యాచారం, జూన్ 5 : రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండిగౌరెల్లి గ్రామం లో భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయాలని రైతులు ఆర్డీవోను కోరారు. ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి.. అధికారులు, గ్రామస్థులు, రైతులతో కలిసి గురువారం గ్రామంలోని ప్రభుత్వ భూములను పరిశీలించారు. సర్వే నంబర్లు 19,68,127లో పర్యటించి ఆ భూములను స్వయంగా పరిశీలించారు. సదరు భూములకు సంబంధించిన వివరాలను తహసీల్దార్ అయ్యప్పని అడిగి తెలుసుకున్నారు.
ఈ భూమిని సేకరించేందుకు ఇప్పటికే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన భూ సేకరణ నోటిఫికేషన్ రద్దు చేయాలని మాజీ సర్పంచ్ బండిమీది కృష్ణ, మరిపల్లి అంజయ్య యాదవ్, తాండ్ర రవీందర్, మేకల యాదగిరిరెడ్డి తదితరులు ఆర్డీవో అనంతరెడ్డికి విన్నవించారు. ఎన్నో ఏండ్లుగా రైతులు భూములు దున్నుకుంటున్నారని, సదరు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేయాలని కోరారు. రైతు భరోసా, రైతు బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.