సర్కార్ పెద్దలు కన్నేసిన భూములను చెరబట్టేందుకు హైడ్రా ఎలా పావుగా మారుతున్నదో చెప్పేందుకు మరో ఉదంతం మచ్చుతునకలా నిలిచింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ప్రైవేట్ భూముల్లోకి వెళ్లి, భూ యజమానులే ‘సెటిల్మెంట్’ చేసుకొనేలా హైడ్రా ఎలా దబాయిస్తున్నదీ మరోసారి వెలుగుచూసింది. ఐటీ కారిడార్‌కు గుండెకాయ లాంటి ఖానామెట్-కూకట్పల్లి సరిహద్దుల్లో ఉండే అత్యంత ఖరీదైన ఈదులకుంటలో ఉన్న ఓ ప్రైవేట్ భూమిపై ప్రభుత్వంలో నంబర్ 2గా చెప్పుకొనే మంత్రి కన్ను పడింది. అనుకున్నదే తడవుగా హైడ్రా రంగంలోకి దిగింది.. ‘ఆ భూముల్లో కుంట ఉండేది.. దీనిని స్వాధీనం చేసుకుంటాం’ అని ప్రకటించింది. భూ యజమానులు హైకోర్టును ఆశ్రయించి అక్కడ కుంట ఏమీ లేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్ధారించిందని రుజువులు చూపడంతో హైడ్రా చర్యలను హైకోర్టు తప్పుబట్టింది.
ఇక లాభం లేదనుకొని నంబర్ 2 మంత్రే స్వయంగా రంగంలోకి దిగి, భూ యజమానులను తన నివాసానికి పిలిపించుకొని ‘30 శాతం వాటా’ ఇస్తే ఇబ్బందులు రాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. తన కొడుకుతో రాయబారాలు నడిపారు. భూ యజమానులు దారికి రాలేదు. హైడ్రా రంగంలోకి దిగి ఆ భూముల్లో నిర్మాణాలను ధ్వంసం చేసి ఫెన్సింగ్ వేసింది. భూ యజమానులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించడంతో పరిశీలించిన ధర్మాసనం.. హైడ్రాకు చీవాట్లు పెట్టింది. ఫెన్సింగ్‌ను 24 గంటల్లో తొలగించి, పూర్వస్థితి కల్పించాలని తీర్పు ఇచ్చింది. ‘ఇకపై ఆ భూమి జోలికి వెళ్లబోము’ అని హామీ తీసుకొని, ఆ వ్యాఖ్యలను రికార్డు కూడా చేసింది. గతంలో బతుకమ్మ కుంట విషయంలోనూ హైడ్రా అత్యుత్సాహంపై హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఈ రెండు ఘటనల్లోనూ హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా.. అది చేసిన ఆరోపణలను కూడా తిప్పికొట్టింది.. మరి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది నిజమా? లేక కేటీఆర్ చెప్పింది నిజమా?
పట్టా ఉండి సొంత స్థలాల్లో ఇండ్లు కట్టుకొనే వారి జోలికి హైడ్రా వెళ్లదు. పార్కులు, చెరువులు, గుట్టలు, నాలాలను కబ్జా పెట్టుకొన్నవాళ్ల వీపులు మాత్రం సున్నం అవుతయి. హైడ్రా స్వాధీనం చేసుకున్న భూమిలో గజం కూడా నేనుగానీ, మా మంత్రులుగానీ తీసుకోం.
– వన మహోత్సవం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైడ్రాతో ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తున్నది. రేవంత్ ప్రభుత్వం భయపెట్టి వసూళ్ల దందా నడిపిస్తున్నది. హైడ్రా భయం వల్లనే కూకట్‌పల్లికి చెందిన బుచ్చమ్మ బలవన్మరణానికి పాల్పడింది. ఆమెది ఆత్మహత్య కాదు.. హైడ్రా అనే అరాచక సంస్థతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేయించిన హత్య. ప్రభుత్వ దిక్కుమాలిన చర్యల కారణంగా పేదలు ఆత్మహత్య చేసుకొనే దుస్థితి దాపురించింది. వేదశ్రీ అనే పాప ఏడుస్తూ పుస్తకాలు తీసుకుంటామంటే కూడా తీసుకోనివ్వకుండా ఇల్లు కూలగొట్టిండ్రు. ఇంత దిగజారిన, దిక్కుమాలిన చర్య మరేదైనా ఉంటదా?
-హైడ్రా కూల్చివేతల భయంతో ఆత్మహత్య చేసుకొన్న బుచ్చమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తూ కేటీఆర్ వ్యాఖ్యలు
మే 25న ఈదులకుంటలోని ప్రైవేట్ భూముల్లో నిర్మాణాలు కూల్చి హైడ్రా అధికారులు వేసిన కంచె, పాతిన బోర్డు
హైకోర్టు ఆదేశాలతో భూముల్లో హైడ్రా బోర్డులు తొలగించి తమ బోర్డు పెట్టిన ఎన్వీఎన్ సంస్థ ప్రతినిధులు
– గుండాల కృష్ణ- మిద్దెల రంగనాథ్

హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లిలోని సర్వే నంబర్లు 1002, 1003 నుంచి 1006 వరకు గల 17.12 ఎకరాల భూమి అదే గ్రామానికి చెందిన యాదయ్య, ఇతరుల పేరిట ఉన్నది. కనకదుర్గ హౌసింగ్ సొసైటీ పేరిట 80 మంది ఉద్యోగులు కొంత భూమిని వారి నుంచి కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మొత్తం 17.12 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. కనకదుర్గ సొసైటీ వాళ్లకు తామే నిర్మాణాలు చేసి ఇస్తామని ఒప్పందం చేసుకున్నది. 2005లో రిజిస్టర్డ్ జీపీఏ ద్వారా యాదయ్య, ఇతరుల నుంచి తీసుకున్నట్టుగా డాక్యుమెంట్లు ఉన్నాయి. 2006లో ఆ భూమిని ప్రభుత్వం సీలింగ్ సర్‌ప్లస్‌గా (మిగులు) ప్రకటించింది. దీంతో సదరు కొనుగోలుదారులు యూఎల్సీ (అర్బన్ ల్యాండ్ సీలింగ్) చట్టం కింద క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2008లో దరఖాస్తుదారుల నుంచి రూ.9.27 కోట్లు ఫీజుగా వసూలు చేసి ఆ భూమిని వారికి క్రమబద్ధీకరిస్తూ తేదీ 26.3.2008న జీవో నం.469 జారీ చేసింది. జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు అప్పటి బాలానగర్ ఎమ్మార్వో క్షేత్రస్థాయిలో పంచనామా చేసి ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 17.12 ఎకరాల భూమిని అధికారికంగా అప్పగించారు. ఇందులో భాగంగా 1002 సర్వే నంబర్లోని 3.35 ఎకరాల భూమిలో ‘విష్ణు విస్తారా’ అనే అపార్ట్ట్‌మెంట్ నిర్మాణమైంది. మరో 20 గుంటల భూమి రోడ్డులో పోవడంతో వారికి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ఈ భూమి కూకట్పల్లి-ఖానామెట్ సరిహద్దుల్లో ఉండటంతో వివాదాలు తెరపైకి వచ్చాయి. ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ ఆధీనంలో ఉన్న భూమిలో 1007 సర్వేనంబర్‌కు చెందిన భూమి కూడా ఉన్నదంటూ 2009లో భాగ్యనగర్ సొసైటీ వాళ్లు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశం మేరకు 2011లో మొదటిసారి ఆర్డీడీ (రిజినల్ డిప్యూటీ డైరెక్టర్) సర్వే చేశారు. సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ ఆధారంగా చేపట్టిన ఈ సర్వే ప్రకారం 1003 నుంచి 1006 సర్వేనంబర్లలో ఎలాంటి ఓవర్ ల్యాప్ లేదని, కూకట్పల్లి దివానీ విలేజ్ అని నివేదికలో పేర్కొన్నారు. 2014లో ఖానామెట్ పరిధిలో ఈ భూమిని ఆనుకుని ఉన్న భూ యజమానులు (సినీ ప్రముఖులు) హైకోర్టుకు వెళ్లారు. దీంతో 2014లో రెండోసారి ఆర్డీడీ సర్వే చేసి, 64 ఎకరాలు ఓవర్ ల్యాప్గా నిర్ధారించారు. అనంతరం ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ వాళ్లు నిర్మాణాల కోసం జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకోగా.. మరోసారి స్పష్టమైన సర్వే చేయించుకొని రావాలని అధికారులు సూచించారు. ఈ మేరకు 2018లో మూడోసారి ఆర్డీడీ సర్వే చేపట్టారు. విష్ణు విస్తారా నిర్మించిన భూమి పోగా మిగిలిన 13.17 ఎకరాల భూమి కూకట్పల్లి పరిధిలోని 1003-1006 సర్వేనంబర్లలోనిదని, ఇది పక్కా ప్రైవేట్ భూమి అని పేర్కొంటూ గ్రామ సరిహద్దులతోపాటు టీపిన్స్, ల్యాండ్స్కెచ్లు కూడా ఇచ్చారు. అనంతరం నీటిపారుదల, రెవెన్యూ శాఖలు జాయింట్ సర్వే చేసి అక్కడ ఎలాంటి నీటి వనరు లేదని ఎన్వోసీ జారీ చేశారు. ఓవర్ ల్యాప్ లేదని ఏడీ సర్వే కలెక్టర్‌కు స్పష్టం చేసింది. ఇలా 2011, 2018ల్లో వచ్చిన నివేదికలన్నింటినీ పొందుపరుస్తూ ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణాల కోసం జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకున్నది. వీటిని పరిశీలించిన జీహెచ్ఎంసీ.. రూ.7 కోట్లు ఫీజు కింద తీసుకొని నాలుగు సెల్లార్లు, ఒక గ్రౌండ్‌ఫ్లోర్ నిర్మాణానికి 7.12.2023న అనుమతులు జారీ చేసింది. 2020లో ఈ భూమి సర్వే నంబర్ 7 అని, అందులో ఈదులకుంట ఉందంటూ ఓ వ్యక్తి హైకోర్టులో కేసు వేశారు. విచారించిన ధర్మాసనం.. చివరికి అది సదరు కంపెనీకి చెందిన పట్టా భూమి అని, అక్కడ నీటి వనరు లేదని తీర్పు ఇచ్చింది.

హైడ్రా ఏర్పాటు తర్వాత ఈదులకుంట పేరు తరచూ వినిపించింది. ముఖ్యంగా సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతల సమయంలో సామాజిక మాధ్యమాల్లో దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈదులకుంటను కూడా పునరుద్ధరించాలనే డిమాండ్లు వినిపించాయి. 2024 ఆగస్టులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించారు. డాక్యుమెంట్లు తీసుకురావాలని భూ యజమానులను ఆదేశించారు. గత నెల 25న.. అంటే రంగనాథ్ పరిశీలించిన దాదాపు 21 నెలల తర్వాత హైడ్రా అధికారులు ఒక్కసారిగా రంగంలోకి దిగారు. 13.24 ఎకరాల్లో ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టిన నిర్మాణాలు, ఫెన్సింగ్ ఇతరత్రా అన్నింటినీ బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. గంటల వ్యవధిలోనే ఆ భూమిని స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ వేసి, రెండు బోర్డులు ఏర్పాటు చేశారు. మొదటి బోర్డులో ఖానామెట్ 11/37 సర్వేనంబర్‌లో 5.16 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామని చెప్పారు. రెండో బోర్డులో ఖానామెట్ సర్వేనంబర్ 7లో దాదాపు 6.05 ఎకరాల్లో విస్తరించిన ఈదులకుంటను సైతం రక్షించామన్నారు. ఈ భూమి కూడా హైడ్రా స్వాధీనం చేసుకున్నదని పేర్కొన్నారు. దీంతో ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ హైకోర్టు తలుపు తట్టింది. ఆ భూమిలోకి హైడ్రా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశించవద్దని హైకోర్టు ఆదేశించినా అధికారులు అతిక్రమించారని విన్నవించింది. విచారించిన ధర్మాసనం హైడ్రాపై ఆగ్రహం వ్యక్తంచేసింది. తమ ఉత్తర్వులున్నా ఈ దూకుడు ఏమిటని మండిపడింది. అధికారులు ఏర్పాటుచేసిన ఫెన్సింగ్‌ను 24 గంటల్లో తొలగించి, అక్కడ పూర్వస్థితి కల్పించాలని సుదీర్ఘమైన తీర్పు ఇచ్చింది. ఒకవేళ హైడ్రా పూర్వస్థితిని కల్పించకపోతే ప్రైవేట్ యజమానులే వెళ్లి భూమిని స్వాధీనం చేసుకోవాలని, అందుకు అయ్యే ఖర్చును హైడ్రా అధికారులు జీతభత్యాల నుంచి చెల్లించాలనేది తీర్పు సారాంశం. ఈ ఉత్తర్వులు వచ్చిన వెంటనే ‘మేము అప్పీల్‌కు వెళ్తాం’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైడ్రా అధికారిక వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారు. కానీ జూన్ 4న జరిగిన హైకోర్టు విచారణలో తాము తిరిగి ఆ భూమిలోకి వెళ్లమంటూ హైడ్రా తరపు న్యాయవాది కోర్టుకు స్పష్టంచేశారు. ఈ వ్యాఖ్యల్ని రికార్డు చేస్తామని న్యాయస్థానం స్పష్టం చేయగా సదరు న్యాయవాది అంగీకరించారు. అంటే ఆ భూముల్లోకి వెళ్లబోమని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ముందు హైడ్రా ఒప్పుకొన్నది.

2024లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరో వ్యక్తి ఇదే అంశంపై హైకోర్టులో కేసు వేశారు. దీనిని కూడా విచారించిన న్యాయస్థానం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు జీహెచ్ఎంసీ కమిషనర్, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, మేడ్చల్ కలెక్టర్, కూకట్పల్లి తహసీల్దార్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, నార్త్‌ట్యాంక్ డివిజన్ ఈఈ, ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులకు నోటీసులు ఇచ్చింది. రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు సమగ్ర సర్వే చేసి నివేదిక సమర్పించాలని 2024 ఆగస్టు 13న ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆగస్టు 16న కూకట్పల్లి తహసీల్దార్ సర్వే చేసి గ్రామ పటం ప్రకారం ఆ భూమిలో ఎలాంటి చెరువు/శిఖం/జలాశయం లేదని నివేదిక ఇచ్చారు. అదే నెల 21న నీటిపారుదల శాఖ ఏఈ, మండల గిర్దావర్ ఇద్దరూ కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి.. 1003 నుంచి 1006 సర్వేనంబర్ భూమిలో ఎలాంటి చెరువు లేదని నివేదిక ఇచ్చారు. ఈ సర్వే నంబర్లలో చెరువే లేదని నార్త్ ట్యాంక్స్ డివిజన్ నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్పష్టంగా ధ్రువీకరిస్తూ కోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ కేసుపై హైకోర్టులో ఇంకా విచారణ కొనసాగుతున్నది. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. సర్వే చేయాలని కోర్టు ఆదేశించిన 2024 ఆగస్టు నెల నుంచే హైడ్రాను అడ్డుపెట్టుకొని తెర వెనుక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
2024 ఆగస్టు 24న సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేసింది. వారం తర్వాత ఆగస్టు 31న ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్కు చెందిన సర్వేనంబర్ 1003-1006లోని భూమిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా పరిశీలించారు.
సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ చూపిస్తూ.. అక్కడ ఈదులకుంట ఉండేదని, దానిని పూర్తిగా ఆక్రమించారని చెప్పారు. దీనిని స్వాధీనం చేసుకుంటామని అక్కడే మీడియాకు వెల్లడించారు. దీంతో హుటాహుటిన రోజుల వ్యవధిలోనే ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ హైకోర్టుకు వెళ్లింది. విచారించిన ధర్మాసనం ‘ఆ భూమిలోకి వెళ్లవద్దు (నాట్ టు ఇంటర్ఫియర్)’ అని హైడ్రాను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో సదరు కంపెనీ వాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు రెండు నెలల తర్వాత అక్టోబర్‌లో నంబర్-2 అని చెప్పుకొనే మంత్రి నుంచి కొందరు మధ్యవర్తుల ద్వారా కంపెనీ ప్రతినిధులకు కబురు అందినట్టు సమాచారం. వారు సదరు మంత్రి ఇంటికి వెళ్లి కలువాలనేది కబురు సారాంశం.
అసలే మంత్రి కావడంతో కంపెనీ వాళ్లు ఒక జలాశయం వ్యూలో ఉన్న సదరు మంత్రివర్యుల నివాసానికి వెళ్లారట. వాళ్లను చూడగానే మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, ‘మీరంతా దొంగ జీవోలు (ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2008లో ఇచ్చిన జీవో 469) తెచ్చుకొని చెరువును ఆక్రమిస్తారా?’ అని దబాయించినట్టు తెలిసింది. జరిగిందేదో జరిగిందిగానీ.. 30 శాతం భూమి అంటే నాలుగెకరాలు ఇస్తే ఆ భూమిలో చెరువులేదని ప్రకటిస్తామని, లేదంటే చెరువుగా నిర్ధారిస్తామని మంత్రి బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతా సరిగ్గానే ఉందని చెప్పేలోపే.. ‘అవేం కాదు, నాలుగెకరాలు మీరే రిజిస్ట్రేషన్ చేస్తారులే!’ అంటూ పంపించినట్టు తెలిసింది.
