హైదరాబాద్ : రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో శాంతిభద్రతలు ( Law and Order ) ప్రమాదకర స్థాయికి పడిపోయాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) తీవ్రంగా ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న ఘోరమైన నేరాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
పోలీస్ యంత్రాంగం మొత్తాన్ని రాజకీయ కక్షసాధింపులు, ప్రతిపక్ష నాయకులను వేధించడం కోసమే మళ్లించడం వల్లనే, ప్రజల రక్షణ, భద్రత గాలిలో కలిసిపోయిందని విమర్శించారు.శాంతిభద్రతల క్షీణతపై బీఆర్ఎస్ ప్రతినిధి బృందం డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తున్న సమయంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే హైదరాబాద్లోని ప్రశాసన్ నగర్లో రిటైర్డ్ డీజీ ర్యాంక్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్య అత్యంత దారుణంగా హత్యకు గురైన వార్త రావడం దిగ్భ్రాంతి కరమని పేర్కొన్నారు.
అంతేకాకుండా, నిన్న రాత్రి సికింద్రాబాద్లో నడిరోడ్డుపై ఒక యువకుడిని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిందని, ఇది సామాన్య పౌరుల్లో పెరుగుతున్న అభద్రతా భావానికి అద్దం పడుతోందని స్పష్టం చేశారు. నేరాల నివారణ, ప్రజా భద్రతపై దృష్టి పెట్టాల్సిన పోలీస్, ఇంటెలిజెన్స్ వ్యవస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ తీరును విమర్శించే సోషల్ మీడియా గొంతులపై అక్రమ కేసులు బనాయించేందుకు వాడుకుంటోందని ఆరోపించారు.
‘పోలీస్ వ్యవస్థను రాజకీయ కక్షసాధింపు చర్యలకు వాడుకోవడం వల్లనే శాంతిభద్రతలు కుప్పకూలాయని’ స్పష్టం చేశారు. తెలంగాణలో మహిళలపై జరుగుతున్న నేరాలు, సైబర్ నేరాలు భారీగా పెరిగినట్లు తాజా ఎన్సీఆర్బీ (NCRB) నివేదికలు చెబుతున్నాయని, ఇది ప్రస్తుత ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని కేటీఆర్ గుర్తుచేశారు.
హోం శాఖను కూడా తన వద్దే ఉంచుకున్న రేవంత్ రెడ్డి ప్రజల ఆస్తిపాస్తులను, ప్రాణాలను రక్షించడంలోనూ, శాంతిభద్రతలను కాపాడటంలోనూ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రాజకీయ వేధింపులు ఆపి, పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని, ప్రజల్లో భరోసా కల్పించేలా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.