వేములవాడ, అక్టోబర్ 29: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ (Vemulawada) రాజన్న ఆలయ (Rajarajeshwara Swamy Temple) సొమ్మును రాష్ట్ర ఉన్నతాధికారులు హారతి కర్పూరంలా కరిగిస్తున్నారు. లక్షలాది రూపాయల వేతనాన్ని నచ్చిన వారికి అప్పనంగా అప్పగిస్తున్నారు. మరికొందరు ఉద్యోగులైతే ఈ ఆలయం నుంచి వేతనం పొందుతూ అడ్రస్ లేని ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న తీరు విమర్శలకు తావిస్తున్నది.
ఎండోమెంట్ విభాగానికి ప్రభుత్వం నుంచి జనరల్ ప్లీడర్‌తో పాటు స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాది ఒకరు ఉంటారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆరు నెలల క్రితం లీగల్ అడ్వయిజర్‌ను (Legal Advisor) నియమించుకున్నది. దేవాదాయ శాఖ నియామకం చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొందడమే కాకుండా, ఆర్థిక శాఖ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ తతంగమంతా ఎందుకనుకుందో? ఏమో గానీ నచ్చినవారిని సొంతంగా నియమించుకున్నది. వేతనమైనా రాష్ట్ర ఖజానా నుంచి ఇస్తున్నారా..? అంటే అదీ లేదు. వేతన భారం ఇతర ఆలయాల మీద రుద్దారు.
లీగల్ అడ్వయిజర్ వేతనం రాజన్న ఆలయం నుంచి నెలకు రూ.50వేలు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి మరో రూ.50వేలతో కలిపి ప్రతి నెలా రూ. లక్ష సదర్ లీగల్ అడ్వయిజర్ అకౌంట్లో జమ చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆరు నెలలుగా భక్తుల సొమ్ము నెలకు రూ.50వేల చొప్పున సదరు అడ్వయిజర్‌కు అప్పగిస్తున్నారు. సదరు అడ్వయిజర్ దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో హాజరవుతున్నట్టుగా హాజరు పట్టికను పంపి, వేతనం మాత్రం రాజన్న, యాదాద్రి ఆలయాల నుంచి వేయించడం విడ్డూరంగా ఉంది.
వేములవాడ రాజన్న ఆలయంలో కొందరి ఉద్యోగుల తీరు విడ్డూరంగా ఉంది. రాజన్నకు ఒక్కనాడూ సేవ చేయని ఉద్యోగులు లక్షల్లో వేతనం పొందుతూ అడ్రస్ లేని ఆలయాల్లో పనిచేస్తూ రాజన్న సొమ్మును అప్పనంగా ఆరగిస్తున్నారు. వేద పారాయణదారుడిగా ఉన్న ఉద్యోగి నెలకు రూ.2లక్షల వేతనాన్ని పొందుతూ హైదరాబాద్‌లోని బీరంగూడలో ఒక చిన్న దేవాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. జూనియర్ అసిస్టెంట్‌గా మరో ఉద్యోగి నెలకు రూ.లక్షా10వేల వేతనాన్ని పొందుతూ ఎకడో చిన్న ఆలయంలో పనిచేస్తున్నాడు. రాజన్న ఆలయంలో ఇటీవలే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారిగా పదోన్నతి పొందిన ఉద్యోగి నెలకు లక్షకు పైగా వేతనం పొందుతుండగా, మరో పర్యవేక్షకుడు వేములవాడలో నెలకు రూ.90వేల వేతనాన్ని పొందుతూ యాదగిరిగుట్టలో విధులు వెలగబెడుతున్నారు. రాజన్న ఆలయంలో అభివృద్ధి పనులకు ముందడుగు పడుతున్న క్రమంలో నెలకు రూ.5.50లక్షల వేతనాన్ని వేరేచోట విధులు నిర్వహిస్తున్న రాజన్న ఆలయ ఉద్యోగులు పొందుతున్న తీరు సర్వత్రా విమర్శలకు దారితీస్తున్నది.