సదరు భూమిలోకి హైడ్రా కమిషనర్ రంగనాథ్ 2024 ఆగస్టు 31న వచ్చి పరిశీలించారు. సర్వే చేసి హద్దుల్ని నిర్ధారిస్తామన్నారు. కానీ అది జరుగలేదు. అనంతరం ఈదులకుంట సర్వే చేసి, సరిహద్దులు నిర్ధారించే వరకు ఎలాంటి పనులు చేయకుండా చూడాలని అధికారులను హైడ్రా కమిషనర్ ఆదేశించినట్టు 27 నవంబర్ 2024న పత్రికాముఖంగా ప్రకటించారు.
మరికొంత కాలం పాటు హైడ్రా ఈ అంశాన్ని పట్టించుకోలేదు. కానీ తరచూ రెవెన్యూ అధికారులు మాత్రం ఆ భూముల్లోకి రావడం.. సదరు మంత్రి ప్రతిపాదనలను గుర్తు చేయడం పరిపాటిగా మారినట్టు తెలిసింది. అయినా ఎలాంటి స్పందనా లేదు. అనంతరం 2025 జనవరి 2న హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరోసారి ఆ భూమి వద్దకు వచ్చి పరిశీలించారు. ఈదులకుంట ఆక్రమణలు తొలగించి, స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ఆ తర్వాత రెవెన్యూ శాఖ అధికారులు వచ్చి కంపెనీ ప్రతినిధులను కలిసి రికార్డులన్నీ పరిశీలించి వెళ్లారు.
ఓవైపు తరచూ హైడ్రా, రెవెన్యూ అధికారులు అక్కడికి వచ్చి పోతుండటం.. ఎలాగూ తమకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయనే ధీమాతో కంపెనీ ప్రతినిధులు ఉండటంతో కొంత సమయం గడిచింది.
ఈ క్రమంలోనే గతంలో 2024లో ఒక వ్యక్తి వేసిన కేసును సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు ముఖ్యంగా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని అధికారులు ఇచ్చిన నివేదికలను పరిశీలించి చివరకు 2025 మే 28న కుండబద్దలు కొట్టినట్టు తీర్పు వెల్లడించింది. అన్ని శాఖల అధికారులు ఇచ్చిన నివేదికల మేరకు కూకట్పల్లి గ్రామంలోని సర్వేనంబర్ 1003 నుంచి 1006 వరకు 13.24 గుంటల భూమిలో జలాశయం/శిఖం/చెరువు లేదని, ఇది పట్టా భూమిగా నిర్ధారిస్తూ హైకోర్టు తన తీర్పులో పేర్కొన్నది. ఒకవేళ ప్రభుత్వం ఖానామెట్ సర్వేనంబర్ 7లో చెరువు ఉన్నదని భావిస్తే సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో చెరువు ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ ఉత్తర్వులతో కంపెనీ ప్రతినిధుల్లో ధీమా పెరిగింది.
హైకోర్టు ఉత్తర్వుల తర్వాత కంపెనీ ప్రతినిధులు తమ భూమిలో నిర్మాణ పనులు కొనసాగిస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలో 2025 అక్టోబర్‌లో అమాత్యుడి కుమారుడి నుంచి కంపెనీ వాళ్లకు ఫోన్ కాల్ (ఫేస్‌టైమ్) వచ్చిందని సమాచారం. తన కార్యాలయానికి వచ్చి కలువాలనేది ఫోన్‌కాల్ సారాంశం.
