Government Schools | హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : సర్కారు బడుల్లో (Government Schools) సంపన్నుల పిల్లలు చదవడంలేదు. ఓసీ వర్గానికి చెందిన విద్యార్థుల్లో (OC Students) అత్యధికులు ప్రైవేట్ బడుల్లోనే (Private Schools) చదువుతున్నారు. ఈ విషయం విద్యాశాఖ తాజా గణాంకాల్లో వెల్లడయ్యింది. సర్కారు బడుల్లోని మొత్తం విద్యార్థుల్లో జనరల్ క్యాటగిరీ విద్యార్థుల శాతం కేవలం 7.74% మాత్రమే. అంటే వందలో 8 మందిలోపు మాత్రమే చదువుతున్నారు. మరీ సర్కారు బడుల్లో అత్యధికంగా చదువుతున్నదెవరంటే.. బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులే. అత్యధికంగా 54.81% బీసీ విద్యార్థులు చదువుతున్నారు.
సర్కారు బడుల్లో మొత్తం 19.30లక్షల మంది విద్యార్థులుంటే 10.58లక్షల మంది ఓబీసీలే ఉండటం గమనార్హం. ఎస్టీల శాతం 13.39% ఉండగా, ఎస్సీలు 24.06%గా ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా సర్కారు బడులే ఉండగా.. ఎన్రోల్మెంట్ చాలా తక్కువగా ఉంది. అదే ప్రైవేట్ బడులు తక్కువగా ఉండగా ఎన్రోల్మెంట్ అధికంగా ఉంది. 63.5% సర్కారు బడుల్లో ఎన్రోల్మెంట్ కేవలం 31.76శాతమే. అదే ప్రైవేట్ స్కూళ్లు 28.98% మాత్రమే ఉండగా.. ఎన్రోల్మెంట్ 59.53శాతంగా ఉంది. గురుకులాలు 3.14శాతముంటే ఎన్రోల్మెంట్ 7.3శాతమే. రాష్ట్రంలో ప్రైవేట్ బడులపై మోజు ఎలా ఉందో చెప్పేందుకు ఈ గణాంకాలు చాలు. 63% బడుల్లో 31% ఎన్రోల్మెంట్ ఉంటే.. 29% బడుల్లో 60% విద్యార్థులున్నారు.
