వికారాబాద్: వికారాబాద్ (Vikarabad) జిల్లా కొత్తపల్లిలో చిరుతపులి కలకలం సృష్టించింది. గ్రామ శివారులో బహిర్భూమికి వెళ్లిన వ్యక్తిపై చిరుత దాడిచేసింది. శుక్రవారం ఉదయం గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి బహిర్భూమికి వెళ్లాడు. ఈ క్రమంలో అతనిపై చిరుత దాడిచేసింది. దీంతో అతడు స్వల్పంగా గాయపడ్డారు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని గ్రామంలోకి వచ్చిన శేఖర్‌ను పులి వెంటాడింది.
అయితే అతని అరుపులు విన్న స్థానికులు ఇండ్ల నుంచి బయటకు రావడంతో అది అక్కడి నుంచి పరారయింది. గాయపడిన శేఖర్‌ను కుటుంబ సభ్యులు మహబూబ్‌నగర్ దవాఖానకు తరలించారు. కాగా, ఏ నిమిషంలో చిరుత దాడి చేస్తుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పులిని వెంటనే పట్టుకోవాలని అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. ప్రజలు ఒంటరిగా బయటకు రావొద్దని సూచించారు.