హైదరాబాద్ జూన్ 16 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఫార్ములా ఈ-కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ మరోసారి విచారణకు పిలవడంపై గులాబీ శ్రేణులు భగ్గుమన్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఏసీబీ ఆఫీస్, తెలంగాణ భవన్‌కు తరలివచ్చారు. హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి ఖ్యాతిని తీసుకొచ్చిన కేటీఆర్‌కు అపకీర్తిని అంటించేందుకు కాంగ్రెస్ సర్కారు కుటిలయత్నాలు చేస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పదేండ్లపాటు మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రిగా హైదరాబాద్ ప్రతిష్ఠను పెంచిన నాయకుడు కేటీఆర్ అని గళమెత్తారు. అలాంటి కేటీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 14 అక్రమ కేసులు బనాయించిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధిచెప్పేందుకు తెలంగాణ జనం ఏకమవుతున్నారని స్పష్టంచేశారు. ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ప్రోద్బలంతోనే ఏసీబీ కేసు నమోదు చేసిందని ఆరోపించారు.
ఏసీబీ విచారణకు హాజరవుతున్న కేటీఆర్‌కు సంఘీభావం తెలిపేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి తెలంగాణ భవన్‌కు సోమవారం గులాబీ దండు కదిలివచ్చింది. ఉదయం ఎనిమిది గంటల నుంచే వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, నేతల కోలాహలంతో కిటకిటలాడింది. గులాబీ జెండాల రెపరెపలతో కళకళలాడింది. జై కేసీఆర్.. జై రామన్న.. జై తెలంగాణ.. రేవంత్‌రెడ్డి డౌన్‌డౌన్.. వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన.. అనే నినాదాలతో భవన్ ప్రాంగణం ప్రతిధ్వనించింది. కేటీఆర్ కాన్వాయ్ తెలంగాణ భవన్‌లోకి ప్రవేశించగానే నినాదాలతో మారుమోగింది. మహిళా నేతలు, కార్యకర్తలు అభిమాననేతకు సాదర స్వాగతం పలికారు. కిక్కిరిసిన శ్రేణుల మధ్య అతికష్టంమీద భవన్‌లోకి వెళ్లిన కేటీఆర్.. మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, పార్టీ లీగల్టీమ్తో సమాలోచనలు జరిపారు. అనంతరం తెలంగాణ భవన్ ప్రధాన ద్వారం వద్ద మీడియాతో మాట్లాడారు. అనంతరం జై తెలంగాణ నినాదాలు చేసుకుంటూ కారెక్కి విచారణ కోసం ఏసీబీ కార్యాలయానికి బయల్దేరి వెళ్లారు.
కేటీఆర్ రాకకు కొద్దిసేపటి ముందే మాజీ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేశారు. వారికి అవసరమైన ఏ ర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. కార్యకర్త లు సహనం కోల్పోవద్దని సంయమనం పా టించాలని సూచనలు చేశారు. అంతిమ విజ యం తమదేనని శ్రేణులు అధైర్యపడవద్దని ఉద్బోధించారు. ఈ సర్కారుకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. హరీశ్‌రావు జ్వరంతో బాధపడుతూనే కార్యకర్తలను సమన్వయపరుస్త్తూ.. దిశానిర్దేశం చేశారు.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏసీబీ కార్యాలయంలో ఉన్న కేటీఆర్ విచారణ అనంతరం తిరిగి తెలంగాణ భవన్‌కు బయల్దేరారు. భవన్ వెనుకవైపు గేటు వద్దకు చేరుకోగానే కార్యకర్తలు జై తెలంగాణ.. జై కేసీఆర్.. జై కేటీఆర్ నినాదాలతో హోరెత్తించారు. పటాకులు కాలుస్తూ హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. మహిళా కార్యకర్తలు గుమ్మడికాయతో దిష్టితీసి, కొబ్బరికాయలు కొట్టి సాదర స్వాగతం పలికారు. కేటీఆర్ సైతం వారికి కృతజ్ఞతలు చెప్తూ జై తెలంగాణ అంటూ నినదిస్తూ భవన్‌లోకి చేరుకున్నారు. కార్యకర్తలను ఉద్దేశించి మీడియా హాల్లో హరీశ్, కేటీఆర్ మా ట్లాడారు. కార్యకర్తలు ఆత్మైస్థెర్యం కోల్పోవద్దని అంతిమ విజయం మనదేనని ఉద్బోధించారు. సంఘీభావం తెలిపేందుకు తరలివచ్చిన శ్రేణులకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు.
