హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సూపరెన్యుయేషన్ సవరణ బిల్లుకు శాసన సభ మంగళవారం ఆమోదం తెలిపింది. బిల్లును రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సభలో ప్రవేశపెట్టగా.. సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్య విద్యలో పని చేస్తున్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల వయోపరమితి 65 సంవత్సరాలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదన్నారు. సభలో చట్టం కూడా చేసుకున్నామని గుర్తు చేశారు. ప్రొఫెసర్లలో నుంచి కొంతమందిని టీచింగ్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా, ప్రొఫెసర్లలో కొంత మందిని మెడికల్ ప్రిన్సిపాల్స్‌గా, కొంత మంది ప్రొఫెసర్లే అడిషనల్ డైరెక్టర్ ఎడ్యూకేషన్గా, డైరెక్టరేట్ మెడికల్ ఎడ్యూకేషన్గా నియమించుకుంటామన్నారు.
గతంలో బిల్లు పాస్ చేసుకున్న సమయంలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ వరకే వయోపరమితి బిల్లును పాస్ అయ్యిందని, కానీ రోజు ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్లు, అడిషన్ డీఎంఈ, డీఎంఈలకు వయోపరమితికి సంబంధించి ఆ బిల్లులో పొందుపరుచలేదన్నారు. ఇవాళ వారందరికీ 65 సంవత్సరాల వయోపరమితి వర్తింప చేస్తూ సవరణను ప్రతిపాదించినట్లు చెప్పారు. తెలంగాణ ఏర్పాటం ఏర్పాటైన నాడు ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. అందులో ఇప్పటికే 17 మెడికల్ కాలేజీలు ఈ విద్యా సంవత్సరం పని చేస్తాయని, విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ఇస్తున్నట్లు తెలిపారు. మరో 9 మెడికల్ కాలేజీ వచ్చే విద్యా సంవత్సరానికి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఈ బిల్లుతో 49 మందికి ప్రయోజనం చేకూరనున్నదన్నారు. సవరణల బిల్లుపై చర్చ సందర్భంగా మంథని, దుబ్బాక ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, రఘునందన్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రల్లో డాకర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, రిక్రూట్మెంట్ చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు స్పందిస్తూ.. ప్రభుత్వం వచ్చాక వైద్యారోగ్యశాఖలో వేలాది మంది డాక్టర్లు, స్టాఫ్‌నర్సుల నియామక ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. మరో వెయ్యి మంది డాక్టర్ల నియామక ప్రక్రియ చివరి దశలో ఉన్నదని తెలిపారు. ఇంటర్వ్యూలు కూడా ప్రారంభమయ్యాయని… ఈ నెలాఖరు, అక్టోబర్ మొదటి వారంలో దసరా కానుగా కొత్త డాక్టర్లకు వైద్యారోగ్యశాఖలో ఉత్తర్వులు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. ఇతర యూనివర్సిటీల్లో కూడా ఇప్పటికే కాంటాక్టు బేసిక్‌పై ప్రభుత్వం నియమించిందని, 800 మంది ఎస్‌ఆర్‌లను కౌన్సెలింగ్ ద్వారా జిల్లాల్లో నియామకం చేపట్టామన్నారు.
రాష్ట్రంలో 103 డయాలసిస్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో డయాలసిస్ సెంటర్ లేదన్నారు. రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గ కేంద్రంలో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఉచితంగా సింగిల్ యూజ్ ఫిల్టర్ విధానంలో పేదలకు వైద్యం అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని స్పష్టం చేశారు. దుబ్బాకలో నవజాత శిశువులకు మెరుగైన అందించేందుకు, మరణాలను తగ్గించేందుకు న్యూబార్న్ స్టెబిలైజేషన్ యూనిట్‌ను ఏర్పాటు చేశామన్నారు. దుబ్బాకలో బస్తీ దవాఖాన కావాలని కోరితే మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. దుబ్బాక ఆసుపత్రిని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలను ప్రజలు వినియోగించుకునేలా చొరవ చూపాలని ఎమ్మెల్యే రఘునందర్‌రావుకు మంత్రి సూచించారు.