హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : ఉస్మానియా యూనివర్సిటీ ఈఐ హాస్టల్లో న్యాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైనంపై శుక్రవారం ప్రముఖ న్యాయవాది ఇమ్మానేని రామారావు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఈఐ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయంపై విద్యార్థులు పలుమార్లు ఆందోళన చేపిట్టినట్టు తెలిపారు. తాగునీటి కొరత, విద్యుత్ వైర్లు, పారిశుధ్య లోపాల వల్ల విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదం ఉన్నదని రామారావు జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. వర్షానికి హాస్టల్లోని గదుల్లోకి నీరు చేరుతున్నదని, విద్యుత్ బోర్డులు తడిసి విద్యార్థులు షాక్కు గురవుతున్నారని వాపోయారు.
మొత్తం 103 గదుల్లో 20కిపైగా గదులు శిథిలావస్థలో ఉన్నాయని చెప్పారు. అందులో 120 మందికి ఒకే బాత్రూమ్ ఉన్నదని, వాటర్ ఫిల్టర్ల జాడే లేదని, ఒకే రూమ్లో 8 నుంచి 10 మంది విద్యార్థులు ఉంటూ అరిగోస పడుతున్నారని చెప్పారు. హాస్టల్ సమస్యల గురించి కాలేజీ, వర్సిటీ, ప్రజావాణిలో అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఎటువంటి మార్పు రాలేదని రామారావు ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే చర్యలు తీసుకొనేలా వైస్ చాన్స్లర్కు ఆదేశాలు జారీ చేయాలంటూ ఎన్హెచ్ఆర్సీలో న్యాయవాది రామారావు పిటిషన్ వేయడంతో.. దానికి 20963/ఐఎన్/2025గా గుర్తింపు సంఖ్య ఇచ్చారు. ఈ అంశంపై త్వరలోనే ఎన్హెచ్ఆర్సీ విచారణ చేపట్టనున్నది.