హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ‘రైతన్నలకు లీగల్ నోటీసులు. ఇంత మోసం, పచ్చి దగా, నయవంచన’ అని కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల ముందు రైతులెవ్వరూ రుణాలు చెల్లించొద్దని, ఏర్పడేది తమ ప్రభుత్వమేనని చెప్పిన రేవంత్‌రెడ్డి రైతులను వంచించారని ఆయన ఆదివారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాలను గుర్తుచేస్తూ నాడు, నేడు పేరుతో కేటీఆర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఇవి ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు. బ్యాంకుల్లో రుణాలున్న రైతులెవ్వరూ రూపాయి కట్టొద్దు. డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిదినాడు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం.
ఇప్పటివరకు లోన్ తీసుకోనోళ్లు పోయి తెచ్చుకోండి. తీసుకున్నోళ్లకు మా ప్రభుత్వం రుణమాఫీ చేశాక బ్యాంకోళ్లు మళ్లీ లోన్లు ఇస్తరు’ అని పేర్కొన్న సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ రైతులను మోసం చేసిందని దుయ్యబట్టారు. ‘పంట రుణాలపై కాంగ్రెస్ సరారు మౌనం. రైతన్నలకు లీగల్ నోటీసులు. ఇంత మోసం, పచ్చి దగా, నయవంచన’ అని ‘రైతులకు లీగల్ నోటీసులు’ అన్న నమస్తే తెలంగాణ కథనాన్ని కేటీఆర్ ట్వీట్ చేయటం గమనార్హం.