Assigned Lands | హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): నిరుపేదల జీవనోపాధి కోసం ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన అసైన్డ్ భూములపై కాంగ్రెస్ సర్కార్ కన్నేసినట్టు స్పష్టమవుత్నుది. ఏడాది పాలనలో ప్రాజెక్టుల పేరుతో ఇచ్చిన భూ సేకరణ నోటిఫికేషన్లను పరిశీలిస్తే.. దళిత, గిరిజనుల భూములే ఎక్కువగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం లగచర్ల, దుద్యాలతో పాటు రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ పారిశ్రామికవాడ, రంగారెడ్డి జిల్లాలో వేస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే.. ఇలా రోడ్లు, పరిశ్రమల పేరుతో ప్రభుత్వం ఎక్కడ భూసేరణ చేపడుతున్నా ఎక్కువగా అసైన్డ్ భూములనే లక్ష్యంగా చేసుకుంటున్నది. పట్టా భూ ములకు నష్టపరిహారం ఇచ్చేందుకు డబ్బు వెచ్చించకలేక.. అసైన్డ్ పట్టాదారులంతా పేదలే కావడంతో వారి నుంచి నయానో, భయానో భూములను గుంజుకోవడం సులభమన్నట్టుగా వ్యవహరిస్తున్నది.
లగచర్ల, మంచిర్యాల, తిమ్మాపూర్, యా చారం, కడ్తాల్, అమనగల్లు, భూపాలపల్లిలోని పలిమెల తదితర ప్రాంతాల్లో చేపట్టిన భూ సేకరణలో ఇదే విధానం బయటపడిం ది. తాజాగా రంగారెడ్డి జిల్లా యాచా రం, కడ్తాల్, అమనగల్లు తదితర మండలాల పరిధిలో మరో 554 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్) నుంచి ప్రతపాదిత రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్)ను కలిపేందుకు 100 మీటర్ల వెడల్పుగల గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు కోసం ఈ భూములను సేకరిస్తున్నారు. ఇందులోనూ అధికంగా అసైన్డ్ భూములే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ వెంట ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీకి రోడ్లు, మెట్రో రైలు, విమానాశ్రయం కనెక్టివిటీని ఏర్పాటు చేసే పేరుతో పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
ఈ క్రమంలోనే ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు విశాలమైన రేడియల్ రోడ్డును రెండు దశల్లో నిర్మిస్తామని ప్రకటించింది. రెండో దశ రోడ్డు నిర్మాణం కోసం ప్రస్తుతం యాచారం మండలంలోని కుర్మిద్ద, కడ్తాల్ మండలం కుడ్తాల్, ముద్విన్ గ్రామాలు, అమనగల్లు మండలం అమనగల్లు, ఆకుతోటపల్లి తదితర గ్రామాల్లో 554.34 ఎకరాలు సేకరించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మీర్ఖాన్పేట నుంచి అమనగల్లు వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర ఇంటర్‌చేంజ్‌లను మినహాయించి 100 మీటర్ల ఆర్ఓడబ్ల్యూ (రైట్ ఆఫ్ వే)తో నేరుగా రోడ్డు నిర్మాణం కోసం భూమి సేకరిస్తున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నది.
రేడియల్ రోడ్డు కోసం నోటిఫై చేసిన భూముల్లో పట్టా, అసైన్డ్, సీలింగ్, ప్రభుత్వ భూములున్నాయి. ఇందులో 70-80 శాతం అసైన్డ్, ప్రభుత్వ భూములే ఉన్నాయని స్థానిక రైతులు చెప్తున్నారు. వీటికి ఆనుకొని కొందరు పెద్దలకు సంబంధించిన భూములున్నా వాటిని తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగా అలైన్‌మెంట్‌ను తమ భూముల నుంచి వెళ్లేలా చేశారని దళిత రైతులు ఆరోపిస్తున్నారు. అలైన్మెంట్ రూపొందించడంలో సర్కారు వివక్ష చూపిందని మండిపడుతున్నారు.
ఈ భూములకు సంబంధించి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో ఉన్న శంషాబాద్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ) కార్యాలయంలో మరిన్ని వివరాలు పొందవచ్చని నోటిఫికేషన్లో తెలిపారు. భూసేకరణ చట్టం ప్రకారం భూముల్లోకి ప్రవేశించడం, సర్వే చేయడం, కొలతలు తీసుకోవడం, తవ్వకాలు జరపడం, బోరు వేయడం, ఇతర చర్యలు చేపట్టడానికి సంబంధిత అధికారులకు పూర్తి అధికారం కల్పించినట్టు పేర్కొన్నారు. ఈ భూముల క్రయవిక్రయాలపై నిషేధం విధించారు.
రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కారు కొలువుదీరిన తర్వాత చేపట్టిన భూసేకరణ మొత్తం వివాదాస్పదంగానే ఉన్నది. అన్నిచోట్లా ఇదే తంతు కొనసాగుతున్నది. లగచర్లలో (దుద్యాల) ఇండస్ట్రియల్ కారిడార్ కోసం సుమారు 1500 ఎకరాలు సేకరిస్తుండగా, అందులో అత్యధికంగా గిరిజనులు, దళితుల భూములే ఉన్నాయి. గిరిజన రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా భూసేకరణ ప్రక్రియ కొనసాగిస్తున్నది. తొలుత ఫార్మా క్లస్టర్ కోసం భూమి సేకరిస్తామని చెప్పగా తర్వాత రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో కొంత వెనక్కి తగ్గింది. ఆ తర్వాత మళ్లీ అక్కడే ఇండస్ట్రియల్ కారిడార్‌ను ప్రభుత్వం ప్రతిపాదించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నది. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో ఇండస్ట్రియల్ పార్క్ కోసం పూర్తిగా 567 ఎకరాల అసైన్డ్ భూములు సేకరిస్తున్నది.
ఇందులో మొత్తం దళితుల భూములే ఉన్నాయి. దీనికి దగ్గరలోనే ప్రైవేట్ వ్యక్తుల భూములున్నా వాటి జోలికి ప్రభుత్వం వెళ్లడంలేదు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్లో కూడా అసైన్డ్ భూములు భారీగా ఉన్నట్లు సమాచారం. మంచిర్యాలలో పారిశ్రామికవాడ కోసం ప్రస్తుతం హాజీపూర్ మండలం వేంపల్లి, పోచంపాడు గ్రామాల్లో 276 ఎకరాల సేకరణకు ప్రయత్నిస్తుండగా ప్రస్తుతం సర్వే జరుగుతున్నది. ఆ తర్వాత నోటిఫికేషన్ జారీ కానుంది. ఇందులోనూ దళితుల భూములే ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. వీటిని 2009లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అసైన్డ్ చేశారు.
గత నెలలో కొందరు కాంగ్రెస్ నేతలు ఈ భూములు ఇవ్వాలని బెదిరించి సంతకాలు చేసుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జగిత్యాల జిల్లా భీమారం మండలంలో సూరమ్మ చెరువు కుడికాలువ నిర్మాణంకోసం, భూపాలపల్లిలోని పలిమెలలో సిమెంట్ కంపెనీ కోసం భూసేకరణ చేస్తుండగా, ఈ ప్రాంతాల్లోనూ ఎక్కువగా అసైన్డ్ భూములే ఉన్నట్టు తెలిసింది. అందులోనూ ఎకరం, రెండెకరాలలోపు భూములున్న నిరుపేదలే భూములు కోల్పోతున్నారు.
ప్రభుత్వం బలవంతంగా భూసేకరణకు దిగడంతో పేదలు ఏమిచేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నా ప్రభుత్వం పోలీసులతో ఆందోళనలను అణచివేస్తూ అక్రమ కేసులతో జైళ్లకు పంపుతుండడంతో చాలామంది తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే అరకొర నష్ట పరిహారంతో తాము ఎక్కడా భూములు కొనుగోలు చేసుకునే పరిస్థితి లేదని, అందుకే ప్రభుత్వమే భూమికి బదులు భూమి ఇవ్వాలనే డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయం తప్ప వేరే పనులు తమకు రావని, అందుకే తమ జీవనాధారం కోల్పోకుండా చూడాలని కోరుతున్నారు.
లగచర్ల, ఆర్ఆర్ఆర్ బాధితులు తమకు భూములకు బదులు భూములు ఇవ్వాలని, లేదంటే బహిరంగ మార్కెట్ ధరలు తమకు ఇవ్వాలని కోరుతున్నారు. ఇక భూ సేకరణలో పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వాలని నిబంధనలు చెప్తున్నాయి. నిరుడు జనవరిలో హైకోర్టు సైతం ఇదే తీర్పు ఇచ్చింది. అసైనీలకు మార్కెట్ విలువకు సమాన పరిహారం, పట్టా యజమానులతో సమానంగా ఇతర ప్రయోజనాలు కల్పించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు సైతం ఇవే మార్గదర్శకాలు ఇచ్చిందని గుర్తుచేసింది.