అమరావతి : ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం స్థానిక సంస్థల ఎన్నికలు ( Elections ) సజావుగా జరగడం అనుమానమేనని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan) అన్నారు. అయినా వైసీపీ కార్యకర్తలు ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు.
బుధవారం పర్చూరు నియోజకవర్గ పార్టీ కేడర్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఎన్నికలను వాయిదా వేయాలన్న ఉద్దేశంతో రిజర్వేషన్ల డ్రామా ఆడుతుందని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో అధికార దుర్వినియోగం , పోలీసు బలగాల ప్రయోగించే అవకాశముందని అనుమానం వ్యక్తం చేశారు.
ఎన్నికలు సాఫీగా జరిగితే వైసీపీదే విజయమని ధీమాను వ్యక్తుం చేశారు. ఇప్పటికే 44 లక్షల ఓట్లు ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో గల్లంతయ్యాయని వివరించారు. దౌర్జన్యంతో ఎప్పటికీ పాలకులు రాజ్యం చేయలేరని అన్నారు. వచ్చే సెప్టెంబర్ , అక్టోబర్ నెలలో తన పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు.