కందుకూరు, డిసెంబర్ 9(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై మరో పిడుగు వేసేందుకు సిద్ధమైంది. లగచర్లలో రైతుల పోరాటం మరవకముందే అన్నదాతలపై సర్కారు మరో పిడుగు వేస్తున్నది. ఫోర్త్ సిటీ పేరిట కొత్త నగరం నిర్మిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి పలు వేదికలపై ప్రకటించారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లోనే ప్రతిపాదిత ఫోర్త్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నారు. కానీ రోడ్ల కోసమంటూ సర్కారు మరోసారి అవసరానికి మించి భూములు సేకరించేందుకు సిద్ధమైంది. దీంతో అన్నదాతలు ఆందోళనబాట పట్టారు.
నాడు ఒప్పందం.. నేడు నిర్బంధం
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలో ఫార్మా సిటీ ఏర్పాటుకు గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఒప్పించి, మెప్పించి 14వేల ఎకరాలకుపైగా భూమి సేకరించింది. ప్రస్తుతం ఈ భూములన్నీ ప్రభుత్వ స్వాధీనంలోనే ఉన్నాయి. ఫార్మా సిటీ కోసం నాగార్జునసాగర్, శ్రీశైలం హైవే, ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా విశాలమైన రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. ఇందులో కందుకూరు నుంచి మీర్ఖాన్పేట(బేగరికంచె) వరకు 200 ఫీట్ల రోడ్డు నిర్మాణం పూర్తయింది. కాంగ్రెస్ సర్కారు ఫార్మాసిటీ ప్రతిపాదనను రద్దు చేసింది. ఆ భూముల్లోనే ఫోర్త్ సిటీ ఏర్పాటు చేస్తామని చెబుతున్నది. ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్-13 కొంగరకలాన్ నుంచి బేగరికంచే వరకు 330 ఫీట్ల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఈ రోడ్డు వల్ల 1909 మంది రైతులు 441.34 ఎకరాల భూమి కోల్పోనున్నారు. ఇందులో చాలామంది సన్న, చిన్నకారు రైతులే ఉన్నారు. జీవనాధారంగా ఉన్న భూమంతా కోల్పోతే తాము ఎలా బ్రతికేది అంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సర్వే మొదలు పెట్టినప్పుడే రైతులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. కొన్నిచోట్ల సర్వేను అడ్డుకున్నారు. ఇప్పటికే 200 ఫీట్ల రోడ్డు ఉండగా సమాంతరంగా మరో రోడ్డు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రభుత్వం పోలీసు పహారా మధ్య రైతులను నిర్బంధించి మరీ సర్వేను ముగించింది.
పంతం వీడని ప్రభుత్వం..తప్పదు న్యాయపోరాటం
గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి సేకరించనున్న 441.34 ఎకరాల భూములు కందుకూరు మండల పరిధిలోని లేమూరు, తిమ్మాపూరు, రాచులూరు, గుమ్మడవెల్లి(రిజర్వ్ ఫారెస్ట్), పంజగూడ(టీటీఐఐసీ), మీర్ఖాన్పేట్లో భూములు ఉన్నాయి. సర్వే మొదలైనప్పటి నుంచి రైతులు ప్రజాప్రతినిధలు చుట్టూ తిరుగుతూ తమ భూములను కాపాడాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకుపోతుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఫార్మా సిటీకి వేసిన రోడ్లను వినియోగించుకోవడం వల్ల తమ భూములు తమకు దక్కుతాయని చెబుతున్నారు. ప్రభుత్వం మొండివైఖరితో ముందుకు వెళితే తాము న్యాయ పోరాటం చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేదిలేదని తెగేసి చెబుతున్నారు.
