నాగర్కర్నూల్ : జిల్లాలోని బిజినపల్లి మండలం మహదేవునిపేట గ్రామంలో నకిలీ డీఏపీ( Spurious DAP ) ఎరువులను పట్టుకున్నారు. రైతులు ఈ నకిలీ ఎరువులను వినియోగించ డాన్ని గుర్తించిన వ్యవసాయ అధికారులు, ఉన్నతాధికారులకు సమాచారం అందజేశారు.
వ్యవసాయ, పోలీసు అధికారులు ( Police ) గ్రామంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి గ్రామానికి చెందిన ఏడుగురు రైతుల ఇళ్లలో ( Farmers Houses ) నిల్వ ఉంచిన సుమారు 111 బస్తాల నకిలీ డీఏపీని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే పంట పొలాల్లో వినియోగించిన 39 డీఏపీ ఖాళీ సంచులను కూడా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా ఘటనాస్థలాన్ని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ( Collector Kesav Patil ) , ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటీల్ ( Sp Sangram Singh Patil ) సందర్శించారు. నకిలీ ఎరువులు రైతుల చేతికి ఎలా చేరాయి. ఏ మార్గంలో సరఫరా జరిగిందనే అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా గ్రామ వ్యవసాయ విస్తీర్ణ అధికారులు మధు, కళ్యాణిలను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన రైతులు కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన కొందరు వ్యక్తుల వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు గుర్తించారు.
కలెక్టర్ మాట్లాడుతూ స్వాధీనం చేసుకున్న డీఏపీ బస్తాల నుంచి నమూనాలను సేకరించి వెంటనే హైదరాబాద్లోని గుర్తింపు పొందిన ప్రయోగశాలకు పరీక్షల నిమిత్తం పంపించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షా నివేదికలు అందిన వెంటనే చట్టపరమైన చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. నకిలీ ఎరువులుగా నిర్ధారణ అయితే బాధ్యులపై ఎరువుల నియంత్రణ చట్టం, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటీల్ మాట్లాడుతూ రైతులను మోసం చేసే నకిలీ ఎరువుల వ్యాపారులపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదన్నారు. రైతుల భవిష్యత్తుతో చెలగాటమాడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తించి న్యాయపరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ డీఎస్పీ శ్రీనివాసులు, నాగర్ కర్నూల్ సీఐ అశోక్ రెడ్డి, బిజినపల్లి డీటీ రవికుమార్, ఎస్సై శంషుద్దీన్ , పోలీసు అధికారులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు ఉన్నారు.