ఊట్కూర్, జూన్ 14 : భూతగాదాకు ఒకరు బలయ్యారు. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఊట్కూర్ మండలం చిన్నపొర్ల గ్రామంలోని దళిత కాలనీకి చెందిన గువ్వలి లక్ష్మప్పకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ఎర్రగండ్ల సంజప్ప, రెండో భార్యకు పెద్ద సవారప్ప, చిన్న సవారప్ప సంతానం. అతడి పేరిట ఉన్న 9 ఎకరాలను ముగ్గురు కొడుకులకు సమానంగా బదలాయించాడు. తర్వాత కొన్నేండ్లకు లక్ష్మప్ప మృతి చెందగా.. అతడి కుమారులు భూపంపకాలను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. కొన్నేండ్లుగా వీరి మధ్య వివాదం సాగుతున్నది. కాగా గురువారం పెద ్దసవారప్ప, అతడి కుమారుడు సంజీవ్(28), సోదరుడు చిన్న సవారప్ప, మరదలు కవిత వారి పేరుపై ఉన్న పొలంలో విత్తనాలు విత్తేందుకు వెళ్లారు. వీరిపై దాయాదులు ఆశప్ప, గుట్టప్ప, చిన్న వెంకటప్ప, ఆటో సంజీవ్, శ్రీను, కిష్టప్ప, నట్టలప్పతోపాటు మరికొందరు రాళ్లు, కర్రలతో దాడికి తెగబడ్డారు.
తీవ్రంగా గాయపడిన సంజీవ్‌ను నారాయణపేట జిల్లా దవాఖానకు తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్‌నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య అనిత, పిల్లలు సాత్విక్, వంశీ ఉన్నారు. కాగా గ్రామంలో ఉద్రిక్తత నెలకొనగా.. మక్తల్ సీఐ చంద్రశేఖర్ పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. దాడికి కారణమైన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. దాయాదుల మధ్య ఘర్షణ జరుగుతున్న విషయాన్ని బాధిత కుటుంబం, స్థానికులు డయల్ 100కు సమాచారం అందించినా ఎస్సై ఆలస్యంగా స్పందించారని తెలిసింది. బీజేపీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్న సంజీవ్.. తమకు దాయాదుల నుంచి ముప్పు పొంచి ఉన్నదని పది రోజుల కిందటే పోలీసులను ఆశ్రయించాడు. అయితే దాడి చేసింది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడంతో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
న్యాయవాదిని బెదిరించిన ఎస్సై
జోగుళాంబ గద్వాల జిల్లా అయిజలో సివిల్ పంచాయితీలో తలదూర్చినందుకు పోలీసులను న్యాయవాది సురేశ్‌గౌడ్ ప్రశ్నించారు. దీంతో స్థానిక ఎస్సై విజయ్ భాస్కర్ ఏకంగా అడ్వకేట్ అని కూడా చూడకుండా బెదిరించి, దుర్భాషలాడారు. దీన్ని నిరసిస్తూ గద్వాల జిల్లా కోర్టు ఆవరణలో శుక్రవారం న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ మేరకు జడ్జీలకు, డీఎస్పీ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు.