ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న దేశంలో ప్రధాని ప్రజలకు కాకుండా వ్యాపారవేత్త అదానీకి మాత్రమే ప్రధానిగా మారిపోయారు. బొగ్గు అమ్మాలన్నా అదానీనే, కరెంట్ కొనాలన్నా అదానీనే, రైతులకు ధర రావాలన్నా అదానీనే అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. దేశ ప్రజల కష్ట సుఖాలను మోదీ మరిచిపోయారు. 47 ఏండ్ల నా రాజకీయ అనుభవంలో ఇలాంటి దుస్థితిని దేశంలో ఎప్పుడూ చూడలేదు.
– పోచారం శ్రీనివాస్‌రెడ్డి
నిజామాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యల పట్ల శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లికి పుట్టినోడైతే అలా మాట్లాడడని, ఈ రకంగా మాట్లాడటం అనేది మాతృమూర్తిని అవమానించడమే అవుతుందని మండిపడ్డారు. నోటికొచ్చినట్టుగా మాట్లాడితే ఆ పదవికి కళంకం తెచ్చినట్టు అవుతుందని హితవు పలికారు. సంజయ్ మాటలు మీ తల్లి, చెల్లిని అవమానించినట్టేనని ధ్వజమెత్తారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరు, మోదీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యాఖ్యలపై స్పీకర్ తీవ్రంగా స్పందించారు. ఊరూరా బండి సంజయ్ దిష్టిబొమ్మలను తగలబెడుతున్నారని, ఆయన మాటలు మహిళలను, ప్రజలను ఎంతగా గాయపర్చాయో అర్థం చేసుకోవాలని పోచారం సూచించారు. జాగ్రత్తగా ఉండాలని, అందరికీ చీము, నెత్తురు ఉంటాయని, ఒకరిని మరొకరు గౌరవించుకోవాలని అన్నారు. మహిళలను అసభ్య పదజాలంతో మాట్లాడటం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలని హితవు పలికారు. ‘మహిళలను అవమానపర్చడం, అధికారులను అవహేళన చేయడం మీ పార్టీ సిద్ధాంతమా?’ అని బీజేపీని పోచారం ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మెచ్చుకోకపోయినా ఫర్వాలేదు కానీ మౌనంగా ఉండి సమర్థించండి అంటూ హితవు పలికారు. మైకులు పట్టుకోగానే బూతులు, వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. ‘ఒక తల్లికి పుట్టినవాడు ఎవ్వడూ అలాంటి అసభ్య పదజాలం వాడడు. ఇలాంటి భాష మరోసారి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. నోరు అదుపులో పెట్టుకోవాలి. నోరు కడుక్కోవాలి. మరోమారు ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోం. మా సైన్యం స్పందిస్తే కార్నర్ మీటింగ్‌లే జరుగవు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంతో హుందాగా ఉండాలని, బజారు రౌడీలా మాట్లాడకూడదని పోచారం మండిపడ్డారు. హుందాగా ఉంటే తాము కూడా గౌరవిస్తామని చెప్పారు. అసభ్య పదజాలంతో మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకొని ఎమ్మెల్సీ కవితకు భేషరతుగా బండి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇటీవల దేశంలో జరుగుతున్న సంఘటనలు భారతదేశం ఇతర దేశాల ముందు తలవంచుకొనే విధంగా ఉన్నదని పోచారం స్పీకర్ పోచారం ఆవేదన వ్యక్తం చేశారు. రాముడు పాలించిన రాజ్యంలో నేడు రామరాజ్యం లేదని వాపోయారు. ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలు, మరోవైపు నిరుద్యోగం పెరుగుతున్నాయని చెప్పారు. జీడీపీ పడిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల సగటు ఆదాయం ఘోరమైందని చెప్పారు. రైతుల సమస్యలకు పరిష్కారం లేదని, పండించిన పంటలను కొనే దిక్కులేదని మండిపడ్డారు. దేశంలో విలువలు పతనం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సంపదను ఏ రకంగా పెంచాలి, పెంచిన సంపదను ఏ విధంగా పేదలకు పంచాలనే సోయి కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న దేశంలో ప్రధాని ప్రజలకు కాకుండా వ్యాపారవేత్త అదానీకి మాత్రమే ప్రధానిగా మారిపోయారని సభాపతి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం మోదీ అంటే ఈడీ, ఈడీ అంటే మోదీగా మారిందని, ఇది తప్ప ఇంకోటి లేదని చెప్పారు. బొగ్గు అమ్మాలన్నా అదానీనే, కరెంట్ కొనాలన్నా అదానీనే, రైతులకు ధర రావాలన్నా అదానీనే అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయని వాపోయారు. తాను స్పీకర్ హోదాలో కాకుండా రాజకీయాలను పక్కన పెట్టి ఒక దేశ పౌరుడిగా ఈ రోజు మాట్లాడుతున్నట్టుగా చెప్పారు. దేశ ప్రజల కష్ట సుఖాలను మోదీ మరిచిపోయారని అన్నారు. 47 ఏండ్ల తన రాజకీయ అనుభవంలో ఇలాంటి దుస్థితిని దేశంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధించడానికి కేంద్ర సంస్థలను ఇష్టానుసారంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి, ఫెడరల్ వ్యవస్థకు విరుద్ధమని ఫైరయ్యారు. రాష్ర్టాలను కేంద్రం సమానంగా చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు బలంగా ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలపై ఈడీ, సీబీఐ నోటీసులు ఇస్తున్నారని చెప్పారు. భారత జాగృతి సంస్థ స్థాపించి తెలంగాణ ఖ్యాతిని దేశ, విదేశాల్లో చాటి చెప్పిన మహిళ కల్వకుంట్ల కవిత అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ఆమె అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని, అలాంటి కవితను 9 గంటలపాటు ఈడీ విచారణ జరపడం అవసరమా? ప్రశ్నించారు.
వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ర్టానికి చెందిన నలుగురు బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో ఒక్క నిమిషం మాట్లాడలేదని, కానీ ఇక్కడ మాత్రం రైతులను రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశంలో ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయనే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందని, దీనిని వారు ఓర్చుకోలేకపోతున్నారని బీజేపీ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. తొమ్మిదేండ్లుగా కేంద్ర ప్రభుత్వం ద్వారా దేశంలో రైతులను, పేదలకు మంచి చేసిన ఒక్క పని చెప్పండంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి స్పీకర్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ చేసిన వంద పనులను పార్టీ కార్యకర్తలతోపాటుగా తామంతా చెప్తామని స్పష్టం చేశారు. జీఎస్టీ పెంచారు.. నోట్లు రద్దు చేశారు.. ఉచిత కరెంట్ వద్దంటారు.. రాయితీలు ఇవ్వొద్దంటారు.. ఎవరైనా మాట్లాడితే ఈడీలు, బోడీలు పంపుతారా? అంటూ ప్రశ్నించారు. ఈడీ విచారణ జరిగితే మొదట బీజేపీ ప్రియమైన స్నేహితుడు అదానీపైనే జరగాలని డిమాండ్ చేశారు. 140 కోట్ల మంది ప్రజలపై లేని ప్రేమ ఒక్క అదానీపై ఎందుకో చెప్పాలని నిలదీశారు. ‘వేరే రాష్ర్టాల్లో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. విద్యుత్తు కోతలతో పంటలు ఎండిపోతున్నాయి. వీటిని ఎందుకు పరిష్కరించడం లేదు’ అని ప్రశ్నించారు. అన్నదమ్ముల్లాగా ఉండే రాజ్యంలో కుల, మతాలతో చిచ్చుపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చాయంటే ఏదో ఒక నినాదంతో ఓట్లు వేయించుకుని నాటకాలు చేస్తున్నారని విమర్శించారు. ఇది ఎక్కువ రోజులు సాగబోదని హెచ్చరించారు. ‘వ్యవస్థలో లోపాలుంటే సూచనలతో కూడిన విమర్శలు చేయండి. అంతేకానీ వ్యక్తిగత విమర్శలు ఎప్పుడూ చేయొద్దు. ఏం చేయబోతున్నారు అనేది ప్రజలకు వివరించండి’ అని హితవు పలికారు. సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.