హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రహదారులకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యేలా ఉన్నాయి. వందల ఎకరాల వ్యవసాయ భూములను రహదారులుగా మార్చాలన్న యోచనను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లను నిర్మిస్తున్నదని మండిపడుతున్నారు. ఈ విషయంలో హెచ్ఎండీఏను నిలువరించేలా న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్), రీజినల్ రింగు రోడ్డు మధ్య 10 గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ .. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ వైపు రేడియల్ రోడ్-1 నిర్మాణాన్ని చేపట్టింది.
కోకాపేట నియోపోలిస్ నుంచి వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిట్యాల్ వరకు రేడియల్ రోడ్డు-2 నిర్మాణానికి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. 100 మీటర్ల వెడల్పుతో 52 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రోడ్డు కోసం శంషాబాద్, షాబాద్, కొందుర్గ్, చౌదర్గూడెం, మెయినాబాద్, పరిగి తదితర మండలాల్లోని 25 గ్రామాల పరిధిలో వందల ఎకరాల భూములను సేకరించనున్నట్టు ప్రకటించడంతోపాటు రైతుల అభ్యంతరాలను పట్టించుకోకుండానే అభిప్రాయ సేకరణ కూడా పూర్తిచేసింది. దీంతో తమకు జీవనాధారమైన వ్యవసాయ భూములను కోల్పోతున్నామని ఆందోళన చెందుతున్న రైతులు.. ఇప్పటికే హెచ్ఎండీఏ కార్యాలయాన్ని ముట్టడించి, తమ నిరసనను వ్యక్తం చేశారు.
జాతీయ రహదారులకు మించి ఎనిమిది లేన్ల వెడల్పుతో రేడియల్ రోడ్లను నిర్మించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తూ.. తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్తున్నారు. రేడియల్ రోడ్ల నిర్మాణంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూరడమే తప్ప వ్యవసాయ రంగానికి ఒరిగేది ఏమీ ఉండదని పేర్కొంటూ.. తమ హక్కుల పరిరక్షణ కోసం కోర్టులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.