ఖైరతాబాద్, జూన్ 19: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీలకు తెలంగాణలో విలువను ఇవ్వడం లేదని బీసీ సంఘాల నేతలు ధ్వజమెత్తారు. హైదరాబాద్ లక్డీకాపూల్‌లో బుధవారం బీసీ మేధావుల మేధోమథన సమావేశం జరిగింది. బీసీ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ‘సమగ్ర కులగణనకు సవాళ్లు-డెడికేషన్ కమిషన్ ఏర్పాటు-స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు’ అన్న అంశంపై జరిగిన చర్చలో జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడారు.
ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ స్వయంగా కులగణన చేస్తామని, బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారని, దీంతో దేశవ్యాప్తంగా ఓబీసీలు అధిక సంఖ్యలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని తెలిపారు. కానీ ఆయన మాటకు విరుద్ధంగా నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహరిస్తుండటం బాధాకరమని పేర్కొన్నారు. కులగణన చేపట్టి, రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు మాట్లాడుతూ బీసీలను అన్ని రాజకీయ పార్టీలు మోసం చేశాయని, ఇప్పటికైనా న్యాయంచేయని పక్షంలో మరో మండల్ ఉద్యమం జరుగుతుందని హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బీసీ కులగణనపై సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే బీసీ మేధావులను చర్చలకు ఆహ్వానించి రిజర్వేషన్ల పెంపుపై మార్గదర్శకాలను విడుదల చేయాలని కోరారు. కులగణనపై నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమాలు తప్పవని స్పష్టంచేశారు.
దీనిలో భాగంగా జూలై మొదటి వారంలో బస్సు యాత్ర చేపడుతామని, ఆగస్టు మొదటి వారంలో హైదరాబాద్‌ను బీసీలతో దిగ్బంధిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ప్రొఫెసర్ తిరుమలి, ప్రొఫెసర్ సింహాద్రి, తెలంగాణ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విజయ్‌భాస్కర్‌గౌడ్, బీసీ మేథావులు సుంకర సత్యనారాయణ, ప్రొఫెసర్ వినయ్‌బాబు, ప్రొఫెసర్ వెంకట్రాజయ్య, సమ్మయ్య, వేణుమాధవ్, కుల్కచర్ల శ్రీనివాస్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.