హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు సీఎం రేవంత్‌రెడ్డిని కోరాయి. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాలు సమర్పించాయి. పీఆర్సీ సహా పెండింగ్ డీఏలను విడుదల చేయాలని విజ్ఞప్తిచేశాయి. టీచర్ల బదిలీలు, పదోన్నతుల నేపథ్యంలో పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆదివారం హైదరాబాద్‌లోని నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భాషాపండితులు, పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పద్నోన్నతి కల్పించడం, టీచర్ల బదిలీలు, పదోన్నతులు కల్పించడంపై ఉపాధ్యాయ సంఘాల నేతలు, ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపాయి. టెట్‌తో నిమిత్తం లేకుండా టీచర్లకు పదోన్నతులు కల్పించడాన్ని పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గార్లపాటి ఉమాకర్‌రెడ్డి, డాక్టర్ పర్వతి సత్యనారాయణ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
రెవెన్యూ డివిజన్ల తరహాలో విద్యా డివిజన్లను ఏర్పాటుచేయాలని తెలంగాణ గెజిడెట్ హెడ్మాస్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రప్రకాశ్, రాజగంగారెడ్డి, తుకారం వినతిపత్రం సమర్పించారు. భాషాపండితులకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు కల్పించినందుకు ఆర్‌యూపీపీ టీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మమ్మద్ అబ్దుల్లా, తిరుమల కాంతికృష్ణ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యాశాఖ కమిషన్ శ్రీదేవసేన, టీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మణిపాల్‌రెడ్డి, ఎస్జీటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహిపాల్‌రెడ్డి, వెంకటేశం, టీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అబ్దుల్లా, రాజిరెడ్డి, స్కూల్ అసిస్టెంట్స్ అసొసియేషన్ నేతలు, ఎస్‌ఎల్‌టీఏ రాష్ట్ర అధ్యక్ష, ఫ్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, గౌరీశంకర్రావు పాల్గొన్నారు.
స్పౌజ్ కేసులన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి టిగారియా వినతి
317 జీవో ద్వారా జరుగుతున్న ఉద్యోగ కేటాయింపుల్లో స్పౌజ్ కేసులనే కాకుండా, సెంట్రల్, పబ్లిక్ సెక్టార్ మిగతా అన్ని స్పౌజ్ కేసులను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని తెలంగాణ గవర్నమెంట్ ఆల్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టిగారియా) డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని టిగారియా అధ్యక్షుడు మామిడి నారాయణ, జనరల్ సెక్రటరీ డాక్టర్ మధుసూదన్, టీజీ సోషల్ వెల్ఫేర్ అధ్యక్షుడు నరసింహులుగౌడ్, జనరల్ సెక్రెటరీ ఎస్ గణేష్ ఆదివారం ప్రత్యేకంగా కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. సెంట్రల్ గవర్నమెంట్, జ్యుడీషియరీ, రైల్వేలు, బ్యాంకులు, ఇతర పబ్లిక్ సెక్టర్ల ఉద్యోగులకు కూడా అవకాశం కల్పించాలని కోరారు. ఆయా డిమాండ్లపై సీఎం సానుకూలంగా స్పందించారని టిగారియా ప్రతినిధులు వెల్లడించారు. తగిన సూచనలతో ఆయా శాఖలకు ఆదేశాలు జారీచేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు
పలు ఉపాధ్యాయ సంఘాల నేతల అసంతృప్తి
కొంత మంది ఉపాధ్యాయ సంఘాల నేతలు ఈ సందర్భంగా తమ అసంతృప్తి వ్యక్తంచేశారు. వచ్చామా.. ఫొటో దిగామా.. వినతిపత్రాన్ని ఇచ్చామా అన్నట్టుగా భేటీ సాగిందని, కేవలం ఫొటోలు దిగి, వినతిపత్రాలు తీసుకొని మమ అనిపించారని కనీసం తమ సమస్యలను వినలేదని, మొర ఆలకించలేదని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తంచేశారు.