న్యూఢిల్లీ : జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎన్సీడీఆర్సీ)లో పేరుకుపోతున్న కేసులపై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ భారాన్ని తగ్గించేందుకు ప్రాంతీయ సర్క్యూట్ బెంచ్‌లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర, జిల్లా వినియోగదారుల ఫోరమ్‌ల పనితీరుపై ఆడిట్ నిర్వహించాలని స్పష్టం చేసింది.
ఈ సంస్థలు “రిటైర్డ్ న్యాయాధికారులకు పునరావాస కేంద్రాలుగా మారకూడదు” అని హెచ్చరించింది. ఎన్‌సీడీఆర్‌సీలో ప్రస్తుతం 2018-19 నాటి కేసులను విచారిస్తున్నారని, పెండింగ్ కేసుల సంఖ్య భారీగా ఉన్నదనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్‌సీడీఆర్‌సీలో కేసులు పేరుకుపోతుంటే, కమిషన్ సభ్యుల గరిష్ఠ బలాన్ని పెంచడమే ఏకైక మార్గమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.