Honour Killing : దేశంలో మరో పరువు హత్య జరిగింది. ఒక యువతి బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న వీడియోలు వైరల్ కావడంతో పరువు పోయిందని భావించిన ఆమె తండ్రి, సోదరుడు.. యువతిని హత్య చేశారు. అంతేకాదు.. ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ, విచారణలో అన్ని వివరాలు బయటపడ్డాయి. తండ్రి, సోదరుడు చేసిన ఘాతుకానికి పోలీసులు వారిద్దరిని అరెస్టు చేశారు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గత నెలలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివి.
అహ్మదాబాద్‌లోని సర్ఖేజ్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల సోఫియా అనే యువతికి చెందిన ఒక వీడియో మూడు నెలల క్రితం వైరల్ అయింది. తన బాయ్ ఫ్రెండ్‌తో ఉన్న వీడియో అది. ఈ వీడియో వైరల్ కావడంతో సోఫియా తండ్రి మొహమ్మద్ ఫరూక్ నవాబ్ఖాన్ (56), అతడి కొడుకు, యువతి సోదరుడు హబిల్ ఫరూక్ (38) తమ కమ్యూనిటీలో పరువు పోయిందని భావించారు. ఇదే సమయంలో ఇకపై బాయ్స్‌కు దూరంగా ఉండాలని ఆ యువతిని బెదిరించారు. అయినప్పటికీ, వారి ఆగ్రహం చల్లారలేదు. ఆ యువతిని చంపైనా సరే.. తమ పరువు నిలబెట్టుకోవాలని వారిద్దరూ భావించారు.
ఇందుకోసం గత ఆగష్టు 12న రాత్రి ఆమెను హత్య చేసేందుకు తండ్రి ఫరూక్, సోదరుడు హబిల్ ప్రయత్నించారు. ఆ రోజు రాత్రి ఆమెను అన్న హబిల్ బైకుపై ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఇదే సమయంలో తండ్రి కూడా అక్కడే ఉన్నాడు. వారిద్దరూ కలిసి ఒక సుత్తితో సోఫియా తలపై కొట్టి చంపేశారు. తండ్రి, అన్న ఇద్దరూ కలిసి తీవ్రంగా దాడి చేశారు. అనంతరం ఈ కేసు తమపై రాకూడదని భావించి, ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశారు. తీవ్ర గాయాలపాలైన సోఫియాను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె తలకు, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మరణించింది.
తాము బైకుపై వెళ్తుండగా, ఆమె వెనకాల కూర్చుందని, గుర్తు తెలియని ఒక వాహనం తమను ఢీకొట్టి వెళ్లిపోయిందని నమ్మించారు. దీంతో పోలీసులు రోడ్డు ప్రమాదంగా, అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు. అయితే, డాక్టర్లు చికిత్స చేస్తుండగా.. అది రోడ్డు ప్రమాదంలా అనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు అనుమానం వచ్చి.. అన్ని కోణాల్లో విచారణ చేయగా.. సోఫియా తండ్రి, సోదరుడు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో నిందితులు ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.