ఎల్బీనగర్, నవంబర్ 3: మూసీ నది పరివాహక ప్రాంతంలో ఇండ్లను కూల్చడానికి వచ్చే బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతామని, పేద ప్రజలను అన్యాయం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్‌లోని చైతన్యపురి డివిజన్ ద్వారకాపురం కాలనీలో మూసీ పరివాహక కాలనీలు, బస్తీల ప్రజలతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో సుధీర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళన, సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, అయితే ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకా రం కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
ప్రభుత్వం తమ ఇండ్లను ఎప్పు డు కూలుస్తుందోనన్న భయంతో పేద ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు ఎలాంటి మార్కింగ్‌లు వేసినా ప్రజలకు నష్టం జరుగనివ్వబోమని ధైర్యం చెప్పారు. మూసీ ప్రజల శ్రేయస్సు కోసం, వారికి అండగా నిలిచేందుకు అన్ని పార్టీలను కలుపుకుని పోరాడుతామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ విఠల్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు తోట మహేశ్ యాదవ్ తదితరులతోపాటు పలు కాలనీల సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.