Lathi Charge | హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ‘మహిళలని చూడకుండా పోలీసులు మమ్మల్ని కుక్కల్ని కొట్టినట్టు కొట్టిన్రు’ అంటూ గ్రూప్స్ ఉద్యోగార్థుల ఆక్రందన మళ్లీ వినిపించింది. ముందురోజే అశోక్‌నగర్ సాక్షిగా దొరికిన వారిని దొరికినట్టే ఆడ, మగ అని తేడా లేకుండా ఉరికించుకుంటూ కొట్టిన పోలీసులు.. సచివాలయం సాక్షిగా మళ్లీ లాఠీచార్జికి దిగారు. ఎక్కడికక్కడే ఈడ్చిపడేశారు. కాళ్లు, చేతులు పట్టి గుంజేశారు. కడుపులో పిడిగుద్దులు గుద్దారు. రెక్కలి రిచి.. పోలీసు వ్యాన్లలో కుక్కారు.
సచివాలయ ముట్టడి సందర్భంగా అంతకుముందు ‘వస్తారా బయటకు.. రావాలా లోపలికి’ అంటూ అభ్యర్థులు చేస్తున్న నినాదాలతో ఆ ప్రాంగణం హోరెత్తింది. సచివాలయం ప్రధాన గేటుకు ఎదురుగా నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ‘మహిళలని చూడకుండా కుక్కల్ని కొట్టినట్టు కొట్టారు’ అంటూ ఒక్కో బాధితురాలు కన్నీటి పర్యంతమవుతుంటే.. విన్నవారి హృదయాలు చలించక మానవు. కనికరం చూపని మహిళా కానిస్టేబు ళ్లు.. తమను వ్యాన్లలోకి విసిరిపారేశారని కన్నీరు పెట్టుకున్నారు. తమ బతుకు కోసం పోరాడటం తప్పా అని.. బోరున విలపించారు.
గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా పాల్గొన్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, దాసోజు శ్రవ ణ్, ముఠా జయసిహాను సచివాలయం వద్ద అరెస్టు చేశారు. నేతలనూ వ్యాన్లలోకి ఈడ్చిపడేశారు. అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు.
పోలీసులు బూటుకాళ్లతో తన్నుకుంటూ నిరుద్యోగులను, నేతలను అరెస్టు చేశారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. పేదలందరికీ ఓపెన్ క్యాటగిరీ వర్తించాలని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 55 తీసుకొచ్చి న్యాయంచేసిందని, కాంగ్రెస్ సర్కార్ జీవో 29ని తీసుకొచ్చి అన్యాయం చేసిందని విమర్శించారు. సమైక్యాంధ్ర పాలన కంటే దారుణంగా రేవంత్‌రెడ్డి పాలన ఉన్నదని ధ్వజమెత్తారు. పోలీసులను నమ్ముకున్న ఏ రాజ్యం కూడా బాగుపడ్డట్టు చరిత్రలో లేదని తేల్చిచెప్పారు. అభ్యర్థుల డిమాండ్లను పరిష్కరించాలి. తక్షణం జీవో 29ను రద్దు చేయాలి’ అని డిమాండ్ చేశారు.
అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో గ్రూప్-1 అభ్యర్థుల ఉద్యమాన్ని ఆపలేరని బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిశోర్, ఉపేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులపై లాఠీచార్జి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నిరుద్యోగులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే గోపాల్, బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్, దాసోజు అరెస్టును ఖండించారు. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేశారని మండిపడ్డారు.
సీఎం రేవంత్‌రెడ్డి, బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్యన ఉన్నది ఆర్ఎస్ (రేవంత్‌రెడ్డి, సంజయ్) బ్రదర్స్ బంధమని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. జీవో 29 రద్దు చేయాలని గ్రూప్ 1 మె యిన్స్ అభ్యర్థులు చేస్తున్న ఆందోళన.. ఆర్ఎస్ బ్రదర్స్ బంధం కన్నా బలమైనదని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటేనని శనివారం నాటి పరిణామాలు స్పష్టం చేశాయని తెలిపారు.