జనగామ, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : నిన్న, మొన్నటివరకు హైదరాబాద్ మహానగరానికే పరిమితం అనుకొన్న 22ఏ నిషేధిత జాబితా రాష్ట్రమంతా చుట్టుకొన్నదనే విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ పరిధిలోని జనగామ, హనుమకొండ జిల్లాల్లోనే వందలాది సర్వేనంబర్లలో సుమారు 76 వేల ఎకరాలను ఈ నిషేధిత జాబితాలో చేర్చారు. పల్లెలు, పట్నం అన్న తేడాలేకుండా అంతటా నిషేధ అస్ర్తాన్ని ప్రయోగించడంతో నిరుడు అక్టోబర్ 29 నుంచే రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అధికారిక సమాచారం మేరకు హనుమకొండ జిల్లాలో సుమారు 21 వేల ఎకరాల్లో అసైన్డ్ భూములు, 55 వేల ఎకరాల్లో ప్రభుత్వ భూములుండగా, 22ఏ కింద దాదాపు 40 వేల ఎకరాల భూమి ఉన్నది.
జనగామ జిల్లాలో సైతం ప్రభుత్వ భూములు సుమారు 67 వేల ఎకరాలు, అసైన్డ్ భూములు 30 వేల ఎకరాలుండగా, 22ఏ నిషేధిత జాబితాలో సుమారుగా 36 వేల ఎకరాలు ఉన్నట్టు తెలుస్తున్నది. దీంతో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులు అమ్ముకునేవారు, కొనుగోలుదారులు అవస్థలు పడుతున్నారు. 22-1(ఏ)లో పీవోటీ 1977, 108 కింద కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ, వ్యవసాయేతర భూములను నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ విషయం తెలియక ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, తహసీల్దార్ ఆఫీసులు, కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు చెప్పులరిగేలా తిరుగుతున్నారు. తమ భూములపై విధించిన నిషేధాన్ని తొలగించాలని ప్రజల నుంచి వందల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన అర్వపల్లి గోపాలకృష్ణ శర్మ అనే పురోహితుడికి చెందిన ఖాతా నంబర్ 3, సర్వే నంబర్ 4లో ఉన్న 2 ఎకరాల 3 గుం టలు, ఆయన పేరిటే ఉన్న మరో సర్వేనంబర్ 5లో ఉన్న 2 ఎకరాల 22 గుంటల పట్టాభూమిని ఆయనకు తెలియకుండానే నిషేధిత జాబితా (పీవోబీ)లో చేర్చారు. దీనిపై బాధిత కుటుంబం ఈ ఏడాది మే 18న ప్రజావాణిలో జనగామ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినా ఇప్పటివరకు ఆ భూములు నిషేధిత జాబితా నుంచి విడుదల కాలేదు.
మహబూబాబాద్, ఆగస్టు 24 ( నమస్తే తెలంగాణ): మహబూబాబాద్ పట్టణంలోని సత్యనారాయణనగర్ కాలనీలో నివాసముంటున్న ఓ వ్యక్తి వైద్య ఖర్చులకు తనకున్న జాగ అమ్ముకొనేందుకు ఇప్పుడు 22ఏ నిషేధిత జాబితా కారణంగా అవస్థలు పడుతున్నాడు. ఆ వ్యక్తికి పట్టణంలోని 24వ వార్డులో 150 గజాల ఇంటి జాగ ఉన్నది. ఆ భూమిని 2016లో కొనుగోలు చేయగా, 2021 లో కొంత విక్రయించాడు. ఇటీవల ఆరోగ్యం బాగాలేకపోవడంతో వైద్య ఖర్చు ల నిమిత్తం దానిని మరో వ్యక్తికి విక్రయించాడు. రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించాడు. ఆ భూమి 22-ఏ జాబితాలో ఉండడంతో రిజిస్ట్ట్రేషన్ కాలేదు. ఉన్న జబ్బు ముదిరిపోతుండగా, తన జాగ అమ్ముడుపోవడం లేదని, నగదు చేతికి అందడం లేదని రోజురోజుకూ కృశించి పోతున్నాడు.