లేదు. తెలంగాణ రాష్ర్టానికి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చినయి. నిన్ననే 1500 కోట్లతో పెట్టుబడి పెట్టడానికి ఓ కంపెనీ ముందుకొచ్చింది. దానితో రెండు వేల మందికి ఉద్యోగాలు వస్తయి.
రాష్ట్ర బీజేపీ నేతలు మొరిగే కుక్కలు
రాష్ట్ర పరిపాలనపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న బీజేపీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ‘మేము అవినీతి చేసినమని మీరు (బీజేపీ నేతలు) అంటున్నరు. మీరు మెరిగే కుక్కలని మేము అంటం. తెలంగాణ వట్టిగనే నిర్మాణం అయిందా! కోట్లు, లక్షల లంచాలు ఇచ్చే బిల్డింగ్ అనుమతులు.. ఇప్పుడు టీఎస్‌బీపాస్ ద్వారా ఆన్లైన్లో ఒక్క రూపాయి లంచం లేకుండానే ఇస్తున్నాం. దీనికి చట్టం చేసినం. 15 రోజుల్లో అనుమతి లేకుంటే 16వ రోజు డిమ్డ్ టు అప్రూవ్డ్ అన్నాం. మాది అవినీతి ప్రభుత్వం అయితే, మేము అవినీతిపరులం అయితే ఆన్లైన్ అనుమతులు ఎందుకు ఇస్తం? పక్క రాష్ట్రంలో రియల్ ఎస్టేట్‌లో చదరపు అడుగుకు ఇంత అని వసూలు చేస్తున్నారు. ఇక్కడ ఆన్లైన్లో అనుమతులు ఇస్తున్నాం’ అని చెప్పారు. ఇక్కడ పొలిటికల్ గుండాగిరి లేదు, భూకబ్జాలు లేవు, గుడుంబా గబ్బు లేదు, పేకాట క్లబ్బులు లేవు.. ఇవన్నీ వాస్తవాలు కాదా? అని ప్రశ్నించారు. ‘ఇష్టం వచ్చినట్టు.. కుక్కలు మెరిగినట్టు మెరుగుతం అంటే.. అందుకే మిమ్ముల్ని పిచ్చి కుక్కలు అంటం. మేము ఉరుకుంటమా? ఎందుకు ఉరుకోవాలి? మీ దిక్కుమాలిన దందాతోటి ఈ సమాజాన్ని కరాబు కానిస్తమా? ప్రాణాలు ఫణంగా పెట్టి, సచ్చే దాకా కొట్లాడి తెచ్చిన తెలంగాణ ఇది. ఎవరో కుక్క గాళ్లు, నక్క గాళ్లు వచ్చి కరాబు చేస్తమంటే కూర్చుంటమా.. కూర్చోవాల్నా! ఇండియాలో ఎక్కడా లేని సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ అమలు చేస్తున్నాం. ఇది మీకు జీర్ణం కావడంలేదు. బీజేపీ పరిపాలించే రాష్ర్టాల సీఎంలకో, ప్రధానమంత్రికో, మీకు తెలివి ఉన్నదా?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు.
వాళ్లిచ్చిన డబ్బు రైతుబంధుకు సాటి కాదు
తెలంగాణ నుంచి వెళ్లే డబ్బులతో కేంద్రం సోకులు పోతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చేది గుండుసున్నా. మనదగ్గర నుంచి పోతే కేంద్రం బతుకుతాంది. మన సొమ్ముల మీద వాళ్ల సోకు పడుతాండ్లు’ అని విమర్శించారు. ‘భారతదేశాన్ని సాదే ఐదారు రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి. మన నుంచి కేంద్రానికి పోయేది రూ.60వేల కోట్లు. మనకు వచ్చేది రూ.22వేల కోట్లు. అదికూడా మన హక్కు. అది పోనూ విద్య, వైద్యం రెండు మూడు స్కీముల్లో వస్తాయి. కేంద్రం నిర్వహించే శాఖల ద్వారా దేశవ్యాప్తంగా వాటిని ఖర్చుపెడతరు.. అందులో మనకూ వస్తయి. దాంట్లో తెలంగాణ ఏర్పడిన మొదలు.. ఈ రోజు వరకు వచ్చింది రూ.42వేల కోట్లు. ముఖ్యమంత్రిగా అధికారికంగా చెబుతున్న. మనం రూ.10 లక్షల కోట్లు ఖర్చుపెట్టినం. అందులో మన రైతు బంధు రూ.50,600 కోట్లు ఇచ్చినం. మనం ఒక్క స్కీమ్ కింద ఖర్చుపెట్టినంత కూడా కేంద్రం నుంచి మనకు రాలే. ఎనిమిదేండ్లలో కేంద్ర పథకాల ద్వారా మనకు వచ్చింది కనీసం రైతుబంధుకు సమానం కాదు’ అని స్పష్టంచేశారు.

అమ్ముకునే వాడికి అమావాస్య అయితేంది.. పున్నమైతేంది
40 కోట్ల ఎస్సీ, ఎస్టీలకు 12,800 కోట్లేనా
దళిత గిరిజనులకిది మోదీ బహుమతి
ఎరువుల సబ్సిడీలో 35 వేల కోట్ల కోత..
రైతులకిది మోదీ బహుమతి
ఉపాధి హామీకి 25 వేల కోట్ల కోత…
పేద కూలీలకిది మోదీ బహుమతి
ఆహార సబ్సిడీలో 65 వేల కోట్ల కోత..
అన్నార్తులకు మోదీ బహుమతి
ఐటీకి మినహాయింపు పెంపు లేదు..
ఉద్యోగులకిది మోదీ బహుమతి
22కల్లా అందరికీ ఇళ్లన్నారు
మోదీగారూ… ఏదీ? ఎక్కడ?
22కల్లా రైతు ఆదాయం రెట్టింపన్నారు
మోదీగారూ… ఏదీ? ఎక్కడ?
ప్రతి ఖాతాలో 15 లక్షలు వేస్తానన్నారు
మోదీగారూ… ఏదీ? ఎక్కడ?
22కల్లా నల్లధనమంతా తెస్తానన్నారు
మోదీగారూ… ఏదీ? ఎక్కడ?
22కల్లా పది కోట్ల ఉద్యోగాలన్నారు
మోదీగారూ… ఏదీ? ఎక్కడ?