హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామని, ఈ ఫలితాలు తమ పాలనకు రెఫరెండంగా భావిస్తామని ప్రకటించిన పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఇలాకాలో కాంగ్రెస్‌కి పార్టీ రిక్తహస్తం తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు. రేవంత్ సొంత జిల్లా మహబూబ్‌నగర్‌తో పాటు ఆయన సిట్టింగ్ సీటు మల్కాజిగిరిలో సైతం కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదన్న చర్చ జరుగుతున్నది. ఇదే జరిగితే ఫలితాల అనంతరం రేవంత్‌రెడ్డికి సొంత పార్టీలోనే గడ్డుపరిస్థితి ఎదుర్కోక తప్పదని అంటున్నారు. సీఎం పదవిని ఆశిస్తున్న ఖమ్మం, నల్లగొండ నాయకులు ఈ ఎన్నికల్లో ఇంట గెలిచి సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసరబోతున్నారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తన సొంత జిల్లా మహబూబ్‌నగర్ సీటును, సిట్టింగ్ సీటు మల్కాజిగిరిని రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాలలో ప్రస్తావిస్తూ తనను రాజకీయంగా దెబ్బతీయడానికి కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించేందుకు కుట్ర జరుగుతున్నట్టు ఆరోపించారు. ఆయన అనుమానించినట్టే మహబూబ్‌నగర్, మల్కాజిగిరి సీట్లలో ఫలితాలు కాంగ్రెస్‌కు ఆశాజనకంగా లేవనీ పార్టీ లోపలా, బయటా బలంగా వినిపిస్తున్నది.
మహబూబ్‌నగర్‌లో పార్టీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిని గెలిపించడానికి రేవంత్‌రెడ్డి తన సర్వశక్తులు ఒడ్డారు. ఏకంగా ఎనిమిది పర్యాయాలు అక్కడ ఎన్నికల ప్రచార సభలకు, రోడ్‌షోలకు హాజరయ్యారు. రాష్ట్రంలో మరే నియోజకవర్గంలోనూ ఇన్నిమార్లు ఆయన పర్యటించలేదు. తన రాజకీయ భవిష్యత్తు మహబూబ్‌నగర్ స్థానం ఫలితంతో ముడిపడి ఉండటంతో, ఈ నియోజకవర్గం పరిధిలోని మక్తల్ అసెంబ్లీ స్థానంలో అత్యధిక మెజార్టీ సాధిస్తే.. ఆగస్టు 15 కల్లా స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని ప్రకటించారు. మక్తల్, నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటి నుంచి బీజేపీకి కొంత సానుకూలత ఉండటంతో బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు మంచి మెజార్టీ వస్తుందని అంచనా వేశారు. దీంతో ఆ అవకాశాలను దెబ్బతీసేందుకు రేవంత్‌రెడ్డి మంత్రి పదవిని ఎర వేసి ఉంటారని పార్టీ వర్గాలలో చర్చ జరిగింది. దీనికితోడు మహబూబ్‌నగర్ నియోజకవర్గం పరిధిలో ముదిరాజ్ సామాజికవర్గం జనాభా కూడా ఎక్కువే. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి అదే సామాజికవర్గానికి చెందినవాడు కావడంతో.. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే.. మంత్రివర్గంలో ముదిరాజ్‌లకు స్థానం కల్పిస్తానని కూడా రేవంత్ వాగ్దానం చేశారు.
రేవంత్‌రెడ్డి ఇన్ని రీతులుగా ఎత్తులు వేసినప్పటికీ పోలింగ్ తర్వాత ఓటింగ్ సరళిని బట్టి బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు విజయావకాశాలు మెండుగా ఉన్నట్టు విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. డీకే అరుణ మహబూబ్‌నగర్‌లో మంగళవారం ప్రెస్‌మీట్ పెట్టి తాను రెండు లక్షల మెజార్టీతో గెలువబోతున్నట్టు ప్రకటించడం కూడా సీఎం రేవంత్‌రెడ్డి శిబిరంలో పార్టీ విజయావకాశాలపై నమ్మకం సన్నగిల్లేలా చేసింది. మహబూబ్‌నగర్ కాంగ్రెస్ వర్గాలు కూడా తాము స్వల్ప మెజార్టీతోనైనా గట్టు ఎక్కుతామంటూ దింపుడు కల్లం ఆశను వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల డ్యూటీకి వెళ్లిన ఉద్యోగులు కూడా ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారని కాంగ్రెస్ వర్గాలలో చర్చ జరుగుతున్నది. ఇక మల్కాజిగిరి స్థానంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశం లేదని, ఇది కూడా సీఎం రేవంత్‌రెడ్డికి రాజకీయంగా మరొక ఇబ్బందికరమైన పరిస్థితిగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మల్కాజిగిరి నుంచి సునీతా మహేందర్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా బరిలోకి దించారు. వాస్తవానికి ఆమె చేవెళ్ల టికెట్ ఆశించగా, మల్కాజిగిరి తన సిట్టింగ్ సీటు కావడంతో గెలిపించే బాధ్యత తనదేనని ఒప్పించినట్టు సమాచారం. కానీ ఓటింగ్ సరళినిబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్‌కు విజయావకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టు పార్టీ వర్గాలలో చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డికి పార్టీలో అంతర్గతంగా మున్ముందు గడ్డుపరిస్థితి తప్పదని అటు కాంగ్రెస్ వర్గాలలో, ఇటు రాజకీయ వర్గాలలో హాట్‌హాట్ చర్చ జరుగుతున్నది.