అసలే మంత్రి కుమారుడు కావడంతో కంపెనీ వాళ్లు వెళ్లి కలిశారని తెలిసింది. ‘నాన్నను కలువడంతో మీ పని పూర్తయినందున… మా పని చేయమని అడిగారు’ అనడంతో కంపెనీ వాళ్లు షాకయ్యారట. తమకు అన్ని డాక్యుమెంట్లు, కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పగా.. ‘హైడ్రా మీ భూమిలోకి రాకుండా మా నాన్న చూశారు కదా!’ అని మంత్రి కుమారుడు మాట్లాడినట్టు విశ్వసనీయ సమాచారం. ఆలోచనలో పడిన కంపెనీ వాళ్లు అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా తరచూ రెవెన్యూ అధికారులు వచ్చి అదేరీతిన ఒత్తిడి చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఒక సందర్భంలో హైడ్రా అధికారులు వచ్చి ఎమ్మార్వోను కలువాల్సిందిగా కంపెనీ వాళ్లకు సూచించడంతో తమకు అధికారికంగా నోటీసులు ఇవ్వాలని అనడంతో అడుగు ముందుకు వేయలేదని సమాచారం. అయినా తరచూ అధికారులు రావడం, తొందరగా సెటిల్ చేసుకోవాలంటూ సలహా ఇచ్చి వెళ్లడంతో దిక్కుతోచని స్థితిలో కంపెనీ వాళ్లు పడిపోయారని చెప్తున్నారు.
కంపెనీ వాళ్ల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో చివరకు మరోసారి మంత్రివర్యులే పరోక్షంగా రంగంలోకి దిగినట్టు తెలిసింది. గత నెలలో ఒక ప్రముఖ దినపత్రికలో ఈదులకుంట ఆక్రమణపై కథనం వచ్చింది.
మరుసటిరోజే సదరు మంత్రి రెవెన్యూ అధికారులతో సమావేశమై వెంటనే ఈదులకుంటను పునరుద్ధరించాలని ఆదేశాలు ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అందుకు రూ.20 లక్షలు కేటాయించాలని కూడా సూచించినట్టు సమాచారం. ఇది జరిగిన మరుసటిరోజే మే 25న హైడ్రా నేరుగా రంగంలోకి దిగింది. ఉదయాన్నే వచ్చి 13.12 ఎకరాల్లో ఉన్న ఫెన్సింగ్‌ను పూర్తిగా నేలమట్టం చేసింది. షెడ్లు, సెల్లార్ కోసం చేపట్టిన కాంక్రీట్ నిర్మాణాన్ని సైతం పూర్తిగా ధ్వంసం చేసి హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. కనీసం ముందస్తు నోటీసు లేకుండా, హైకోర్టు స్టే ఉన్నా ఇలాంటి చర్యలకు ఎలా పాల్పడుతారు? అంటూ భూ యజమానులు నెత్తీనోరు కొట్టుకున్నా పట్టించుకోలేదు.
హైడ్రా చర్యలపై వెంటనే సదరు భూ యజమానులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. స్టే ఉన్నా హైడ్రా ఇలాంటి చర్యలకు పాల్పడిందంటూ కంటెంప్ట్ వేయడంతో మే 29న హైకోర్టు సుదీర్ఘమైన ఉత్తర్వులు జారీ చేసింది.
హైడ్రా తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతూ 24 గంటల్లో అక్కడ యథాతథ స్థితి ఉండాలని ఆదేశించింది. హైడ్రా స్వయంగా వేసిన ఫెన్సింగ్ తీసి, యజమానులకు భూమి స్వాధీనం చేయాలని చెప్పింది. లేదంటే భూ యజమానులే స్వయంగా వెళ్లి హైడ్రా ఫెన్సింగ్‌ను తొలగించి, భూమిని స్వాధీనం చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు అయ్యే ఖర్చును హైడ్రా అధికారుల జీతాల నుంచి చెల్లించాలని కూడా అందులో పేర్కొన్నది.
హైకోర్టు తీర్పు తర్వాత హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉత్తర్వులు వెలువడిన రోజే హైడ్రా కమిషనర్ స్వయంగా ఉత్తర్వుల కాపీని హైడ్రా అధికారిక వాట్సాప్‌లో పోస్టు చేసి దీనిపై అప్పీలుకు వెళుతున్నట్టు పేర్కొన్నారు.
