నల్లగొండ, డిసెంబర్ 24: నల్లగొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు కొత్తగా వచ్చిన ప్రభుత్వం నిధులు కేటాయించి పూర్తి చేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. ఆదివారం నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తనవంతుగా ప్రాజెక్టులపై సూచనలు, సలహాలు అందించినట్టు తెలిపారు. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ప్రొటోకాల్‌ను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు ఇప్పట్లో సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో సృష్టించిన ఆస్తుల మీద స్వేదపత్రం విడుదల చేసిందని, దీని ద్వారా రాష్ర్టానికి ఏం చేసిందో.. ఎంత అభివృద్ధి చేసిందో ప్రజలకు తెలుస్తుందని అన్నారు. ప్రభుత్వాలు రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి కోసం పని చేయాలే తప్ప పట్టుదలకు పోయి చతికిలపడొద్దని సూచించారు. ఏ ప్రభుత్వమైనా హూందాగా వ్యవహరించాలే తప్ప అనవసరమైన ఆరోపణలు చేసి పలుచన కావద్దని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని కలలో కూడా అనుకోలేదని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండాలని ప్రజలంతా కోరుకున్నారని చెప్పారు. కానీ ఎమ్మెల్యేలు ఓడిపోవడం వల్ల ఫలితం తారుమారైనట్టు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో మాత్రమే కాంగ్రెస్‌కు అనుకూలంగా.. మిగతా జిల్లాల్లో మిశ్రమ ఫలితాలు వచ్చినందున పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ కూడా బీఆర్ఎస్కే మంచి ఫలితాలు వస్తాయని జోస్యం చెప్పారు.