Politicians | హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): లోక్‌సభలో ఎన్నికల ప్రజా తీర్పు భద్రంగా ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ప్రజలు ఎవరిని తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారో తెలియాలంటే మరో మూడు వారాలు ఆగక తప్పదు. కనీసం ఎగ్జిట్ పోల్స్ తెలియాలన్నా.. జూన్ 1వ తేదీ వరకు ఆగాల్సిందే. మరోవైపు ఇన్నాళ్లూ ప్రచార హడావుడి, మైకుల హోరు, రోడ్‌షోలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఓటర్లు.. ఇలా ప్రతిక్షణం హడావుడిగా గడిపిన అభ్యర్థులు, నాయకులు ఇప్పు డు సేదతీరేందుకు సిద్ధమవుతున్నారు.
కొందరు నేతలు విదేశాలకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఉదాహరణకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 17 నుంచి ఐరోపా పర్యటనకు వెళ్లాలని భావిస్తున్నారు.మరికొందరు నేతలు దేశంలోనే ఇతర పర్యాటక ప్రాంతాల్లో రెండుమూడు వారాలు గడిపేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇంకొందరు ఎలాంటి హడావుడి లేకుండా తమ ఇండ్లు, ఫామ్హౌజ్లకే పూర్తిస్థాయిలో పరిమితం కావాలని భావిస్తున్నారు. ఒకటి రెండు వారాలపాటు కలవడానికి కూడా ఎవరూ రావొద్దని ఆదేశిస్తున్నారు. గ్రామ, మండల స్థాయి లీడర్లు ఇప్పటికే ఎండల నుంచి ఉపశమనం పొందేలా సేదతీరేందుకు శీతలప్రాంతాల విడిదులను వెతుక్కుంటున్నారు.