నా రెండెకరాల పొలం పోతుంది
భూమిని నమ్ముకుని జీవిస్తున్నా. వ్యవసాయంపై ఆధారపడి మా పిల్లల్ని చదివించుకుంటున్న. హఠాత్తుగా ప్రభుత్వం నా పొలం నుంచి రోడ్డు తీసుకుపోయేందుకు సర్వే చేసింది. సర్వే వద్దని అధికారులకు మొరపెట్టుకున్నా.. పోలీసులు వచ్చి బలవంతంగా సర్వే పూర్తి చేసిండ్రు. నాకున్నదే రెండెకరాలు. ఉన్న కాస్త పొలం పోతే ఎట్ల బతకాలి? నా భూమిని ఇచ్చేదే లేదు.
– ధ్యాసాని సుధాకర్‌రెడ్డి, రైతు
భూమి పోయాక మేం ఉంటే ఏంది, పోతే ఏంది?
మేం చస్తే కూడా బొంద పెట్టడానికి జాగా లేకుండా చేస్తున్నరు. నాకున్న రెండున్నర ఎకరాల పొలం కూడా రోడ్డుకే పోతుందట. అందులో ఉన్న బోరు, పంటలు పోతున్నయి. ఈ రేవంత్‌రెడ్డి ఎందుకిట్ల చేస్తుండో అర్థమైతలేదు? ప్రభుత్వానికి న్యాయం అయితదా? ప్రభుత్వ భూమి పక్కనే ఉంది, అండ్లకెల్లి రోడ్డు తీసుకపోవాలి. మా భూములే దొరికినయా? మమ్ములను సంపి రోడ్డు ఏసుకోవాలి. రోడ్డుకు మాత్రం పొలం ఇయ్యం.
– రమావత్ చాందిని, గాజులబుర్జుతండా
న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా
రేవంత్‌రెడ్డికి రైతులంటే ఇంత చులకనా? మాకు నోటీసులు ఇయ్యకుండనే భూమి సర్వే చేసిండ్రు. భూములను ఇయ్యడానికి మేము సిద్ధంగా లేము. ఉద్యోగాలు రాకపోవడంతో చదువులు మానేసి వ్యవసాయం చేసుకుంటున్నం. నాకు రెండెకరాల భూమి మాత్రమే ఉంది. అందులో నుంచి రోడ్డు వేయడానికి సర్వే చేసిండ్రు. ఉన్న రెండెకరాల భూమి ఇస్తే నేనెట్ల బతకాలి? నా భూమి పోకుండా ఉండేందుకు న్యాయ పోరాటం చేస్తాను.
– శ్రీకాంత్, అగర్మియాగూడ
భూములిచ్చేది లేదు… పోరాటానికి సిద్ధంగా ఉన్న
బలవంతంగా సర్వే నిర్వహించారు. నా భూమిలోకి నేను పోవడానికి కూడా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. మమ్మల్ని మా పొలాల దగ్గరకు పోనీయలేదు. మార్పు అంటే ఇదానా రేవంత్‌రెడ్డి? పొలం పోతే పొలం వస్త దా? నీకు రైతుల సమస్యలు పట్టవా? భూములు గుంజుకోవడం న్యాయమా? మేం భూములిచ్చేది లేదు, ఎంతకైనా తె గిస్తాం. పోలీసులను పెట్టి భూములు తీసుకుంటే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాం.
– బండ రమేశ్, రైతు
చావనైనా చస్తా.. భూమి మాత్రం ఇయ్యను
చావనైనా చస్తాంగానీ భూమి మాత్రం ఇయ్యం. అప్పులు చేసి పౌల్ట్రీ పెట్టుకున్నం. ఇంకో ఎకరంన్నరలో పూల తోట వేశాం. ఈ మొత్తం భూమి కూడా రోడ్డులో పోతదట. భూమి సర్వే కూడా మాకు తెల్వకుండానే చేసిండ్రు. మాకు అధికారులు సమాచారం ఇస్తలేరు. భూమి పోతే సావే గతి. మేం పొలాన్ని నమ్ముకొని బతుకుతున్నం. పొలం పోతే మా బతుకులు ఎట్లా? ప్రభుత్వం వెంటనే రోడ్డు వేయడం ఆపేయాలి.
– కాడమోని పద్మ, తుర్కగూడ