హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, తమ రాష్ర్టాల్లో పార్టీని వేగంగా విస్తరించాలని కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ను కోరారు. గురువారం వినోద్‌కుమార్‌తో భేటీ అయిన ఆయా రాష్ర్టాల నేతలు బీఆర్ఎస్ విస్తరణపై, తెలంగాణ సంక్షేమ పథకాలపై చర్చించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. తమ రాష్ర్టాల్లో ప్రజల పరిస్థితి దారుణంగా ఉన్నదని, అందుకే తెలంగాణలో అమలవుతున్న రైతు, పేద ప్రజల సంక్షేమ పథకాలు తమ రాష్ర్టాల్లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీని తమ రాష్ర్టాల్లో విస్తరించాలని కోరారు. స్పందించిన వినోద్‌కుమార్.. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణను కేసీఆర్ ప్రకటిస్తారని తెలిపారు. వినోద్‌కుమార్‌తో భేటీ అయిన వారిలో కర్ణాటక నుంచి ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు సిద్దన్న తేజీయాదవ్, సహకార సెక్టార్ ఉద్యమ నేత నవీన్, మహిళా ఉద్యమ నేత ఉషారాణి, కార్మిక నాయకుడు ప్రకాశ్, మహారాష్ట్ర గిరిజన సంఘాల నాయకురాలు సింపుల్ రాథోడ్, అంబునాయక్ తదితరులు ఉన్నారు.