హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలకుల మెదడు మోకాళ్లకు చేరిందని, వ్యవస్థల గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్లకు లేదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్కు వ్యవస్థలపై నమ్మకం లేదు అన్న కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో వ్యవస్థల మీద బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ విశ్వాసముందని స్పష్టంచేశారు. తెలంగాణ కోసం తమ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా ప్రజలను మెప్పించిందని గుర్తుచేశారు. 650 పేజీలతో ఘోష్ కమిషన్ రిపోర్టులో తమకు ఇష్టం వచ్చిన అంశాలను మాత్రమే లీక్ చేశారని ఆరోపించారు. దేశంలోనే అన్ని వ్యవస్థలను కాంగ్రెస్ భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు.
కేరళలో ఎమర్జెన్సీ విధించి, అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది కాంగ్రెస్సేనని విమర్శించారు. ఉమ్మడి ఏపీలో మాజీ ముఖ్యమంత్రి అంజయ్యను ఆనాడు కాంగ్రెస్ పార్టీ అవమానించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇందిరాగాంధీపై షా కమిషన్ వేస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ధర్నాలు చేసిందని తెలిపారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సీబీఐ, ఈడీపై నమ్మకం లేదని అంటున్న కాంగ్రెస్, అధికారంలో ఉన్నప్పుడు మాత్రం సీబీఐ, ఈడీలను విచక్షణారహితంగా ప్రయోగించిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ను విమర్శించే నైతిక అర్హత కాంగ్రెస్ పార్టీకి లేనేలేదని అన్నారు.
రేవంత్‌రెడ్డికి సర్కారు వ్యవస్థలపై విశ్వాసం లేదు: దేవీప్రసాద్ ఫైర్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రభుత్వ వ్యవస్థల పట్ల విశ్వాసం లేదని బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ఫైర్ అయ్యారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బీఆర్ఎస్పై ఉన్న అక్రోశాన్ని బయటపెట్టారని విమర్శించారు. 650 పేజీల కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చకు పెడుతామని చెప్పి, లీకులు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయంలో అడ్డగోలుగా ప్రభుత్వం మాట్లాడకుండా ఉంటే, బీఆర్ఎస్ కూడా మాట్లాడేది కాదని విమర్శించారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు సుమిత్రా ఆనంద్, పల్లె రవికుమార్, బొమ్మర రామమూర్తి, కిశోర్‌గౌడ్, రవికుమార్‌గౌడ్, శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.