కేటీఆర్‌కు సంఘీభావంగా బీఆర్ఎస్ కీలక నేతలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, ఎంపీలు ఉదయమే తెంగాణభవన్కు చేరుకున్నారు. శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, రాజ్యసభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్‌రావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జోగురామన్న, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీలు మంకెన కోటిరెడ్డి, తాతామధు, నవీన్ కుమార్‌రెడ్డి, కుర్మయ్యగారి నవీన్‌కుమార్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, శంభీర్‌పూర్ రాజు, ఎమ్మెల్యేలు వివేకానంద్‌గౌడ్, బండారు లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎంపీ మాలోతు కవిత, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, గాదరి కిశోర్, బాల్కసుమన్, పార్టీ నాయకులు తుల ఉమ, గ్యాదరి బాలమల్లు, ఎర్రోళ్ల శ్రీనివాస్, పల్లె రవికుమార్‌గౌడ్, తుంగ బాలు, కిశోర్‌గౌడ్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, గాంధీనాయక్, పల్లా ప్రవీణ్‌రెడ్డి తెలంగాణ భవన్‌కు తరలివచ్చారు.
కేటీఆర్ తెలంగాణ భవన్‌కు వస్తున్నారనే సమాచారంతో అక్కడ ఉదయ మే వందలాది మంది పోలీసులు మొహరించారు. రోప్‌వే టీంలు, మహిళా పోలీసులను రంగంలోకి దింపారు. గేటు వద్ద తనిఖీలు చేస్తూ కార్యకర్తలను అడ్డుకునేందుకు యత్నించారు. గులాబీ శ్రేణు లు ప్రతిఘటించడంతో బయటే కాపా లా ఉన్నారు. కేటీఆర్ కాన్వాయ్ భవన్‌లోకి ప్రవేశించిన తర్వాత ఆయన వెంట వచ్చిన నేతలను ఆపేందుకు యత్నించా రు. కేటీఆర్ ఏసీబీ ఆఫీస్‌కు వెళ్లిన వెంటనే తెలంగాణ భవన్ రెండు వైపుల గేట్లకు తాళాలు వేశారు. నేతలు, కార్యకర్తలు బయటకు రాకుండా అడ్డుకున్నా రు. గట్టిగా నిలదీయడంతో అరగంట తర్వాత రాకపోకలను అనుమతించారు.
ఏసీబీ కార్యాలయానికి వెళ్తున్న కేటీఆర్ కాన్వయ్‌ను పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో అనుసరించారు. బంజారాహిల్స్‌లోని నీలోఫర్ కేఫ్ వద్ద పోలీసులు అడ్డగించారు. కేఫ్‌లో ఉన్న కార్యకర్తలతోపాటు సామాన్యులను చెదరగొట్టారు. అప్పటికప్పుడు కేఫ్‌ను మూసివేయించారు. మీడియాతో మాట్లాడేందుకు యత్నించిన నాయకులను అడ్డుకున్నారు. లాఠీలతో అడ్డుకొంటూ నెట్టివేసేందుకు యత్నించారు. మహిళా కార్యకర్తలు, మీడియా ప్రతినిధులతోనూ దురుసుగా ప్రవర్తించారు. పలువురిని అదుపులోకి తీసుకొని వాహనాల్లో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.