హైకోర్టు తీర్పు మేరకు యజమానులు 24 గంటల పాటు వేచి చూశారు. కానీ హైడ్రా స్పందించకపోవడంతో 48 గంటల తర్వాత మీడియాను వెంట బెట్టుకొని భూమి వద్దకు వెళ్లారు. చాలాసేపు హైడ్రామా అనంతరం భూ యజమానులు జేసీబీతో హైడ్రా ఫెన్సింగ్‌ను తొలగించి, భూమిని స్వాధీనం చేసుకున్నారు. అయినా హైడ్రా అధికారులు సమీపంలోనే వాహనాన్ని నిలుపుకొని ఉన్నారు. రెండు, మూడు రోజులపాటు అదేవిధంగా ఉండటంతో ఈ నెల 4న యజమానులు హైకోర్టుకు విన్నవించారు. విచారించిన కోర్టు.. ఇకముందు జోక్యం చేసుకోబోమని హామీ ఇవ్వాలని హైడ్రా కౌన్సిల్‌ను అడిగింది. అందుకు కౌన్సిల్ అంగీకరిస్తూ, ఇకపై ఆ భూమి జోలికి వెళ్లబోమని హామీ ఇచ్చింది. ఆ వ్యాఖ్యలను ధర్మాసనం రికార్డు చేసింది.
అసలు ఈదులకుంట ఎక్కడ ఉన్నది? ఖానామెట్ సర్వేనంబర్ 7లో ఉన్నట్టుగా మాస్టర్‌ప్లాన్, రెవెన్యూ రికార్డుల్లో ఉన్నది. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ ఉన్నదనేది ఇప్పటివరకు అంటే రెండున్నరేండ్లుగా ఎందుకు తేల్చలేదు?
నిజంగా ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్కు చెందిన భూమిలోనే ఈదులకుంట ఉంటే, ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.9.27 కోట్ల ఫీజు తీసుకొని క్రమబద్ధీకరించింది కదా! కాబట్టి ఆ మేరకు వారికి న్యాయం చేయాల్సి ఉంటుంది. దానికంటే ముందు ఈదులకుంట ఉన్నట్టుగా హైకోర్టుకు శాస్త్రీయమైన ఆధారాలు చూపాలి. కానీ ఈ దిశగా ప్రభుత్వం, హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోలేదు?
సదరు భూమిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ 2024 ఆగస్టు, 2025 జనవరిలో పరిశీలించారు. ఈ మధ్యకాలంలో, ఆ తర్వాత కూడా హైడ్రా, రెవెన్యూ అధికారులు పదుల సంఖ్యలో పరిశీలన చేశారు. కానీ సర్వే ఎందుకు చేయలేదు? ముఖ్యంగా చెరువును పునరుద్ధరిస్తామని హైడ్రా కమిషనర్ స్వయంగా మీడియా ముందు పలుమార్లు ప్రకటించారు. మరి ఎందుకు పునరుద్ధరించలేదు?
సాధారణంగా హైడ్రా కూల్చివేతల్లో గతంలోని ప్రభుత్వాలు, అధికారులు అంతా తప్పులు చేశారు, వాళ్లు అనుమతులు ఇచ్చినా, కోర్టులు ఆదేశించినా ‘వుయ్ డోంట్ కేర్!’ అనడం ఆనవాయితీ. మరి.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలోనే రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు ఆ భూమిలో ఈదులకుంట లేదని నివేదికలు ఇచ్చారు కదా? ఆ మేరకే హైకోర్టు తీర్పు ఇచ్చింది కదా? ఇంతకీ.. ఆ అధికారుల నివేదికలు సరైనవా? ఈదులకుంట ఉన్నదని చెప్తున్న హైడ్రా మాటలు నిజమా? ఒకే ప్రభుత్వంలో, ఒకే సమయంలో, ఇలా భిన్నమైన నివేదికలు ఇవ్వడం వెనుక మతలబు ఏమిటి?
హైడ్రా ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు చోటుచేసుకున్న పరిణామాలను చూస్తే.. ఒక కుంట పునరుద్ధరణకు ఇంత సమయం తీసుకున్న దాఖలాల్లేవు. సున్నం చెరువు, నల్ల చెరువు.. ఇలా ఏడుచోట్ల పునరుద్ధరణ పనులు చేపట్టారు. కానీ ఇక్కడే హైడ్రా ఇంత కాలయాపన చేయడం వెనుక మర్మమేంది?
ఇటీవల హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైడ్రా అధికారిక వాట్సాప్ గ్రూపులో స్పష్టం చేశారు. కానీ ఎందుకు అప్పీలుకు వెళ్లలేదు? రోజుల వ్యవధిలోనే మనసు మార్చుకొని.. ఇకపై ఆ భూముల్లో జోక్యం చేసుకోబోమని ఎందుకు నిర్ణయించారు?