జడ్చర్ల, మే 4 : ప్రజాపాలనలో రైతులు గోసపడుతున్నారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని పత్తిమార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చిన మక్కలను రెండు రోజుల్లో కొనకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సోమవారం ఆయన జడ్చర్లలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. మక్కజొన్నను కొనుగోలు చేయడంలేదని, కొనుగోలు చేసినా వాటిని ఎత్తడంలేదని, దాంతో నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నామని రైతులు లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.
మక్కజొన్నను వెంటనే కొనుగోలు చేయాలని, రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని మార్క్ఫెడ్, పీఏసీఎస్ అధికారులకు సూచిం చారు. అనంతరం మీడియాతో మాట్లాడు తూ.. గిట్టుబాటు ధర కల్పించేందుకు కొనుగో లు కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. పంట చేతికొచ్చినా కేంద్రాలు ఎక్కడా కన్పించడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసేందుకు కుట్ర చేస్తున్నదని విమర్శించారు.