ఖైరతాబాద్, సెప్టెంబర్ 10 : ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇండ్లను కూల్చి చంటిపిల్లలు, ఆడవాళ్లున్నారని కూడా చూడకుండా భారీ వర్షంలో కట్టుబట్టలతో సున్నం చెరువు వద్ద 200 మంది నిరుపేదలను రోడ్డున పడేశారని, వారిని ఆదుకోకుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని విద్యార్థుల రాజకీయ పార్టీ నేతలు హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ అధ్యక్షుడు యెచ్చు సునీల్ మాట్లాడుతూ హైడ్రా పేరుతో ప్రభుత్వం ఆడుతున్న డ్రామాకు పుల్‌స్టాప్ పెట్టాలని డిమాండ్ చేశారు. సున్నం, కత్వా, అమీన్పూర్ చెరువుల ఒడ్డున వందలాది కుటుంబాలు ఎలాంటి ఆదరణ లేక, కూలీనాలి చేసుకుంటూ బతుకుతున్నాయని, వారిపై ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
కష్టపడి కట్టుకున్న రేకుల షెడ్లు, గుడారాలను ఆక్రమణల పేరుతో హైడ్రా కూల్చివేయడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. బాధితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందించాలని, లేదంటే సీఎం, మంత్రుల ఇంటి ముట్టడితో పాటు వారి ఇండ్లలోనే బాధితులకు నివాసాలు కల్పిస్తామని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఇజ్జగిరి కమలాకర్, పాక నవీన్ బాబు, మహిళా అధ్యక్షురాలు సాత్వికారెడ్డి, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యదర్శి మహేశ్, అనిల్, వినయ్, భూక్యా నందు, బదావత్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రెస్‌క్లబ్ గేటు వెలుపలే అరెస్ట్
ప్రెస్‌మీట్ ముగించుకొని ప్రెస్‌క్లబ్ నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థుల రాజకీయ పార్టీ నాయకులు, బాధితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హెచ్చరికలు లేకుండానే వారిని అరెస్ట్ చేసేందుకు యత్నించగా, పార్టీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ‘సీఎం డౌన్ డౌన్’, ‘ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి’ అంటూ నినాదాలు చేశారు.
పిల్లలతో ఎక్కడికి పోవాలి
కూలిపనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటున్న. మహబూబ్‌నగర్ నుంచి 20 ఏండ్ల కింద వచ్చినం. షెడ్డు వేసుకొని బతుకుతున్నం. పిల్లలతో సహా బయటకు వెళ్లగొట్టి కూలగొట్టిండ్రు. చిన్న పిల్లలను పట్టుకొని ఎటుపోవాలె?
– బుజ్జమ్మ, బాధితురాలు
మా బతుకులు రోడ్డునపడ్డయ్
కొన్నేండ్ల కింద ఇసుక లారీ బోల్తా పడి నా భర్త గోపాల్ చనిపోయిండు. ఇద్దరు బిడ్డలు, కొడుకును కూలి పనులు చేసుకుంట చదివిస్తున్న. ఉన్నట్టుండి మా బతుకులను రోడ్డున పడేసిండ్రు. ప్రభుత్వానికి ఇది న్యాయం కాదు.
– చంద్రిబాయి, బాధితురాలు
మాకు న్యాయం చేయాలి
నా భర్త డ్రైవర్. ఇద్దరు చిన్న పిల్లలున్నరు. కష్టపడి చిన్న ఇల్లు కట్టుకున్నం. ఖాళీ చేయాలని ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. బలవంతంగా బయటకు పంపి కూల్చివేసిండ్రు. మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి. డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలి.
– పద్మ, బాధితురాలు