హైదరాబాద్/సంగారెడ్డి, జూన్ 5 (నమస్తే తెలంగాణ): భూసేకరణకు వ్యతిరేకంగా ఒకవైపు రైతులు పెద్దఎత్తున ఉద్యమిస్తుంటే, మరోవైపు ప్రభుత్వం తాను అనుకున్నది చేసుకుంటూ పోతున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు పెద్దఎత్తున్న ఆందోళన చేపట్టిన మరుసటి రోజే.. సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాల్ గ్రామంలో 120 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ భూమి మొత్తం బడుగు, బలహీనవర్గాలకు సంబంధించిన అసైన్డ్ భూమి కావడం గమనార్హం. అయితే ఈ భూ సేకరణ నిజంగా పరిశ్రమల కోసమా? రియల్ఎస్టేట్ కోసమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చేర్యాల్ గ్రామంలోని సర్వే నంబర్ 741లో 107 మంది రైతులకు సంబంధించిన 120.16 ఎకరాల అసైన్డ్ భూమిని సేకరించేందుకు జిల్లా కలెక్టర్ గురువారం నోటిఫికేషన్ జారీచేశారు. ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కు విస్తరణ కోసం ఈ భూములు అవసరమైనందున వీటిని సేకరిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. వాస్తవానికి, ప్రభుత్వం పేర్కొంటున్న ప్రాంతంలో పారిశ్రామికవాడ లేదు. లేని ఇండస్ట్రియల్ పార్క్‌ను విస్తరించడం ఏమిటో అర్థం కావడంలేదు. దీనిపై టీజీఐఐసీ అధికారులను, స్థానిక రెవిన్యూ అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా, వారు అందుబాటులోకి రాలేదు. భూమికి సంబంధించిన ప్లాన్ జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నట్టు, కావాల్సినవారు పరిశీలించుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యంతరం ఉన్నవారు 60 రోజుల్లోగా ఏదైనా పనిదినాల్లో జిల్లా కలెక్టర్, లేక ఆర్డీవో కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ప్రభుత్వం పారిశ్రామిక అవసరాల పేరుతో పెద్ద ఎత్తున భూసేకరణ చేపట్టిన విషయం విదితమే. వికారాబాద్ జిల్లా లగచర్లతో మొదలైన ఈ కార్యక్రమం క్రమక్రమంగా మిగిలిన మూడు జిల్లాలకు విస్తరించింది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో భూసేకరణ నోటిఫికేషన్ జారీచేస్తున్న సర్కారు.. రైతుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. అసైన్డ్ భూములు, పచ్చని పంట పొలాలను లక్ష్యంగా చేసుకొని భూసేకరణ కొనసాగిసున్నది. తాజాగా చేర్యాల్ గ్రామంలో 107 మంది రైతులకు సంబంధించిన భూములను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్ శివార్లలో ఎక్కడా ఎకరం భూమి ధర కోటి రూపాయలకు తక్కువలేదు. కానీ, ప్రభుత్వం మాత్రం రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు మాత్రమే రైతులకు ఇస్తామంటున్నది. అయితే లగచర్ల ఘటన నేపథ్యంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. ఎక్కడా ఉద్యమాలు తలెత్తకుండా, రైతులపై బలప్రయోగం వంటివి చేయకుండా నయానో, భయానో వారిని లొంగదీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నట్టు తెలిసింది. దీంతో అధికారులు ముందుగానే రైతులతో మాట్లాడి వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.
తాజాగా సేకరిస్తున్న భూమి సంగారెడ్డికి దగ్గరగా ఉండటంతో అక్కడ రియల్ఎస్టేట్ రంగం బాగా వృద్ధి చెందింది. రైతుల భూములను రియల్ఎస్టేట్ వ్యాపారులు లేఔట్ల కోసం కొనుగోలు చేస్తుండటంతో ఎకరం భూమి ధర రూ.ఒక కోటి నుంచి రూ.రెండు కోట్ల వరకూ పలుకుతున్నది. దీంతో ముందుగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూములను సేకరించి అనంతరం రియల్‌ఎస్టేట్‌కు విక్రయించే వ్యూహంలో భాగంగానే ఈ భూములను సేకరిస్తున్నట్టు పలువురు స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. అసైన్డ్ పట్టాలకు అంతగా ధర పలకకపోవడంతో కొందరు రియల్ఎస్టేట్ వ్యాపారులు, స్థానిక నేతలు కుమ్మక్కై, ముందుగా ఆయా భూముల యజమానులతో ధర మాట్లాడుకొని అసైన్డ్ పట్టాలను ప్రభుత్వానికి సరెండర్ చేయించడం కొంతకాలంగా ఆనవాయితీగా వస్తున్నదని స్థానికులు చెప్తున్నారు.
వారు పట్టాలను సరెండర్ చేసిన తరువాత ప్రభుత్వం నుంచి అందించాల్సిన నష్ట పరిహారాన్ని వారికి అందించి, మిగిలిన మొత్తాన్ని ఆయా కంపెనీల నుంచి లేక రియల్ఎస్టేట్ యజమానుల నుంచి ఇప్పించే విధంగా ముందుగానే ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు చెప్తున్నారు. గతంలో సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో బీర్ల తయారీ కంపెనీ కోసం ఇలాగే ముందుగా అసైన్డ్ పట్టాలను సరెండర్ చేయించినట్టు ఉదహరిస్తున్నారు. అలాగే, సంగారెడ్డి జిల్లాలో గతంలో కంపెనీల కోసమని పలుచోట్ల అసైన్డ్ భూములను సేకరించి అనంతరం కంపెనీలు దివాళా తీసినట్టుగా పేర్కొని, ఆయా భూములను బిల్డర్లకు విక్రయించారని చెప్తున్నారు. ప్రస్తుతం చేరియాల్లో సైతం ఏదో బడా కంపెనీ కోసమో, లేక రియల్ఎస్టేట్ కోసమో గుట్టుచప్పుడు కాకుండా సేకరిస్తున్నారని స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.