ఖైరతాబాద్, అక్టోబర్ 28: ‘వెయ్యి రూపాయలు ఇచ్చి, సారా పోస్తే లంబడోళ్లు ఓట్లు వేస్తారంటూ అగ్రవర్ణ దురహంకారంతో మాట్లాడిన రేవంత్‌రెడ్డి! ఇక నీ ఓటమికి రోజులు లెక్కపెట్టుకో.. లంబాడీల జాతిద్రోహి ఖబడ్దార్’ అంటూ గిరిజన సంఘాల నాయకులు హెచ్చరించారు. లంబాడీ హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్) ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వివిధ గిరిజన సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోట్యా నాయక్, గిరిజన వక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్, ఎల్‌ఎస్‌వో అధ్యక్షుడు అశోక్ నాయక్‌లు.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో 40 లక్షలకు పైగా ఉన్న గిరిజనులను విస్మరించిన వారిని బంగాళాఖాతంలో కలిపే సత్తా తమకు ఉన్నదని అన్నారు.
రేవంత్‌రెడ్డికి లంబాడీల ఎదుగుదల ఇష్టం లేదని, తమ జాతి అణచివేతకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఖానాపూర్‌లో నలుగురు గిరిజనుల మృతికి కారకుడైన భోజుకు టికెట్ ఇచ్చాడని మండిపడ్డారు. ఆదివాసీలు ఎక్కువగా ఉన్న బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో లంబాడీలకు సీట్లు కేటాయించడంలోనే రేవంత్ కుట్ర వెల్లడవుతున్నదని చెప్పారు. బోథ్‌లో సోయం బాపురావును గెలిపించేందుకు రెండువేల ఓట్లు ఉన్న నాయక్‌పోడ్ వర్గానికి సీటు కేటాయించాడని అన్నారు. మానుకోట టికెట్‌ను గిరిజన మేధావి బెల్లయ్యనాయక్‌కు కాదని, డబ్బులిచ్చిన వారికి అమ్ముకున్నాడని ఆరోపించారు. గిరిజనులపై నిత్యం విషం కక్కే రేవంత్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్కను ఓడగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను మొత్తం 119 నియోజకవర్గాల్లో భూస్థాపితం చేస్తామని తేల్చి చెప్పారు.