ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 01:51:21

ప్రైవేట్‌ దవాఖానలను వదలం

ప్రైవేట్‌ దవాఖానలను వదలం

ప్రజలకు సేవచేయాల్సిన సమయంలో, అధిక మొత్తంలో డబ్బులు వసూలుచేస్తే కఠినంగా వ్యవహరించాలి. వైద్యులపై నమ్మకంతో ప్రాణాలు కాపాడాలని వస్తే, ప్రైవేటు దవాఖానలు లెక్కకు మించి పరీక్షలు, మందులు సూచిస్తూ పెద్దమొత్తంలో డబ్బువసూలు చేస్తుండటం దారుణం. - మంత్రి ఈటల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా కష్టకాలంలో మానవతాధృక్పథంతో వైద్యసేవలందించాల్సిన ప్రైవేటు దవాఖానలు పద్ధతి తప్పుతున్నాయని, నిబంధనలను ఉల్లంఘించి అధిక మొత్తంలో డబ్బులు వసూలుచేయడాన్ని సహించేది లేదని మంత్రి ఈటల రాజేందర్‌ అగ్రహం వ్యక్తంచేశారు. ఆ దవా ఖానలపై కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని ఆదేశించారు. శనివారం బీఆర్కేభవన్‌లో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా బాధితులపట్ల ప్రైవేటు  దవాఖానల వ్యవహారం చర్చకురాగా మంత్రి తీవ్రంగా స్పందించారు. ప్రైవేటుల్యాబ్‌లు, దవాఖానల ఆగడాలపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన వాట్సాప్‌నంబర్‌కు వెయ్యివరకు ఫిర్యాదులు వచ్చినట్టు అధికారులు మంత్రికి వివరించారు. ముఖ్యంగా మూడు, నాలుగు దవాఖానలు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నాయని పెద్దమొత్తంలో ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు. ఇటీవల ఓ దవాఖానలో జరిగిన ఘటనపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల ఆయా దవాఖానలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలకు సేవచేయాల్సిన సమయంలో, అధిక మొత్తంలో డబ్బులు వసూలుచేస్తే కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. వైద్యులపై నమ్మకంతో ప్రాణాలు కాపాడాలని వస్తే, ప్రైవేటు దవాఖానలు లెక్కకు మించి పరీక్షలు, మందులు సూచిస్తూ పెద్దమొత్తంలో డబ్బువసూలు చేస్తుండటం దారుణమని వ్యాఖ్యానించారు. బిల్లులు చెల్లిస్తేనే మృతదేహం అప్పగిస్తామని బేరాలు చేస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయంలో ఏ దవాఖానను వదిలేదిలేదని, అలా చేసిన దవాఖానలకు తక్షణం నోటీసులు జారీచేయాలని సూచించారు. ప్రభుత్వం ఒకవైపు ప్రజలను కాపాడేందుకు శ్రమిస్తుంటే, ప్రైవేటు యాజమాన్యాలు డబ్బుగురించే ఆలోచించడం పద్ధతి కాదని హెచ్చరించారు. ప్రైవేట్‌ దవాఖానల ఇబ్బందులను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని, అదే సమయంలో ప్రభుత్వంతో కలిసి సామాజిక బాధ్యతగా ప్రజలకు సేవలందించాలని పిలుపునిచ్చారు. 

ప్రైవేట్‌పై నిఘాకు ప్రత్యేక కమిటీ 

ప్రైవేట్‌ దవాఖానల్లో బిల్లుల వసూలును కట్టడిచేసేందుకు, వాస్తవాలను తెలుసుకొనేందుకు విజిలెన్స్‌ కమిటీతో విచారించాలని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు మంత్రి ఈటలకు సూచించారు. ఆ నివేదికల ఆధారంగా చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. మంత్రి ఈటల సైతం ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తున్నది. కాగా, ప్రభుత్వం త్వరలోనే విజిలెన్స్‌ కమిటీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. 

జిల్లా దవాఖానల్లో కొవిడ్‌ చికిత్స 

కరోనా అంటే అవగాహనలేని రోజుల నుంచి పట్టుబిగించే స్థాయికి వచ్చామని మంత్రి ఈటల చెప్పారు. హైదరాబాద్‌లో మాత్రమే అందుబాటులో ఉండే కొవిడ్‌ వైద్యాన్ని అన్ని జిల్లా దవాఖానల స్థాయికి తీసుకువెళ్లినట్టు చెప్పారు. ఐసీయూ, వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ పడకలను వేర్వేరుగా ఏర్పాటుచేసినట్టు తెలిపారు. కరోనా తొలికేసు నమోదైనప్పటి నుంచి వైద్యారోగ్యశాఖ తీవ్రంగా కృషి చేస్తున్నదని చెప్పారు. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు, అవసరమైనవారికి కౌన్సెలింగ్‌ , టెలిమెడిసిన్‌ సేవలు, అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌ల ద్వారా దవాఖానలకు తరలిస్తున్నామని పేర్కొన్నారు. వైద్యారోగ్యశాఖ నిరంతర కృషి ఫలితంగా దేశంలోనే అత్యధిక రికవరీ రేటు తెలంగాణలో నమోదవుతున్నదని గుర్తుచేశారు. నాణ్యమైన వైద్యంతో మృతుల సంఖ్య ఒక్కశాతంలోపే ఉన్నదని చెప్పారు.

వాట్సాప్‌ (9154170960)కు వచ్చిన ఫిర్యాదుల్లో ముఖ్యమైనవి..

  • కృత్రిమ కొరత సృష్టించి అధికడబ్బు డిమాండ్‌.  
  • రూ.3-4 లక్షలు అడ్వాన్స్‌ చెల్లిస్తేనే అడ్మిషన్‌.
  • రోజుకు రూ.2 లక్షల వరకు బిల్లు వసూలు. 
  • రోగి మరణించినా మానవత్వం చూపకుండా బిల్లుచెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగింత. 
  • కరోనా లక్షణాలు లేకపోయినా పాజిటివ్‌గా నిర్ధారిస్తూ విపరీతంగా చార్జీలు వసూళ్లు.
  • రోగి పరిస్థితి విషమించాక అంబులెన్స్‌లో ప్రభుత్వ దవాఖానకు తరలించడం. 

ప్రభుత్వ దవాఖానల్లో విలువైన మందులు

ప్రైవేటు హాస్పిటళ్లలో ఇచ్చే మందులనే ప్రభుత్వ దవాఖానల్లో ఇస్తున్నామని మంత్రి ఈటల తెలిపా రు. ప్రపంచంలో ఎక్కడ ఏ కొత్త ఔషధం ఉత్పత్తి అయినా వైద్యనిపుణుల సూచన మేరకు కొనుగోలు చేసి ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు. రెమ్డెసివిర్‌, ఫావిపిరవిర్‌, టో స్లిజుమాబ్‌ తదితర ఔషధాలను ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులో ఉంచినట్టు వివరించారు.  


logo