హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమసే ్తతెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో పేదల గుడిసెలకు కూడా భరోసా లేదు. శని, ఆదివారాలు వస్తే చాలు.. అనేక కుటుంబాలు గుండె చేతిలో పట్టుకొని బతుకీడుస్తున్నాయి. సర్కార్ వారి బుల్డోజర్లు ఏ అర్ధరాత్రో, అపరాత్రో వచ్చి తమ ఇంటిమీద పడుతాయోనని కాళరాత్రులు గడుపుతున్నారు. అధికారిక పత్రాలు, అన్ని అనుమతులున్నా వాటి అవసరం లేదు. కూల్చడమే ధ్యేయం. ఇదంతా నాణేనికి ఒకవైపు. మరోవైపు రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో భూ బకాసురులకు హద్దూ అదుపు లేకుండా పోతున్నది. షాడో సీఎంవో అండతో ప్రభుత్వ భూములను దర్జాగా పొతం పడుతున్నారు. రెవెన్యూ రికార్డులను చట్టబద్ధంగా టాంపరింగ్ చేస్తున్నారు. తహసీల్దార్ నుంచి కలెక్టర్ దాకా ఆమోదముద్ర వేయించి, అధికారిక ఫైళ్లుగా మార్చేస్తున్నారు. హైదరాబాద్ నగ ర శివారు కీసర మండలం నాగారంలో 2.30 ఎకరాల లావుణి పట్టా భూమికి రెవెన్యూ అధికారులు ప్రైవేటు పట్టా జారీ చేశారు. ఈ భూమి విలువ రూ.100 కోట్లు ఉంటుందని అంచనా. ఇదే సర్వే నంబర్లోని మరో 13 ఎకరాలను కూడా ప్రైవేట్‌పరం చేయడానికి ఫైళ్లు చకచకా కదులుతున్నట్టు సమాచారం.

మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం గ్రామం సర్వే నంబర్-291లో 41.27 ఎకరాలు, సర్వే నంబర్-354లో ఎకరం ప్రభుత్వ పోరంబోకు భూమి ఉన్నది. ఇందులో దాదాపు 9.25 ఎకరాల భూమిని గతంలో కందాడి బక్కయ్య అలియాస్ కందాడి బక్కారెడ్డి అనే రైతుతోపాటు మరో ఆరుగురు రైతులు సాగు చేసేవారు. అప్పటి ప్రభుత్వం 1960 జమాబందీ చట్టం కింద ఆ రైతులకు లావుణీ పట్టాలు మంజారు చేసింది. సర్వే నంబర్-291ని డివిజన్లుగా విభజించింది. 291/3లోని 1.30 ఎకరాలు, సర్వే నంబర్-354లోని ఎకరం కలిపి మొత్తం 2.30 ఎకరాల భూమికి బక్కయ్యకు లావుణి పట్టా ఇచ్చింది. ఆయనతోపాటు దోబి అంజయ్య, గూడూరు పెంటయ్య, అవుసల భీమాచారి, ఎం నారాయణ, కొత్త పోచయ్య, ప్రసాద్ అనే వ్యక్తులకు కూడా లావుణి పట్టా హక్కులు కల్పించారు. బక్కయ్య బతికినంతకాలం వ్యవసాయం చేసుకున్నాడు. కాలక్రమంలో భూముల విలువ పెరిగి ధరలకు రెక్కలు వచ్చాయి. కీసర ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఈ భూముల ధర ప్రస్తుతం గజం రూ.1.50 లక్షల చొప్పున అమ్ముడు పోతున్నట్టు చెప్తున్నారు.
కందాడి బకయ్య మరణానంతరం ఆయ న కుమారులు బాల్‌రెడ్డి, మల్లారెడ్డి, యాదిరె డ్డి, నాగయ్య, సత్తిరెడ్డి కలిసి 2.30 ఎకరాల భూమిని డాక్యుమెంట్ నంబర్ 3891/1991 ద్వారా ఎంవీ శివరామకృష్ణ, అప్పారావు అనే వ్యక్తులకు విక్రయించారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా 291/3 నంబర్లోని భూమిని తమకు మ్యుటేషన్ చే యాలని అప్పారావు అప్పట్లో తహసీల్దార్‌కు అర్జీ పెట్టుకున్నాడు. అయితే ప్రభుత్వం అసైన్ చేసిన భూముల క్రయవిక్రయాలు, గిఫ్ట్ డీడ్ల ద్వారా బదలాయింపు చేయటం ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్-1977 చట్టంలోని సెక్షన్ 3(1) ప్రకారం చట్ట విరుద్ధమని తెలియజేస్తూ మ్యుటేషన్ తిరస్కరించారు. కానీ, మ్యు టేషన్ లేకుండానే 2006లో అనూహ్యంగా పహాణీలో శివరామకృష్ణ, అప్పారావు పేర్లు నమోదు చేశారు. దీంతో 2016లో నాగారం గ్రామస్థులు అప్పటి తహసీల్దార్ కేవీ ఉపేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన విచారించగా, లావుణి పట్టా భూములను నిబంధనలు అతిక్రమించి మూడో పార్టీకి విక్రయించారని తేలింది. భూ క్రయవిక్రయాలు, భూ బదలాయింపు చెల్లదని ఎల్ఆర్ 30/1769/2016 లేఖ ద్వారా 12-8-2016 తేదీన ఆర్డీవో, జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపారు. అయినా మార్పు జరుగలేదు. రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ ఈ భూములు 22ఏ కింద ప్రొహిబిటెడ్ భూములుగానే ఉండటం గమనార్హం.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే షాడో సీఎంవో నేత ఒకరు ఈ భూమి వ్యవహారంలో తలదూర్చినట్టు చెప్తున్నారు. ‘బిగ్’ ఫ్యామిలీ ఆదేశాల మేరకు ఆయన అధికారులపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. వారి ఆదేశాలతోనే సీసీఎల్ఏ అధికారులు వేగంగా స్పందించి, రెవెన్యూ రికార్డులను టాంపరింగ్ చేసినట్టు తెలిసింది. ఖాతా నంబర్లు 60236, 60196, 60194 మీద భూమిని ప్రైవేట్ పట్టా అని సర్టిఫై చేస్తూ పాస్ పుస్తకాలు జారీ చేశారు. దీంతో కబ్జాదారులు 2.30 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారని స్థానిక ప్రజలు చెప్తున్నారు. ఈ భూముల్లో తాతాలిక షెడ్లు నిర్మించి అద్దెకు ఇచ్చినట్టు పేర్కొన్నారు. 25 షెడ్లను వినాయకుల విగ్రహాలు తయారు చేసుకునేవాళ్లకు అద్దెకు ఇచ్చి, ఒకో షెడ్డుకు నెలకు రూ.30 వేల చొప్పున అద్దె వసూలు చేస్తున్నట్టు స్థానికులు చెప్తున్నారు.