హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): భూమిని ఎవరైనా స్థిరాస్తిగా భావిస్తారు. హైదరాబాద్‌లో కానీ, సమీప జిల్లాల్లో కానీ ఎకరం భూమి ఉందంటే రూ.కోట్ల విలువ ఉంటుందనే ధీమాగా ఉంటారు. దానిని అమ్ముకోవచ్చు.. తాకట్టు పెట్టుకోవచ్చు.. బ్యాంకు రుణం తీసుకొచ్చని అనుకుంటారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 22ఏ ముద్ర వేయడంతో ఆ భూముల విలువ బందీ అయింది. తాకట్టు పెట్టుకోకుండా, బ్యాంకు రుణం తీసుకోకుండా కోట్లాది రూపాయల విలువైన ఆస్తి చేతిలో ఉన్నా అవసరమైన సమయంలో నగదు లేని సంపదగా మిగిలింది. తెలంగాణ రాష్ట్రంలో సెక్షన్ 22ఏ నిషేధిత ఆస్తుల జాబితా వల్ల కేవలం భూమి రిజిస్ట్రేషన్లు మాత్రమే నిలిచిపోలేదు. వాటి ప్రభావం ఇప్పుడు బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు, హోమ్‌లోన్ దరఖాస్తులు, లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ వరకు విస్తరించింది.
సాధారణంగా హోమ్‌లోన్ మంజూరు చేసే ముందు బ్యాంకులు ఆస్తి టైటిల్, యాజమాన్య హకులు, గత లావాదేవీలు, ఎన్కంబరెన్స్, ప్రభుత్వ రికార్డులు తదితర అంశాలను న్యాయపరంగా పరిశీలిస్తాయి. ఆ ఆస్తి 22ఏ నిషేధిత జాబితాలో ఉన్నదని తేలితే.. దాని మారెట్ టైటిల్ ప్రశ్నార్థకమవుతుంది. ఆ ఆస్తిపై అమ్మకం, బదలాయింపు లేదా మార్టిగేజ్ వంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియలు నిలిచిపోవడమే దానికి కారణం. ఇటీవల బ్యాంకింగ్ వర్గాల్లోనూ ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. కొన్ని సందర్భాల్లో దరఖాస్తులను నేరుగా తిరసరించకుండా ‘హోల్డ్ ’లో పెడుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం స్వయంగా సాంకేతిక, పరిపాలనా తప్పిదాలను అంగీకరించిన నేపథ్యంలో.. వెంటనే లోన్ రిజెక్ట్ చేస్తే రుణగ్రహీతకు మరింత నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో కొన్ని బ్యాంకులు తుది నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టు తెలిసింది.
ఆస్తిని అత్యవసర ఆర్థిక అవసరాలకు ఉపయోగించుకోవాల్సిన కుటుంబాలపై 22ఏ ప్రభావం ఎకువగా కనిపిస్తున్నది. వైద్య చికిత్సలకు డబ్బు అవసరమైన కుటుంబాలు, పిల్లల ఉన్నత విద్య కోసం రుణం కోరేవారు, వివాహ ఖర్చుల కోసం ఆస్తిని తాకట్టు పెట్టాలనుకునే వారు, చిన్న, మధ్యతరహా వ్యాపారాల కోసం లోన్ తీసుకోవాలనుకునే వారు, ఇప్పటికే ఉన్న రుణాలను తీర్చేందుకు ఆస్తిపై టాప్ అప్‌లోన్ కోరేవారు.. ఇలాంటి వారికి 22ఏ జాబితా కొత్త చికులు తెచ్చిపెడుతున్నది. ఆ భూమిని అమ్మలేరు, తాకట్టు పెట్టలేరు, రుణం పొందలేరు.. అంటే ఆస్తి కండ్ల ముందు కనిపిస్తున్నా దాని ఆర్థిక ప్రయోజనం స్తంభించిపోతున్నది.
ఇప్పటికే బ్యాంకు రుణం మంజూరై, ఈఎంఐలు సక్రమంగా చెల్లిస్తున్న రుణగ్రహీతలకు తక్షణంగా పెద్ద సమస్య ఉండకపోవచ్చని బ్యాంకింగ్ వర్గాలు చెప్తున్నాయి. రుణగ్రహీత భవిష్యత్తులో డిఫాల్ట్ అయితే అసలు చికు మొదలవుతుంది. బ్యాంకు తన బకాయిలను వసూలు చేసేందుకు తాకట్టు పెట్టిన ఆస్తిని విక్రయించాల్సి వస్తుంది. కానీ, ఆ ఆస్తి అప్పటికీ 22ఏ జాబితాలో ఉంటే బ్యాంకు భద్రతగా ఉన్న ఆస్తిని విక్రయించి బకాయిలు రాబట్టడం కూడా సంక్లిష్టమవుతుంది. దీంతో రుణదాతకు కూడా రిస్ పెరుగుతుంది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సుమారు 25 లక్షల ఎకరాలు మాత్రమే నిషేధిత భూముల జాబితా (22ఏ)లో ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా కోటి ఎకరాలకు పైగా 22ఏ ముద్ర వేశారనే ఆరోపణలు ఉన్నాయి. తాజా అప్డేట్లో దాదాపు 90 లక్షల ప్రైవేట్ ఆస్తులు తప్పుగా 22ఏలో చేర్చారని బాధితవర్గాలు వాపోతున్నాయి. మరోవైపు 2.2 లక్షల ఎకరాలకు పైగా భూములు జాబితా నుంచి తొలగింపు కోసం దరఖాస్తు దశలో ఉన్నట్టు చెప్తున్నారు. ఈ గణాంకాలపై ప్రభుత్వం జిల్లావారీగా, సర్వేనంబర్ల వారీగా అధికారిక సమగ్ర శ్వేతపత్రం విడుదల చేస్తేనే వివాదానికి పూర్తిస్థాయి స్పష్టత వస్తుంది.
22ఏ జాబితా ఉద్దేశం ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, సీలింగ్ మిగులు భూములు, భూదాన్, వక్ఫ్, ఎండోమెంట్, అటవీ, నీటి వనరులకు సంబంధించిన భూములను అక్రమ లావాదేవీల నుంచి రక్షించడమే. అందువల్ల నిషేధిత జాబితాను పూర్తిగా ఎత్తివేయడం పరిషారం కాదు. కానీ ప్రభుత్వ భూమిని కాపాడే క్రమంలో ప్రైవేట్ భూమిని కూడా నిషేధిత జాబితాలో పెట్టి ప్రైవేట్ వ్యక్తులను అన్యాయానికి గురిచేయవద్దన్నది ఉద్దేశం.
వివాదం తీవ్రతతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల జరిగిన ఇబ్బందులపై ప్రజలకు క్షమాపణలు చెప్తూ, అధికారుల నిర్లక్ష్యం, సాంకేతిక లోపాల వల్ల సమస్య ఏర్పడిందని అంగీకరించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మలాజిగిరి, సంగారెడ్డి జిల్లాలను కలిపిన ‘క్యూర్’ ప్రాంతాల్లో సుమారు 35 వేల నుంచి 38 వేల సర్వేనంబర్లు నిషేధిత జాబితా నుంచి తొలగించే చర్యలు చేపడుతామని ప్రకటించారు. ఆ నాలుగు జిల్లాల్లో 22ఏ సమస్య తీవ్రంగా కనిపిస్తున్నది. ఇప్పటికే అనుమతులు పొందిన లేఅవుట్లు, ఇండ్ల స్థలాలు, అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ ఇండ్లు కూడా నిషేధిత జాబితాలోకి వచ్చాయని ఆస్తి యజమానులు, రియల్ ఎస్టేట్ వర్గాలు ఫిర్యాదులు చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, ప్రాపర్టీ ట్యాక్స్ రసీదులు ఉన్నప్పటికీ సంబంధిత సర్వేనంబర్ 22ఏలో కనిపించడంతో పెద్ద ఎత్తున లావాదేవీలు నిలిచిపోతున్నాయి.
ఒక సర్వేనంబర్‌లో ప్రభుత్వానికి చెందిన కొంతభూమి మాత్రమే ఉన్నప్పటికీ ఆ మొత్తం సర్వేనంబర్‌ను 22ఏ జాబితాలో నిషేధితంగా చూపించడంపై పెద్ద ప్రమాదంగా మారింది. ఆ సర్వేనంబర్ పరిధిలోని మొత్తం ప్రైవేట్ భూములన్నీ కూడా లావాదేవీలకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ 22ఏ జాబితాపై వివాదాలు న్యాయస్థానాల దాకా చేరుతున్నాయి. 2026లో హైకోర్టు ముందుకు వచ్చిన ఒక కేసులో.. ప్రభులంద భూమిపై పాత రెవెన్యూ రికార్డులు, తర్వాతి పహాణీల్లో భిన్నమైన యాజమాన్య వివరాలు ఉన్న అంశాన్ని కోర్టు పరిశీలించింది. మరో కేసు లో హైకోర్టు.. సెక్షన్ 22ఏ కింద ఆస్తిని నిషేధిత జాబితాలో చేర్చే ప్రక్రియకు చట్టపరమైన విధివిధానాలు పాటించాల్సిన అవసరాన్ని స్పష్టంచేసింది.
మార్గదర్శకాల ప్రకారం.. నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తిని తొలగించేందుకు లేదా సవరణకు దరఖాస్తు చేసినప్పుడు సంబంధిత అధికారులు దానిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిన వ్యవస్థ ఉన్నది. భూమి రికార్డులు, పాత పట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, రెగ్యులరైజేషన్ పత్రాలు, లేఅవుట్ అనుమతులు, కోర్టు ఉత్తర్వులు వంటి అనేక పత్రాలను పరిశీలించాల్సి రావడంతో క్షేత్రస్థాయిలో ప్రక్రియ నత్తనడకన సాగుతున్నదనే ఆరోపణలు వస్తున్నా యి. ప్రభుత్వమే తప్పిదాలను అంగీకరించిన నేపథ్యంలో.. బాధితులందరికీ జిల్లాలు, మండలాలు, సర్వేనంబర్ల వారీగా జాబితా విడుదల చేయడం, తప్పుగా చేర్చిన ఆస్తులను వేగంగా తొలగించడం, బ్యాంకులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వడం అత్యవసరంగా మారింది.