చౌటుప్పల్ రూరల్, సెప్టెంబర్12: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగుతున్నది. గత కొద్దిరోజులుగా వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీలో చేరేందుకు వరుస కడుతున్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని జైకేసారం, చింతలగూడెం, దామెర తదితర గ్రామాలకు చెందిన 200 మంది వివిధ పార్టీల నాయకులు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో పార్టీలో చేరిన వారందరికీ గులాబీ కండువాలు కప్పి కూసుకుంట్ల టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, వాటికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. అలాగే మర్రిగూడ మండలంలోని ఖుదాభక్షిపల్లికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోతురాజు రాజుయాదవ్.. జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.