కొడంగల్, ఏప్రిల్ 21: కొడంగల్ మండలం అప్పాయిపల్లిలో సర్వే నంబర్ 19లో చేపడుతున్న పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ సోమవారం పట్టణంలోని కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ విజయ్‌కుమార్‌కు రైతులు వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు తమ భూములను అప్పగించినా ఇంతవరకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించలేదని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను మోహరించి బుల్డోజర్ ద్వారా దౌర్జన్యంగా పనులు చేపడుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి రూ.10లక్షలు అందించి పనులు చేపట్టాలని డిమండ్చేశారు. సర్వే నంబర్ 19లోని భూమితో సంబంధంలేని కొందరికి నష్టపరిహారం అందిందని, దీనిపై ఎంక్వైరీ చేపట్టి బాధిత రైతులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను కోరారు.