వాషింగ్టన్ : బర్త్ టూరిజంపై ఉక్కు పాదం మోపడంలో భాగంగా విదేశీయులకు చెందిన 600కు పైగా వీసాలను అమెరికా రద్దు చేసింది. స్టేట్ డిపార్ట్మెంట్ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించింది. పిల్లలకు జన్మనివ్వడానికి అమెరికాకు ప్రయాణించే వారిని, అలాంటి వారి ప్రయాణానికి సహకరించే వారిని గుర్తించేందుకు బర్త్ టూరిజం నిరోధక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసినట్టు తెలిపింది.
ఈ టాస్క్ఫోర్స్ వీసాదారుల కార్యకలాపాలను, ప్రయాణ చరిత్రను సమీక్షిస్తుంది. దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 6న జారీచేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు మేరకు ఈ చర్యలు చేపట్టినట్టు స్టేట్ డిపార్ట్మెంట్ తెలియజేసింది. బర్త్ టూరిజంతో సంబంధం ఉన్న వ్యక్తులు అమెరికాలోకి ప్రవేశించడాన్ని నిరోధించే, నిరాకరించే లేదా వీసాలను రద్దు చేసే, శాశ్వతంగా నిషేధం విధించే అధికారాన్ని ఈ ఉత్తర్వు కల్పించింది.