అచ్చంపేట, జూన్ 11 : రైతు బతికుండగానే.. మృతి చెందినట్టు చూపించి.. అతడి పేర ఉన్న రూ.కోట్ల విలువైన వ్యవసాయ భూమిని ఇతరులు తమ పేరిట పట్టా మార్పిడి చేసుకున్న ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారుల పాత్ర ఉన్నదన్న అనుమానాలను సదరు రైతు కుటుంబ సభ్యులు వ్యక్తంచేస్తున్నారు. బాధిత రైతు కుటుంబం తెలిపిన వివరాల మేరకు.. అచ్చంపేట మండలం హాజీపూర్‌కు చెందిన జంతుక మశన్న పేరిట సర్వే నంబర్ 78/9లో ఎకరం 18 గుంటల భూమి ఉన్నది.
ఇందుకు సంబంధించి ధరణి పాస్‌బుక్ ఉండటంతోపాటు రైతుబంధు సాయం కూడా అందుతున్నది. మశన్న బతికే ఉన్నా.. ఆయనకు తెలియకుండా ఎకరం 14 గుంటల భూమిని ఆంగోతు లక్పతి పేరిట పట్టా మార్పిడి జరిగింది. అదేవిధంగా మిగిలిన నాలుగు గుంటల భూమి మశన్న మనుమరాలు పొల్మూరి మౌనిక పేరిట, ఆమెకు తెలియకుండానే నమోదైనట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ తతంగమంతా 2026 ఫిబ్రవరి 4న అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయంలో జరిగినట్టు ఈసీ ద్వారా బాధిత రైతు కుటుంబీకులు గుర్తించారు.
సదరు భూమి శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిని అనుసరించి ఉండటంతో మార్కెట్లో దీనికి భారీ ధర పలుకుతున్నది. దీంతో కొందరు కుట్ర పన్ని అక్రమంగా పట్టా చేసుకున్నారని బాధితులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ ప్రక్రియలో రెవెన్యూ అధికారులకు కూడా భారీ మొత్తంలో ముట్టినట్టు ఆరోపిస్తున్నారు. సదరు భూమిని తన పేరిట నమోదు చేయించుకున్న వ్యక్తి రూ.1.50 కోట్లకు విక్రయించేందుకు ప్రయత్నించగా విషయం తెలిసింది. అచ్చంపేట తహసీల్దార్ యాదయ్యను వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి రాలేదని, వస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.