హైదరాబాద్, మే 26 (నమస్తేతెలంగాణ): టెమ్రిస్ వైస్ చైర్మన్ అండతో, సర్కార్ పెద్దల కనుసన్నల్లో పెద్దషాపూర్ భూ కుంభంకోణం జరిగిందని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి ఆరోపించారు. అన్ని ఆధారాలతో మాజీ మంత్రి హరీశ్‌రావు బయటపెట్టిన ఈ భూస్కామ్‌పై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు? అని ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్‌ను బదిలీ చేయడం, కలెక్టర్ సంజాయిషీ ఇవ్వడం చూస్తే తప్పు జరిగిందనే విషయం స్పష్టంగా అర్థమవుతున్నదని పేర్కొన్నారు.
మక్కలు కొనండని కరీంనగర్లో అడిగిన డ్రైవర్‌ను సస్పెండ్ చేసిన సర్కార్.. వెయ్యి కోట్ల స్కామ్‌కు కారకుడైన తహసీల్దార్‌ను ఎందుకు డిస్మిస్ చేయలేదని నిలదీశారు. భూముల విషయంలో అధికారులు అవినీతికి పాల్పడితే తక్షణమే చర్యలు తీసుకుంటారని, కానీ షాపూర్ భూవ్యవహారంలో అధికారులపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడంలో ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో పక్షం, నెల రోజులకొకటి చొప్పున భూ దోపిడీ వ్యవహారాలు బయటపడుతున్నాయని తెలిపారు.
అర్హతలేని నేత రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి దుయ్యబట్టారు. ఆయనే హోంమంత్రిగా చెలామణి అవుతున్నారని, పొద్దునలేస్తే ఆయన ఇంటి వద్ద ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఎందుకు క్యూకడుతున్నారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పెద్దలకు సోయి లేదా? ఆయనకు ఎందుకు దాసోహమయ్యారని, ఆయనను ఎందుకు కాపాడుతున్నరు? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి దగ్గరి వ్యక్తి తప్పుచేస్తే చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. గతంలో ఏనాడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని తెలిపారు.
‘అబ్దుల్లాపూర్‌మెట్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్‌తో రాష్ట్ర సర్కార్‌కు ఉన్న సంబంధమేమిటి? ఆయనను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి’ అని పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో జరిగే భూకుంభకోణాలకు బాధ్యులైన వారిని వదిలిపెట్టేదిలేదని స్పష్టం చేశారు. అటు క్షేత్రస్థాయిలో, ఇటు అసెంబ్లీలో ఎండగడుతామని హెచ్చరించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని భూదాన్ భూముల అక్రమాలపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.