Yadagirigutta | యాదగిరిగుట్ట : యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహ స్వామి( Laxmi Narasimha Swamy ) తిరుకల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వార్లను కొలుస్తూ హవనం జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు కల్యాణోత్సవం సేవను నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి తూర్పునకు అభిముఖంగా వేంచేపు చేసి కల్యాణ తంతును జరిపారు. విశ్వక్సేనారాధన, స్వస్తివాచనం కార్యక్రమాలతో కల్యాణాన్ని ప్రారంభించారు.
తెల్లవారుజామున స్వయంభూ నరసింహుడి ఆలయం తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లకు సుప్రభాత సేవను నిర్వహించారు. స్వామివారికి తిరువారాధన, బాలబోగం చేపట్టారు. అనంతరం పాలు పెరుగు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో నిజాభిషేకం జరిపి భక్తులకు నిజరూప దర్శనం కల్పించారు. అనంతరం సుహహ్రనామార్చనలు, నిత్యారాధనలు సాగాయి. పలు ధపాలుగా సాగిన సువర్ణ పుష్పార్చనలో భక్తులు పాల్గొన్నారు.
సాయంత్రం స్వామి వారిని గరుఢవాహనం, అమ్మవారిని తిరుచ్చివాహనంపై వేంచేపు సేవను తిరువీధి సేవను కొనసాగించారు. ఆలయ ముఖ మండపంలో సువర్ణమూర్తులకు దర్బార్ సేవ అత్యంత వైభవంగా చేపట్టారు. ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం అత్యంత వైభవంగా సాగింది. ఉదయం నుంచి రాత్రి వరకు దర్శనాలు సాగాయి. స్వామివారిని 15 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ఖజానాకు రూ. 18,32,659 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో ఎన్. గీత తెలిపారు.