కందుకూరు, ఏప్రిల్ 11: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం బేగరికంచ వద్ద ప్రభుత్వం తలపెట్టిన ఫోర్త్‌సిటీ రోడ్డుకు భూములు ఇచ్చేదిలేదని రైతులు స్పష్టంచేశారు. తమకు జీవనాధారమైన ఎకరం, రెండెకరాల భూమి లాక్కుంటే రోడ్డున పడుతామని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం వివిధ గ్రామాలలో విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా స్పెషల్ కలెక్టర్, భూసేకరణ అధికారి రాజుకు లేమూరులో రైతులు అభ్యంతరాలు తెలుపుతూ వినతిపత్రం సమర్పించారు. తాము భూములు కోల్పోతే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చేదిలేదని స్పష్టంచేశారు. మరోవైపు ప్రభుత్వం ఆహ్వానించిన రోడ్డు టెండర్లను రైతుల అభ్యంతరాల నేపథ్యంలో హైకోర్టు మార్చి 21న నిలుపుదల చేసింది.
ఇక్కడే భూసేకరణ ఎందుకు?
శ్రీశైలం జాతీయ రహదారి, నాగార్జునసాగర్ మధ్యలో మాడుగుల, యాచారం, మేడిపల్లి, శేరిగూడ, మంగళపల్లి, ఎలిమినేడు, తిమ్మాపూర్ పెద్దరోడ్డు, కొంగరరోడ్డు, మహేశ్వరం, పెద్ద గోల్కొండ, మనసాన్పల్లి రేడియల్ రోడ్లు ఉండగా కొత్తగా భూసేకరణ ఎందుకని రైతులు నిలదీస్తున్నారు. ఆకుతోటపల్లి వరకు దాదాపు 1,000 ఎకరాల పైబడి పచ్చని పంటలు పండే భూములను తీసుకొని, తూతూ మంత్రంగా పరిహారం ఇచ్చేందుకు అధికారులు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే కొంగర గ్రామ రైతుల నుంచి భూములు సేకరించిన ప్రభుత్వం.. పరిహారం, ఉద్యోగాల హామీలు నెరవేర్చలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో తాము మాత్రం ప్రభుత్వాన్ని ఎలా నమ్మాలని నిలదీశారు. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు.