హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో కాపు, తెలగ, బలిజ తదితర కాపుల సంక్షేమానికి బీఆర్ఎస్ పెద్దపీట వేస్తుందని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ చెప్పారు. మంగళవారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఏపీ క్యాంప్ కార్యాలయంలో ఏపీలోని పలు జిల్లాలకు చెందిన నాయకులు పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో వివిధ రాజకీయ పార్టీలు తెలగ, బలిజ, కాపులు సహా పలు కాపు కులాలను తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని వదిలేస్తున్నాయని ఆరోపించారు.
కాపులు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో పురోభివృద్ధి సాధించేందుకు బీఆర్ఎస్ కృషి చేస్తుందని చెప్పారు. తెలంగాణ మాడల్ ఏపీలో అమలు జరగాలంటే ప్రజలు బీఆర్ఎస్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. ఈ సందర్భంగా ఏపీలోని మచిలీపట్నంకు చెందిన మిరియాల చిన్న రాఘవులు, గుంటూరుకు చెందిన మెహబూబ్ బాషా, నూర్ఖాన్, అయ్యప్పరెడ్డి, ఒంగోలుకు చెందిన జానీర, శ్రీకాకుళానికి చెందిన చంద్రశేఖర్ సహా పలు జిల్లాల నాయకులు బీఆర్ఎస్లో చేరారు.